Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 01/08/2021 20:54 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు

ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగి పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించింది.

సింధుకు అభినందనల వెల్లువ

2. దిల్లీకి చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో మొదలైన ఉద్యమం దిల్లీకి చేరింది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించేందుకు వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు హస్తినకు పయనమయ్యారు. 32 మంది అమర వీరుల త్యాగఫలం విశాఖ ఉక్కు అని ఈ సందర్భంగా కార్మికులు స్పష్టం చేశారు. 64 గ్రామాల నిర్వాసితులు 26వేల ఎకరాల భూమిని త్యాగం చేశారని నినదించారు. 

3. నాగార్జున సాగర్‌ 14 గేట్లు ఎత్తిన అధికారులు

నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ సందడి మొదలైంది. శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఈరోజు సాయంత్రం 14 క్రస్టు గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

4. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సోము వీర్రాజు

రాష్ట్రంలో వనరులు- సవాళ్లు పేరుతో భాజపా నేతలు విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ..  రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ.11వేల కోట్లు ఇచ్చిందని, మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. 

5. జులైలో 13 కోట్లకుపైగా డోసులిచ్చాం..!

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం జులై నెలలోనే 13కోట్లకుపైగా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా ఆగస్టు నెలలో ఈ ప్రక్రియ మరింత వేగం కానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కృషికి గర్విస్తున్నామన్నారు.

6. అంతవరకూ ఎవరూ సురక్షితం కాదు!

దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్‌ చీఫ్‌ డా.రణ్‌దీప్‌ గులేరియా మరోసారి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను పాటించాలని కోరారు. ‘ప్రపంచంలో అందరూ సురక్షితంగా ఉండే వరకూ.. వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ సురక్షితంగా లేరనే భావించాలి. ఒక ప్రాంతంలో కొత్త వేరియంట్‌ వెలుగులోకి వస్తే.. అది ఇతర దేశాలకూ వ్యాపించే అవకాశం ఉంది’ అని గులేరియా పేర్కొన్నారు. 

7. మా పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయ్‌: అఖిలేశ్

సమాజ్వాదీ పార్టీని విమర్శిస్తున్న కాంగ్రెస్, బీఎస్పీ ఏ పక్షమో చెప్పాలని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ డిమాండ్ చేశారు. వారి పోరాటం భారతీయ జనతా పార్టీపైనా.. లేక సమాజ్‌వాదీ పార్టీపైనా అన్నది స్పష్టం చేయాలన్నారు. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చిన్నపార్టీలతో పొత్తుకు తమ పార్టీ ద్వారాలు తెరిచే ఉంచినట్లు అఖిలేశ్‌ వెల్లడించారు. 

8. పేటీఎంలో 20 వేల ఉద్యోగాలు.. అర్హత పదో తరగతి!

ప్రముఖ ఆన్‌లైన్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం దేశవ్యాప్తంగా 20 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. సంస్థ డిజిటల్‌ ఉపకరణాలపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకుగానూ ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎఫ్‌ఎస్‌ఈ)లను నియమించుకుంటోంది. పది లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

9. ప్రపంచీకరణతో అసమానతలు పెరిగిపోయాయి

ప్రపంచీకరణ వల్ల ఒక తరంలోనే భారత జీడీపీ మూడింతలు పెరిగిందని, కానీ దీనిలో కార్మికులకు వాటా దక్కలేదని నోబెల్‌ బహుమతి గ్రహీత, హార్వార్డ్‌ యూనివర్సిటీ గణితం, ఆర్థిక శాస్త్రాల ప్రొఫెసర్‌ ఎరిక్‌ మస్కిన్‌ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో కొవిడ్‌-19 కంటే, ప్రజల మధ్య పెరుగుతున్న ఆర్థిక అంతరాలే అతిపెద్ద సమస్యగా ఆయన అభివర్ణించారు. అశోకా యూనివర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి ఆన్‌లైన్లో ఆయన మాట్లాడారు.

10. సెమీస్‌కు దూసుకెళ్లిన పురుషుల హాకీ జట్టు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-1 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టు బ్రిటన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడింది. గోల్‌ చేయనీకుండా అడ్డుకుంది. ఫలితంగా భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

100 మీటర్ల పరుగు పందెంలో లామోంట్‌ సంచలనం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని