Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

తాజా వార్తలు

Updated : 30/07/2021 17:01 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. విశాఖ మన్యంలో అక్రమ తవ్వకాలపై విచారణ కమిటీ

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలపై విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీని ఏర్పాటు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కొండ్లు మరీదయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్‌ పేరుతో అక్రమాలు జరిగాయని ఎన్జీటీ నిర్ధరణకు వచ్చింది.

2. తెలంగాణలో రెండు డెల్టా ప్లస్‌ కేసులు

తెలంగాణలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 23 వరకు దేశ వ్యాప్తంగా 70 డెల్టాప్లస్‌ వేరియంట్‌ కేసులు వెలుగు చూడగా.. తెలంగాణలో 2, ఏపీలో 2 చొప్పున కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ల్లో చేసిన పరిశోధనల్లో ఈ కేసులను గుర్తించినట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.

ఆగస్టు 31లోపు ఆక్సిజన్‌ ప్లాంట్లు

3. ‘‘అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను పంచుతాం’’

2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్‌ మాట్లాడారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 

4. ఉభయ సభల్లో అదే రగడ.. వాయిదా పడిన లోక్‌సభ

పెగాసస్ హ్యాకింగ్, ఇతర అంశాలపై పార్లమెంట్ దద్దరిల్లుతూనే ఉంది. వాటిపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి. జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తొమ్మిదోరోజు రెండు సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

5. ఏపీలో తెదేపా నేతల గృహనిర్బంధం

కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండపల్లి ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమాపై పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్‌ వ్యవహారంపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పది మంది పార్టీ నేతలతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు రేపు ఉదయం కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలను పరిశీలించనున్నారు.

6. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌(cbseresults.nic.in లేదా cbse.gov.in) ద్వారా వీక్షించవచ్చు. దాంతో పాటు digilocker.gov.in, డిజిలాకర్ యాప్‌లో ఫలితాలను చూసుకునే వెసులుబాటు కల్పించారు.

7. Stock market: చివర్లో వెల్లువెత్తిన అమ్మకాలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఇంట్రాడే గరిష్ఠాలకు చేరాయి. అయితే, కీలక రంగాల్లో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో గరిష్ఠాల నుంచి సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

8. పవర్‌స్టార్‌ పెయిర్‌ ఫిక్స్‌.. కపుల్‌గా వచ్చిన నాగశౌర్య

సినీ పరిశ్రమలో శుక్రవారానికి ఎంతో ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్‌వేవ్‌ అనంతరం ఇప్పుడు మళ్లీ పరిశ్రమలో ఫ్రైడే ఫెస్టివల్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఓ వైపు ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌: నాట్‌ ఏ లవ్‌ స్టోరీ’ థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకు రాగా, మరోవైపు కొత్త సినిమా అప్‌డేట్‌లు సినీ ప్రియులకు రెట్టింపు ఉత్సాహాన్ని అందించాయి. అలా ఈరోజు బయటకు వచ్చిన తెలుగు సినీ అప్‌డేట్‌లపై ఓ లుక్కేయండి..!

టాలీవుడ్‌లో ఈసారి రచ్చ రచ్చే..!

9. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరిన సింధు

రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన భారత అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి. సింధు మరోసారి సత్తా చాటింది. టోక్యో ఒలింపిక్స్‌లో విజయ దుందుభి మోగిస్తూ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగూచిపై 21-13, 22-20తో అద్భుత విజయం సాధించింది. దాంతో మరోసారి భారత్‌కు పతకం ఖాయం చేసేలా కన్పిస్తోంది.

ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్‌ 

10. అయ్యో దీపికా.. హాకీ ఆశలు సజీవం
విశ్వ క్రీడల్లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ప్రపంచ నంబర్‌ వన్‌ ఆర్చర్‌ దీపికా కుమారి కొద్దిసేపటి క్రితం జరిగిన మహిళల ఆర్చరీ  క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిపోయింది. కనీస పోరాటం లేకుండా కొరియా టాప్‌సీడ్‌ యాన్‌సాన్‌ చేతిలో 6-0 తేడాతో ఓటమిపాలైంది. దాంతో మహిళల ఆర్చరీ విభాగంలో పతకం ఖాయమని భావించినప్పటికీ చేదు అనుభవమే మిగిలింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని