Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోటాప్‌ 10 న్యూస్‌

తాజా వార్తలు

Published : 28/09/2021 20:56 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోటాప్‌ 10 న్యూస్‌

1. గీత దాటితే చర్యలు తప్పవు.. భరత్‌, రాజాకు జగన్‌ హెచ్చరిక

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమహేంద్రవరం వైకాపా నేతల పంచాయితీ ముగిసింది. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్‌ మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని జగన్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది.

2. ఎన్‌హెచ్‌ఆర్సీ బృందంపై సిర్పూర్కర్‌ కమిషన్‌ అసహనం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. సంఘటనా స్థలంలో వివరాలు ఎందుకు సేకరించలేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందంపై సిర్పూర్కర్ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఎన్‌కౌంటర్ జరిగిన చోట మృతదేహాలు పడి ఉన్న తీరు, పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారనే విషయాలు సంఘటనా స్థలంలో సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు మాత్రమే ఎందుకు నమోదు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

3. తెలంగాణపై తగ్గిన ‘గులాబ్‌’ తుపాను ప్రభావం

గులాబ్‌ తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై  తగ్గిపోయిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనంగా విదర్భ, మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్టు వాతావరణశాఖ సంచాలకులు డాక్టర్‌ నాగరత్నం తెలిపారు.  ఇప్పటి వరకు ఈ సీజన్‌లో సాధారణం కన్నా 40శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు.

4. వైకాపా ప్రభుత్వంపై మరోసారి పవన్‌ విమర్శనాస్త్రాలు

వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘దేవాలయాలు, విగ్రహాలపై 140 దాడులు, విధ్వంసాలు. వైకాపా పాలనలో రెండున్నరేళ్లలో జరిగిన ప్రగతి ఇదే’’ నంటూ ట్వీట్‌ చేశారు. సాయిధరమ్‌తేజ్‌ నటించిన ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి వైకాపా నేతలు, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

5. నేను చనిపోతే అందుకు పవన్‌ కల్యాణే కారణం: పోసాని

‘జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నేను చనిపోతే అందుకు పవన్‌ కల్యాణే కారణం. అతనిపై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తా’నని సినీనటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి తెలిపారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన పోసాని.. పవన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో అక్కడికి చేరుకున్న పవన్‌ అభిమానలు అక్కడి చేరుకొని పోసానిపై దాడికి యత్నించారు. దీంతో ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

6. కాంగ్రెస్‌లో చేరిన కన్నయ్య కుమార్‌

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకొన్నారు. అలాగే, గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ కాంగ్రెస్‌కు తన మద్దతు ప్రకటించారు. కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ఆయన పార్టీలో అధికారికంగా చేరకపోయినప్పటికీ తన మద్దతు ప్రకటించారు.

7. సిద్ధూ గురించి ముందే చెప్పా : కెప్టెన్‌ అమరీందర్‌

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ రాజీనామాపై మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. సిద్ధూకి స్థిరత్వం లేదని ముందే తాను చెప్పానని పేర్కొన్నారు. పంజాబ్‌ వంటి సరిహద్దు రాష్ట్రానికి సిద్ధూ సరిపోరని కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. సిద్ధూకు పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు అప్పజెప్పిన నాటి నుంచే అమరీందర్‌ సింగ్‌ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

8. చిన్నపిల్లలపై సీరం వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షలకు అనుమతులు 

భారత్‌లో 7-11 ఏళ్ల మధ్య పిల్లలకు అందజేసేలా టీకా సిద్ధం చేసేందుకు ప్రయోగాలు మొదలుపెట్టేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు నేడు సెంటర్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నిపుణుల కమిటీ సభ్యుడు తెలిపారు. దేశంలో పాఠశాలలు పునః ప్రారంభిస్తుండటంతో ప్రభుత్వం పిల్లకు వ్యాక్సిన్‌ అందించే విషయంలో చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. 

9. తాలిబన్ల మరో దుశ్చర్య.. బాలుడి దారుణ హత్య!

అఫ్గాన్‌లోని తఖార్‌ ప్రావిన్స్‌లో ఓ బాలుడిని తాలిబన్లు దారుణంగా హతమార్చినట్లు స్థానిక వార్తాసంస్థ వెల్లడించింది. అతని తండ్రి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన ‘రెసిస్టెన్స్‌ ఫోర్స్‌’లో సభ్యుడిగా ఉన్నాడనే అనుమానంతో తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొంది. దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేయగా.. అందులో ఆ బాలుడి మృతదేహం పక్కన మరో ముగ్గురు చిన్నారులు ఏడుస్తూ కనిపిస్తున్నారు.

10. దిల్లీ క్యాపిటల్స్‌ జోరుకు బ్రేకులేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతున్న దిల్లీ జోరుకు కోల్‌కతా బ్రేక్‌లు వేసింది. తొలుత బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో కోల్‌కతా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌ 18.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని