Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 27/07/2021 21:04 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్‌ బొమ్మై

కర్ణాటకలో యడియూరప్ప రాజీనామాతో కొత్త వారసుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మైని భాజపా ఖరారు చేసింది. రాష్ట్ర ఓటర్లలో అత్యధిక ప్రాబల్యం కలిగిన లింగాయత్‌ సామాజిక వర్గానికే మళ్లీ సీఎం పీఠాన్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. బసవరాజ్‌ బొమ్మై ఎంపికపై భాజపాలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం.

2. Pink Book: పెట్టుబడిదారుల నిర్ణయాలకు దిక్సూచి: కేటీఆర్‌

తెలంగాణలో పెట్టుబడులు, అవకాశాలు, ఇతర అంశాలతో సమగ్రంగా రూపొందించిన ‘పింక్ బుక్ - ఇన్వెస్టర్స్ గైడ్ టు తెలంగాణ 2021’ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, సౌకర్యాలు, మౌలిక వసతులను తెలిపే ఈ పుస్తకం.. పెట్టుబడిదారులు భవిష్యత్‌లో తీసుకొనే నిర్ణయాలకు దిక్సూచి లాంటిదన్నారు.

ఆగస్టు 3 నుంచి ‘గాంధీ’లో నాన్‌-కొవిడ్‌ సేవలు

3. ఏపీ పరిమితికి మించి అప్పులు చేసింది: కేంద్ర ఆర్థిక శాఖ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించి రు.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంత్సరానికిగాను రు.54,369.18 కోట్లు ఆర్థిక లోటుగా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్‌లో స్పష్టం చేసిందని పేర్కొంది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మాజీ మంత్రి దేవినేని ఉమా వాహనంపై రాళ్లదాడి

4. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులు తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది.  ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశాలకు (ఈఏపీసెట్‌) ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కలు తొలగించారు. ఇప్పటివరకు ఇంటర్‌ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని తొలగించింది. ఈ ఏడాది ఈఏపీసెట్‌ 100శాతం రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ వెల్లడించారు.

5. ప్రధాని మోదీతో సమావేశమైన దీదీ
హస్తిన పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ సాయంత్రం ప్రధాని నివాసానికి వెళ్లిన ఆమె.. మోదీతో సమావేశమయ్యారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం తర్వాత దీదీ.. ప్రధాని మోదీతో భేటీ అవడం ఇదే తొలిసారి. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు.

6. ఐ-ప్యాక్‌ సభ్యులది నిర్బంధం కాదు.. క్వారంటైన్‌..!
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన భారత రాజకీయ కార్యాచరణ కమిటీ(ఐ-ప్యాక్‌) సభ్యుల్ని గృహ నిర్బంధంలో ఉంచినట్లు వస్తున్న వార్తల్ని త్రిపుర పోలీసులు తోసిపుచ్చారు. వారిని నిర్బంధించలేదని.. క్వారంటైన్‌లోనే  ఉంచామని పోలీసులు మంగళవారం స్పష్టం చేశారు. 22 మంది ఐ-ప్యాక్‌ సభ్యులకు సంబంధించి కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు వారు వెల్లడించారు.

7. రాజ్‌కుంద్రాకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో అరెస్టయిన నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అశ్లీల చిత్రాలను నిర్మించి.. వాటిని పలు యాప్‌లకు విక్రయిస్తున్నాడనే కేసులో రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు ఈనెల 19న అరెస్టు చేశారు. కాగా రాజ్‌కుంద్రా పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది.

8. కొవిషీల్డ్‌తో 94శాతం రక్షణ..!

కరోనా వైరస్‌ నుంచి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ 93శాతం రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా మరణాలు సంభవించే ప్రమాదాన్ని 98శాతం తగ్గిస్తోన్నట్లు తెలిపింది. సెకండ్‌ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌ విజృంభిస్తోన్న సమయంలో కొవిషీల్డ్‌ ప్రభావంపై దేశవ్యాప్తంగా 15లక్షల మంది వైద్యులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లపై ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ (AFMC) జరిపిన అధ్యయన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

9. జులై నాటికి 50కోట్ల డోసులు ఇచ్చి తీరుతాం!

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగా సాగుతోందంటూ వస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ముందస్తుగా నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోందని స్పష్టం చేసింది. ముఖ్యంగా జులై నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వస్తున్నవి తప్పుడు కథనాలని పేర్కొంది.

10. హాట్‌స్టార్‌లో ‘వీఐపీ’ అవుట్.. ‘మొబైల్’ ఇన్‌

నెట్‌ఫ్లిక్‌కు పోటీగా డిస్నీ+ హాట్‌స్టార్ మూడు కొత్త ప్లాన్లను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్ ₹499, సూపర్ ₹899, ప్రీమియం ₹1,499లతో ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ కంటెంట్‌ను యూజర్స్‌ ఆస్వాదించవచ్చు. సెప్టెంబరు 1 నుంచి ఈ కొత్త ప్లాన్లు అమల్లోకి రానున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని