Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 04/08/2021 21:13 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. వాసాలమర్రి వాసులకు కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం: కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటించారు. స్థానికంగా ఉన్న 60 దళిత కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. వాసాలమర్రి గ్రామంలోని 76 ఎస్సీ కుటుంబాలకు దళితబంధు పథకం మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రామంలోని అందరికీ ఒకే విడతలో దళిత బంధు నిధులు పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో రేపు నిధులు జమచేస్తాం, ఎలా ఖర్చు చేసుకుంటారో వారి ఇష్టమని సీఎం అన్నారు.

2. అంగన్‌వాడీ టీచర్లకు పదోన్నతలు: జగన్‌

కొత్త విద్యావిధానంపై అధికారులతో ఏపీ సీఎం జగన్‌  సమీక్ష నిర్వహించారు.  కొత్త విధానం ప్రకారం...  పీపీ-1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరణ చేయనున్నారు. కొత్త విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని సీఎం సూచించారు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని జగన్‌ ఆదేశించారు.

3. కేఆర్‌ఎంబీ రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన వాయిదా

కృష్ణానది యాజమాన్యబోర్డు  (కేఆర్‌ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన వాయిదా పడింది. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. పథకం పరిశీలన తేదీని తర్వాత వెల్లడిస్తామని కేఆర్‌ఎంబీ తెలిపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌పై చర్చించేందుకు హైదరాబాద్‌ జలసౌధలో ఈనెల 9న గోదావరి నది యాజమాన్యబోర్డు(జీఆర్‌ఎంబీ) అత్యవసరంగా సమావేశం కానుంది. 

4. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష అక్రమ నిర్మాణాలు: హైకోర్టు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కింది కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులు ఎత్తివేసేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాదులు సరైన విధంగా అభ్యంతరాలు తెలపనందునే స్టే ఆదేశాలు జారీ అవుతున్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

5. లక్షకు ఒక్కరు తక్కువైనా.. కేసీఆర్‌కు గులాంగిరి చేస్తాం: రేవంత్‌

దళితులకు రూ.10 లక్షలు ప్రకటించినట్టే.. గిరిజనులకు  కూడా రూ.10లక్షలు ప్రకటించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈనెల 9న ఇంద్రవెల్లిలో జరగబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ వాల్‌పోస్టర్‌ను ప్రకాశం హాలులో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఎన్ని నిర్బంధాలు విధించినా లక్ష మందితో ఇంద్రవెల్లిలో సభ పెట్టి తీరుతామని స్పష్టం చేశారు. లక్షకు ఒక్కరు తక్కువైనా.. సీఎం కేసీఆర్‌కు గులాంగిరి చేస్తామని సవాల్‌ విసిరారు.

6. నాలుగేళ్లలో 1.71 లక్షల అత్యాచార కేసులు..!

దేశంలో.. 2015-19 మధ్య కాలంలో 1.71 లక్షల అత్యాచార కేసులు నమోదవడం యావత్ భారతావనిని కలవరపెడుతోంది. వీటిలో అత్యధిక కేసులు మధ్యప్రదేశ్‌ నుంచి నమోదు కావడం ఆ రాష్ట్ర ప్రజలు సహా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా ఈ మేరకు అత్యాచార కేసులకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు.

సమగ్ర శిక్షా పథకం మరో ఐదేళ్లు పొడిగింపు

7. 2023 డిసెంబరు నాటికి అయోధ్యలో భక్తులకు దర్శనాలు

శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యలో మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండేళ్లలో ఆలయ గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్‌ వర్గాలు తెలిపాయి. 2023 డిసెంబరు కల్లా భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నాయి. 2025 నాటికి ఆలయం పూర్తిగా నిర్మితం కానున్నట్టు తెలుస్తోంది. 

8. ఇండిగో స్పెషల్‌ ఆఫర్‌.. టికెట్ల ధరలపై భారీ రాయితీ!

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమాన టికెట్ల ధరలపై భారీ రాయితీ ప్రకటించింది. కేవలం రూ.915 ప్రారంభ ధరతో టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్‌ కార్డు ఉన్నవారికి అదనంగా ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా ఆఫర్‌ చేస్తోంది. సంస్థ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆఫర్లను ప్రకటించింది. నేటి(ఆగస్టు 4) నుంచి ఆగస్టు 6 మధ్య టికెట్లను బుక్ చేసుకోవాలి.

9. అగ్రరాజ్యంలో తిరగబెడుతున్న కరోనా.. ఒక్కరోజే లక్షన్నర కేసులు!

అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ కల్లోలం రేపుతోంది. గతేడాది అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికించిన ఈ మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో అమెరికాలో దాదాపు లక్షన్నర కొత్త కేసులు వచ్చాయి. 

10. దేశానికి మెడల్‌ తెచ్చినందుకు గర్వంగా ఉంది: సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం పతకం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని పీవీ సింధు అన్నారు. దేశానికి ఓ మెడల్‌ తీసుకొచ్చినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఒలింపిక్స్‌లో పాల్గొని స్వదేశానికి వచ్చిన సింధు.. బుధవారం హైదరాబాద్‌లోని తన స్వగృహానికి చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని