Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు 

తాజా వార్తలు

Updated : 18/10/2021 21:15 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు 

1. హుజూరాబాద్‌లో ‘దళితబంధు’ నిలిపేయండి: ఈసీ

తెలంగాణలో ఈ నెల జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌కు ఈసీ లేఖ రాసింది. 

2. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి: సీఎం జగన్‌

కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. నవంబరు 30వ తేదీలోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లాల కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. ఆస్పత్రుల్లో ఖాళీలపై నియామక క్యాలెండర్‌ను రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు

3. త్రిశూలం ధాటికి చైనా సైన్యం గిలగిలా కొట్టుకోవాల్సిందే..!

చైనాకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు భారత బలగాలు సిద్ధమయ్యాయి. గల్వాన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల్లో మన సైన్యంపై ఇనుపరాడ్ల తరహా ఆయుధాలతో డ్రాగన్‌ మూకలు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. అప్పుడు చైనా బలగాల దాడిని సమర్థంగా తిప్పికొట్టిన భారత్‌ సైన్యం ఇప్పుడు నూతన ఆయుధాలను సమకూర్చుకుంది! వీటిలో త్రిశూలం, ఆధునాతన గ్లౌజ్‌లు, లాఠీలు ఉన్నాయి. 

4. కేసీఆర్‌.. ముందుస్తు ఎన్నికల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారో..: రేవంత్‌

సీఎం కేసీఆర్ ఎవరు అడగకుండానే ముందస్తు ఎన్నికల ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో భాజపాను బలోపేతం చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయం వద్ద రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందన్నారు.

5. రైతుల డిమాండ్లు తీర్చకపోతే భాజపాకు కష్టమే.. గవర్నర్‌ మాలిక్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న అన్నదాతల డిమాండ్లు నెరవేర్చాలని మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కర్షకుల డిమాండ్లు తీర్చకపోతే భాజపా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు.

6. రైతులకు కేంద్రం శుభవార్త

రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువులపై రాయితీని భారీగా పెంచింది. డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు రూ.1200 రాయితీ ఇస్తుండగా.. దాన్ని రూ.1650కి పెంచింది. ఈ మేరకు మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు లభించేలా చూడాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

7. విమానం ఎక్కేలా చేస్తామన్నారు.. కనీసం రోడ్డుపైనా తిరగనివ్వట్లేదుగా..!

మధ్యతరగతి ప్రజలు విమానంలో ప్రయాణించేలా చేస్తామని చెప్పిన ఎన్డీయే సర్కారు.. ఇప్పుడు వారిని కనీసం రోడ్డుపైనా తిరగనివ్వట్లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘హవాయి చెప్పులు వేసుకునే వారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. కానీ భాజపా ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుకుంటూ పోతోంది. దీంతో మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు రోడ్డుపై ప్రయాణించడమే కష్టంగా మారింది’’ అంటూ చురకలంటించారు.

8. డేరా బాబాకు జీవిత ఖైదు

డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు, వివాదాస్పద మతగురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు పడింది. 2002లో హత్యకు గురైన డేరా సౌదా మేనేజర్‌ రంజిత్ సింగ్ కేసులో ఈ బాబా పాత్ర ఉన్నట్లు హరియాణాలోని పంచకులలోని సీబీఐ న్యాయస్థానం ఇదివరకే పేర్కొంది. ఆయనతో పాటు మరో నలుగురికి ఈ హత్యకేసులో హస్తం ఉన్నట్లు తేల్చిన న్యాయస్థానం.. సోమవారం శిక్ష ఖరారు చేసింది. 

9. కరోనాతో రష్యా విలవిల.. ఆగని మరణాలు!

కరోనా మహమ్మారి విజృంభణకు రష్యా గజగజ వణుకుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు పెరిగిపోతుండం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న కొత్తగా 34,325 కేసులు రాగా.. ఈ వైరస్‌ ప్రభావంతో 998మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. మరోవైపు, ఆ దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 80లక్షల మార్కు దాటేసింది. 
10.
8 ప్రధాన నగరాల్లో ఊపందుకున్న గృహ విక్రయాలు..!

దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. జులై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో 59శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 55,907 యూనిట్స్‌ను విక్రయించినట్లు ప్రాప్‌ టైగర్‌.కామ్‌ సంస్థ లెక్కలు చెబుతున్నాయి. గత త్రైమాసికంతో పోల్చుకొంటే డిమాండ్‌ మూడు రెట్లు పెరిగింది. ఈ త్రైమాసికంలో కేవలం 15,968 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో విక్రయాలు బాగా తగ్గాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని