Top Ten news @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 24/09/2021 20:56 IST

Top Ten news @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. ప్రస్తుత సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి భోధనాసుపత్రుల వరకు సుమారు 14,200 పోస్టులు భర్తీ చేయాలని  నిర్ణయించారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారభించి, నవంబర్‌ 15 నాటికి ఉద్యోగాల భర్తీ ముగించాలని సూచించారు

2. సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగు అభ్యర్థులు

సివిల్స్‌-2020 తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 545 మంది పురుషులు, 216 మంది మహిళ అభ్యర్థులను సివిల్స్‌కు ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్‌లో మొదటి ర్యాంకు శుభం కుమార్‌ సాధించగా.. జాగృతి అవస్థి రెండో ర్యాంకుతో మెరిశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27, రవికుమార్‌ 84, యశ్వంత్‌ కుమార్‌రెడ్డి 93, కె.సౌమిత్‌ రాజు 355, తిరుపతి రావు 441, ప్రశాంత్‌ సూరపాటి 498, వేగిని 686, డి. విజయ్‌ బాబు 682, కళ్లం శ్రీకాంత్‌రెడ్డి  747వ ర్యాంకు సాధించారు.  

3. ఆలయాలకు రూ.కోట్లు ఇస్తున్నారు.. రైతులకు రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తే తప్పేంటి?: రేవంత్‌

తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న జహీరాబాద్‌ చెరకు రైతులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా చెరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని.. రైతులకు రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. చెరకును ప్రభుత్వమే కర్ణాటక మిల్లులకు తరలించాలన్నారు. 

4. అప్పుడు వైఎస్‌ఆర్‌.. ఇప్పుడు జగన్‌ సీమకు అన్యాయం చేస్తున్నారు: తెదేపా

రాయలసీమకు నీటి వాటాలు దక్కకుండా ఈ ప్రాంతంలో రైతులు దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డేనని తెదేపా నేతలు విమర్శించారు. కడపలో జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేతలంతా సమావేశమ్యారు. వెలిగొండ, గాలేరునగరి, హంద్రీనీవాలకు కృష్ణా నీటి వాటా హక్కులను వదులుకుంటామని 2006లోనే రాజశేఖర్‌రెడ్డి.. కృష్ణా ట్రైబ్యునల్‌కు లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌ రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.

5. పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీకి సంయుక్త కమిటీ మధ్యంతర నివేదిక

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ నివేదిక సమర్పించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను అక్రమంగా నిర్మిస్తున్నారని ఏపీ రైతులు గతంలో ఎన్జీటీని ఆశ్రయించారు. నీటి కేటీయింపులు లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు-రంగారెడ్డి తాగునీటి కోసమే అని ఆ సమయంలో తెలంగాణ వాదనలు వినిపించింది. 

6. విశాఖస్టీల్‌ విక్రయం దిశగా కేంద్రం వేగంగా అడుగులు

ఇటీవల కాస్త స్తబ్దుగా ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశం మళ్లీ వేడెక్కింది. స్టీల్‌ ప్లాంట్‌ విక్రయం దిశగా వేగంగా కేంద్రం అడుగులు వేస్తోంది. న్యాయ సలహాదారు ఎంపిక ప్రక్రియ కోసం న్యాయసంస్థలకు పిలుపు నివ్వగా.. ఏడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఐదు సంస్థలతో కూడిన తుది జాబితాను కేంద్రం రూపొందించింది. 

7. వరవరరావుకు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం..!

భీమా కోరేగావ్‌ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావు.. తన బెయిల్‌ పొడిగించాలంటూ బాంబే హై కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌పై స్వల్ప ఊరట లభించింది. ఈ పిటిషన్‌ విచారణను చేపట్టిన బాంబే హైకోర్టు అక్టోబర్‌ 13కు వాయిదా వేసింది. దీంతో అక్టోబర్‌ 14 వరకు ముంబయిలోని తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

8. కార్లలో ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ ఇంజిన్లు.. త్వరలో కంపెనీలకు ఆదేశాలు: గడ్కరీ

ట్రోల్‌, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని, కర్బన ఉద్గారాలు తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కార్లలో ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ (ఒకటి కంటే ఎక్కువ ఇంధనాలతో నడిచే) ఇంజిన్‌లను అమర్చడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. మూణ్ణాలుగు నెలల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. 

9. దయనీయం! తిండీ తిప్పలు లేకుండా పాక్‌ సరిహద్దు వద్ద పడిగాపులు

తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం వారి అరాచక పాలనకు భయపడి ఎంతో మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అమెరికా, ఉజ్బెకిస్థాన్‌, ఇంగ్లాండ్‌తో పాటు పలు దేశాల్లో శరణార్థులుగా జీవిస్తున్నారు. దేశ సరిహద్దుల అవతలి వైపు ఉన్న పాకిస్థాన్‌కు లక్షల మంది చేరుకొని అక్కడ తలదాచుకుంటున్నారు.

10. రెండో వన్డేలో ఉత్కంఠ పోరు.. ఆఖరి బంతికి భారత్‌పై ఆసీస్ విజయం

అయ్యో.. టీమిండియా మహిళల జట్టుకు అదృష్టం కలిసొచ్చినట్లు లేదు. మ్యాచ్‌లో చివరి బంతి వరకు దోబూచులాడిన విజయం ఆఖరుకు ప్రత్యర్థినే వరించింది. ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో వరుసగా మూడో సిరీస్‌ను భారత్‌ కోల్పోవడం గమనార్హం. ఇంతకుముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ చేతుల్లో మిథాలీ సేన పరాజయం పాలైంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని