Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 27/10/2021 16:58 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. విద్యాసంస్థల అంగీకారంతోనే తీసుకుంటున్నాం.. బలవంతం చేయట్లేదు: సురేశ్‌

ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎయిడెడ్ విద్యా సంస్థలను సర్కార్‌ బలవంతం చేయడం లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. విద్యా సంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుంటుందన్నారు. విద్యా సంస్థలను ఎవరు నడిపినా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తామే నడుపుకుంటామంటే వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేశారు. 

2. ఈటల భారీ మెజారిటీతో గెలవబోతున్నారు: బండి సంజయ్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజలు తమ పార్టీ సామర్థ్యాన్ని నమ్మి ఓట్లేయబోతున్నారని చెప్పారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌ ప్రజల్ని అయోమయానికి గురి చేయాలని తెరాస నేతలు చూస్తున్నారని ఆరోపించారు. దళితబంధు విషయంలో వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నారు. 

3. ఈటలది బయట బీసీ కార్డు.. లోపల ఓసీ కార్డు: శ్రీనివాస్‌గౌడ్ 

మంత్రి పదవిలో ఉన్నప్పుడే ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని.. ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఈటలను తెలంగాణకు పరిచయం చేసింది సీఎం కేసీఆరేనని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హుజూరాబాద్‌ వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఈటలపైనే ఎందుకొచ్చాయని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఆయనది బయట బీసీ కార్డు.. లోపల ఓసీ కార్డు అని ఎద్దేవా చేశారు. 

4. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: అచ్చెన్న

సీఎం జగన్ పాలనలో రైతుల ఇళ్లలో చీకటి నిండిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతు భరోసా కింద ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రూ.30 కోట్లు విడుదల చేసి.. రూ. 1,213 కోట్లు ఇచ్చినట్లు రైతుల్ని మోసగిస్తారా అని నిలదీశారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న జగన్‌ క్షమాపణలు చెప్పాలని అచ్చెన్న డిమాండ్‌ చేశారు. 

5. కొత్త పార్టీ పెడుతున్నా.. త్వరలో ఆ వివరాలు చెప్తా..!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవిని వీడిన అమరీందర్ సింగ్.. త్వరలో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనిపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లు, కొద్ది రోజుల తర్వాత ఆ వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. 

6. పెట్రోల్‌ సూపర్‌ స్పీడ్‌.. అక్కడ రూ.120 దాటింది!

 దేశంలో పెట్రోల్‌ ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. లీటరు ధర వంద రూపాయల మార్కు దాటిన అనంతరం ఇవి మరింత వేగంగా పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్‌ ధర రూ.120 మార్కును దాటింది. ఇక్కడే కాకుండా దేశంలో చాలా ప్రాంతాల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.110కిపైగా ఉండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

7. క్రమబద్ధంగా డ్రోన్ల ట్రాఫిక్‌.. ప్రణాళిక రూపొందించిన కేంద్రం

డ్రోన్ల వినియోగం పెరుగుతుండడంతో వాటి ‘ట్రాఫిక్‌’ను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో కేంద్ర పౌర విమానయాన శాఖ ‘డ్రోన్ల ట్రాఫిక్‌ నిర్వహణ ప్రణాళిక’ను రూపొందిస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీటికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు, తృతీయపక్ష సేవలు అందించే సంస్థలు విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. డ్రోన్లన్నీ 1,000 అడుగుల ఎత్తుకు మించకుండా ఎగరాల్సి ఉన్నందున ఆ మేరకు నిబంధనలు రూపొందించింది.

8. దీపావళికే జియోఫోన్‌ నెక్స్ట్‌ .. ధ్రువీకరించిన పిచాయ్‌!

జియో-గూగుల్‌ సంయుక్తంగా తీసుకొస్తున్న జియోఫోన్‌ ‘నెక్స్ట్‌’ను దీపావళి సందర్భంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల భారత్‌ తీవ్రంగా ప్రభావితమైందన్నారు. అయినప్పటికీ.. కొత్తగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటుపడ్డవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అలాగే ఇంకా అనేక మంది ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 

9. మళ్లీ నష్టాల్లోకి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

రెండు రోజుల విరామం తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు చివరి గంట వరకు స్వల్ప లాభాల్లో కొనసాగాయి. కానీ, చివర్ల్లో కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు కిందకు దిగజారాయి. ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్‌ సూచీలు సైతం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 

10. సెమీస్‌కు టీమిండియా వెళ్తుందన్న బ్రెట్‌లీ.. అయితే ఎప్పుడంటే?

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ బ్రెట్‌లీ అంచనా వేశాడు. పూర్తి సామర్థ్యాలతో రాణించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇప్పటికైనా హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేసేందుకు సిద్ధం కావాలని సూచించాడు. అలానే భువనేశ్వర్‌ కుమార్‌ పేస్ రాబట్టాలని పేర్కొన్నాడు. పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్‌లీ మాట్లాడుతూ.. టీమిండియా బౌలింగ్‌తో టోర్నీలో తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని