Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 30/07/2021 20:59 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. గ్రామ, వార్డు సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు : జగన్‌

పురపాలక, పట్టణాభివృద్ధిశాఖతోపాటు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ ‘క్లాప్‌, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌, విశాఖ అభివృద్ధి ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌ ఇవాళ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సన్నద్ధం కావాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. దీని వల్ల ప్రతి 2 వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వస్తుందన్నారు. ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయని, భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. 

ఏపీలో 108 కాల్‌ సెంటర్‌ సేవలకు అంతరాయం

2. బయోటెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం హైదరాబాద్‌ జినోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రవేత్తలనుద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. జినోమ్‌ వ్యాలీలో అనేక సంస్థలు కొలువుదీరాయని, హైదరాబాద్‌ బయో టెక్నాలజీ హబ్‌గా మారుతోందన్నారు. భారత్‌ బయోటెక్‌ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. 

3. నేతన్నలకు రైతు బీమా తరహా సౌకర్యం: కేసీఆర్‌

భాజపాకు రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సీఎం కేసీఆర్‌ ఇవాళ గులాబీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో పెద్దిరెడ్డి చేదోడు వాదోడుగా ఉంటారు. సామాజిక వివక్షకు గురైన వారికి పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. చేనేత కార్మికులకు రైతు బీమా తరహా సౌకర్యం కల్పిస్తాం. ఆరునూరైనా దళతబంధు ఆగదు.. ఆపలేరు. 100% అమలు చేసి తీరుతాం ’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

4. ఎల్లుండి కేబినెట్‌ భేటీ..50వేల ఉద్యోగాలపై చర్చించే అవకాశం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఎల్లుండి మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. దళిత బంధు పథకంపై ప్రధానంగా చర్చించి, హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. దళిత బీమా, చేనేత బీమా పథకాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 50వేల ఉద్యోగాల అంశంపై కూడా మంత్రివర్గం మరోసారి చర్చించనుంది.

5. మీ ఆలోచనలు..ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయి

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోన్న తరుణంలో దేశ ప్రజలు విలువైన సూచనలు ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగంలో వాటిని భాగం చేయనున్నట్లు శుక్రవారం పీఎంఓ వెల్లడించింది. ‘మీ ఆలోచనలు ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రతిధ్వనిస్తాయి. ఆగస్టు 15న ప్రధాని నరంద్ర మోదీ ప్రసంగం కోసం మీరు ఏ సూచనలు ఇస్తారు? వాటిని mygovindiaలో పంచుకోండి’ అని పీఎంఓ ట్వీట్ చేసింది. 

6. మళ్లీ కొవిడ్‌ విజృంభణ.. కర్ణాటకలో ఆంక్షలు

కొద్దివారాలుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన కొవిడ్ మహమ్మారి.. మరోమారు విజృంభిస్తోంది. వైరస్​ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఉన్న ఆంక్షలను కఠినతరం చేయడం సహా కొత్త నిబంధనలను విధిస్తున్నాయి. కర్ణాటకకు వచ్చేవారికి నెగిటివ్​ ఆర్​టీపీసీఆర్​ రిపోర్టు తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర సర్కారు.

7. బొమ్మైకి నేనిచ్చే సలహా అదే..!

కర్ణాటక కొత్త కేబినెట్‌లో మంత్రుల ఎంపిక విషయంలో తన జోక్యం ఉండదని భాజపా సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప పునరుద్ఘాటించారు. పార్టీ బలోపేతం కోసం తన కృషి కొనసాగుతుందన్నారు. పార్టీ అధినాయకత్వంతో సంప్రదించి కొత్త మంత్రులను ఎంపిక చేసే పూర్తి స్వేచ్ఛ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకే ఉంటుందని పేర్కొన్నారు. 

8. జీఎస్‌టీ రేట్ల మార్పు!

ప్రభుత్వ అజెండాలో జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ ఉందని.. కచ్చితంగా జరుగుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్‌ తెలిపారు. మూడు రేట్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమని ఆయన వివరించారు. ఎక్సైజ్‌ సుంకం, సేవా పన్ను, వ్యాట్‌ వంటి డజనుకు పైగా కేంద్ర, రాష్ట్ర సుంకాలను కలిపి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను జులై 2017లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి విదితమే.

9. భారత అంకుర సంస్థలో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడులు?

భారత్‌కు చెందిన అతిపెద్ద అంకుర సంస్థ ఓయోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులతో ఓయో మార్కెట్‌ విలువ 9 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. 

10. హాకీలో అదరగొడుతున్న టీమ్‌ఇండియా

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో అదరగొడుతోంది. శుక్రవారం పూల్‌-ఏ విభాగంలో జపాన్‌తో తలపడిన భారత్‌ 5-3 తేడాతో మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో పూల్‌-ఏలో టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా తర్వాత నాలుగు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని