Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 28/10/2021 17:01 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. కొత్తగా 4 వేల ఉద్యోగాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

ఏపీలో వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాలకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ భేటీ నిర్ణయాలను మంత్రి పేర్ని వెల్లడించారు. వైద్య శాఖలో కొత్తగా 1,285 ఉద్యాగాలు, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో 560 ఫార్మాసిస్టులు, వైద్య కళాశాలల్లో 2,190 మంది నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.

విశాఖలో అదానీ సంస్థకు 130 ఎకరాలు 

2. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం వరిసాగు చేయొద్దంటోంది?: బండి సంజయ్‌

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్‌ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ అయోమయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం గతంలో చెప్పారన్నారు. వరి సాగుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో బండి సంజయ్‌ దీక్షకు దిగారు. ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరిసాగు చేయొద్దంటోందని ప్రశ్నించారు.

3. అభ్యంతరకర పోస్టులపై చర్యలెందుకు తీసుకోలేదు?: హైకోర్టు

సోషల్‌ మీడియాలో జడ్జిలు, కోర్టులపై అనుచిత వ్యాఖ్యల కేసుపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా హైకోర్టు  సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ ఎస్పీ రేపు కోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని సీబీఐ అరెస్టు చేసింది.

4. మావి ఓట్లు కావా..? మాకేవి డబ్బులు..?
హుజూరాబాద్‌లో ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు తాయిలాలు ఇద్దామనుకొంటే.. అది కాస్తా వికటించి సరికొత్త గొడవలకు దారి తీస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నువ్వా.. నేనా.. అనే విధంగా పార్టీలు ప్రచారం చేశాయి. ప్రస్తుతం ప్రచార గడువు ముగియడంతో పలు గ్రామాల్లో డబ్బులు రాలేదని గొడవలు మొదలయ్యాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ప్రతి గ్రామానికి సీల్డ్‌ కవర్లలో డబ్బు చేరిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

5. సీఎం జగన్‌తో సినీనటుడు నాగార్జున భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి చాలా రోజులైందని, అందుకే తాను విజయవాడ వచ్చినట్లు సినీ నటుడు, నిర్మాత నాగార్జున అన్నారు. గురువారం ఏపీ మంత్రి వర్గ సమావేశం అనంతరం నాగార్జునతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డిలు ఉన్నారు.

6. దిల్లీలో 90 శాతం మందిలో యాంటీబాడీస్‌.. హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చినట్లేనా?

దిల్లీలో నిర్వహించిన సీరోలాజికల్‌ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. నగరంలోని 90 శాతం మందిలో యాంటీబాడీస్‌ ఉన్నట్లు సర్వే రిపోర్టులో తేలింది. సెప్టెంబర్‌ 23 నుంచి నిర్వహించిన ఆరో దశ సీరో సర్వేలో ఈ విషయం తేలింది. అయితే, సీరో సర్వేలో దాదాపు 90 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చినట్లు చెప్పలేమని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

7. ‘బ్లాక్‌ లైవ్స్ మ్యాటర్‌’ వివాదానికి డికాక్‌ క్షమాపణలు

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మోకాళ్లపై కూర్చొని ఎందుకు సంఘీభావం తెలపలేదో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ వివరణ ఇచ్చాడు. తన హక్కులు హరించుకుపోతున్నాయనే కారణంతోనే ఇలా చేశానని చెప్పాడు. ఈ క్రమంలోనే తనపై ‘రేసిస్ట్‌’ అనే ముద్ర పడటం బాధగా ఉందన్నాడు. అలాగే తన చర్యతో ఎవరి మనోభావాలైన దెబ్బతీస్తే క్షమాపణలు చెబుతున్నానని చెప్పాడు. 

8. Drugs Case: ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరు 

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరైంది. బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో దాదాపు 21 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.

9. అదిరే ఫీచర్లతో పల్సర్‌ కొత్త బైక్‌ వచ్చేసింది!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌.. పల్సర్‌ 250 మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. పల్సర్‌ ఎన్‌250 పేరుతో విపణిలోకి వచ్చిన ఈ బైక్‌ ధర రూ.1.38లక్షలు, దీంతో పాటు, పల్సర్‌ ఎఫ్‌250 రూ.1.40లక్షల ధర (ఎక్స్‌ షోరూమ్‌ దిల్లీ)తో మరో మోడల్‌ను విడుదల చేసింది. 220ఎఫ్‌కు ప్రత్యామ్నాయంగా పల్సర్‌ 250ఎఫ్‌ను విడుదల చేశారు. గురువారం నుంచే బుకింగ్స్‌ చేసుకోవచ్చని బజాజ్‌ తెలిపింది.

10. ఐరాస మీటింగ్‌లో డైనోసర్‌.. ఉలిక్కిపడ్డ ప్రపంచ నేతలు

అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి అనూహ్య అతిథి హాజరైంది. ఐరాస జనరల్‌ అసెంబ్లీ జరిగే కావెర్‌నోస్‌ హాల్‌లోకి డైనోసర్‌ వచ్చింది. దీంతో ఆ సమావేశంలో పాల్గొన్న ప్రపంచ నేతలు, పలు దేశాల దౌత్యవేత్తలు భయంతో ఉలిక్కిపడ్డారు. అక్కడి నుంచి నేరుగా పోడియం వద్దకు వెళ్లిన ఆ డైనోసర్‌ మానవాళిని ఉద్దేశించి ప్రసంగించింది. ఈ సందర్భంగా ప్రపంచంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆ జీవి.. ‘‘వినాశనాన్ని ఎంచుకోకండి.. మానవజాతిని కాపాడుకోండి’’ అంటూ విజ్ఞప్తి చేసింది. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని