Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 22/09/2021 20:57 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. డిసెంబరు నుంచి సచివాలయాలను సందర్శిస్తా: సీఎం జగన్‌

‘గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యం. తనిఖీలపై నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవు. డిసెంబరు నుంచి నేను కూడా గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తా’నని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 24, 25 తేదీల్లో సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం. ప్రతినెల చివరి శుక్రవారం, శనివారం సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం. దసరా రోజున ఆసరా పథకం అమలు చేయనున్నట్టు సీఎం తెలిపారు. 

2. నాలుగు నెలల్లో గాడిన పడకుంటే ఆర్టీసీ ప్రైవేటీకరణే!

రాబోయే నాలుగు నెలల్లో ఆర్టీసీ గాడిన పడకుంటే ప్రైవేటు పరం చేస్తామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఇదే విషయాన్ని నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎండీ సజ్జనార్‌, ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌లకు స్పష్టం చేశారు. ఈ ఏడాది కూడా ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద రూ.3,000 కోట్లు కేటాయించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

3. ఆయిల్ పాం సాగుపై రైతులు దృష్టి సారించాలి: కేటీఆర్‌

 తెలంగాణలో ఆయిల్ పాం వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. సిరిసిల్లలో ఆయిల్ పాం పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలు భారీగా పెరిగిన  నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.

4. ఏపీ శ్రీశైలం జలాలు తరలించకుండా ఆపాలి: తెలంగాణ

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజలస్రవంతి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం జలాలు తరలించకుండా ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్యబోర్డును కోరింది. ఈమేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు మరో లేఖ రాశారు. ఈనెల 8న రాసిన లేఖకు కొనసాగింపుగా తాజా లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు.

5. భారత్‌లో.. ఫైజర్‌, మోడెర్నా టీకాలు ఇప్పట్లో రానట్లేనా!
కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఫైజర్‌, మోడెర్నా టీకాలు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి వీటిని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా దేశీయంగా తయారవుతోన్న వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పాటు తక్కువ ఖర్చులోనే లభ్యమవుతుండడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

6. సిద్ధూని మాత్రం సీఎం కానివ్వనంతే.. అందుకు ఎలాంటి త్యాగానికైనా రె‘ఢీ’!

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌సిద్ధూపై మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ యుద్ధం ప్రకటించారు! ఎట్టిపరిస్థితుల్లో ఆయన్ను సీఎంని కానివ్వబోనన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూని కచ్చితంగా ఓడిస్తానన్నారు.సిద్ధూ ప్రమాదకర వ్యక్తి అని.. ఆయనపై బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెడతానని ప్రకటించారు. 

7. ఝున్‌ఝున్‌వాలాకు వారంలో రూ.58 కోట్ల లాభం!

సరైన ప్రణాళిక, మార్కెట్‌పై మంచి పట్టు, కంపెనీ తీరుతెన్నుల్ని క్షణ్నంగా విశ్లేషించగలిగే సామర్థ్యం ఉంటే స్టాక్‌ మార్కెట్లో రోజుల వ్యవధిలో రూ.కోట్లు గడించొచ్చని ఇండియన్‌ బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మరోసారి నిరూపించారు. వారం క్రితం కొన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు ఆయనకు సిరుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ఈరోజు కంపెనీ షేర్లు గరిష్ఠంగా 39 శాతం ఎగబాకడంతో ఆయన వాటాల విలువ 61 శాతం పెరిగింది.

8. పాకిస్థాన్‌లో 50లక్షల మంది చైనీయులు..!

గత కొంతకాలంగా పాకిస్థాన్‌లో చైనీయుల జనాభా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేళ్లలో (2025నాటికి) పాకిస్థాన్‌లో దాదాపు 50లక్షల మంది చైనీయులు పనిచేసే అవకాశం ఉందని పాక్‌ ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాకిస్థాన్‌లో పనిచేసే చైనీయుల ఆరోగ్య అవసరాలను తీర్చడమే కాకుండా చైనా వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు డ్రాగన్‌ దేశంతో సన్నిహిత సంబంధాలు దోహదం చేస్తాయని పాకిస్థాన్‌ ప్రజారోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

9. డ్రాగన్‌కు మరో ఝలక్‌!

భద్రతాపరమైన కారణాలు చూపుతూ చైనా యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌ఐసీ ఐపీవో విషయంలోనూ డ్రాగన్‌కు ఝలక్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో రాబోయే ఎల్‌ఐసీ ఐపీవోలో చైనా పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. అదే సమయంలో ఇతర విదేశీ మదుపర్లు ఐపీవో పాల్గొనేందుకు అనుమతివ్వాలని నిర్ణయించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

10. ఇక నుంచి ‘బ్యాట్స్‌మెన్’ పిలవొద్దు

క్రికెట్‌లో ఎక్కువగా బ్యాట్స్‌మెన్, కీపర్‌, బౌలర్‌, ఫీల్డర్‌.. వంటి పదాలు వినిపిస్తుంటాయి. వాడకంలో కీపర్‌, బౌలర్, ఫీల్డర్‌ వంటివి అటు పురుషుల ఆటగాళ్లకు.. ఇటు మహిళా క్రీడాకారిణులకు సరిపోతాయి. కానీ బ్యాట్స్‌మెన్ అంటే కేవలం పురుషులను ఉద్దేశించి పిలిచేదిగా ఉండటంతో మెరిల్‌బోన్ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అధికారికంగా బ్యాట్స్‌మెన్‌కి బదులుగా ‘బ్యాటర్‌ లేదా బ్యాటర్స్‌’ పదాలను వాడాలని పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని