Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 21/10/2021 20:57 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై హైకోర్టులో పిల్‌

హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై  హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ సామాజిక వేత్త మల్లేపల్లి లక్ష్మయ్య ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈసీ, సీఈవో, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. కాగా, హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక దృష్ట్యా దళితబంధు నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. 

2. తెదేపా నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్‌

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రం కోర్టులో హాజరుపర్చారు. ఈసందర్భంగా పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

3. కేఆర్‌ఎంబీ మార్గదర్శకాలపై తెలంగాణ అభ్యంతరం

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మార్గదర్శకాలు బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. బచావత్‌ ట్రైబ్యునల్ అవార్డుకు లోబడి రూల్ కర్వ్స్, ఆపరేషన్ ప్రొటోకాల్స్ సవరించాలని కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్‌ లేఖ రాశారు

4. కారుణ్య నియామకాలపై త్వరగా చర్యలు తీసుకోవాలి: ఏపీ సీఎస్‌

కేబినెట్‌ నిర్ణయాల అమలు, పెండింగ్‌ అంశాలపై ఇక నుంచి ప్రతినెలా మొదటి బుధవారం అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్‌ సమావేశం నిర్వహించారు.  నవంబరు 30 కల్లా కరోనా కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని మెమో జారీ చేశారు.

5. ఏపీలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి 31 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు.

6. అనన్యా..  రేపు మళ్లీ విచారణకు రండి: ఎన్‌సీబీ

ముంబయి నగరంలో క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ వ్యవహారంలో సినీనటి అనన్యా పాండే విచారణ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు విచారించిన నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు శుక్రవారం మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌ వాట్సాప్‌ చాట్‌లో అనన్య పేరు వెలుగులోకి రావడంతో ఆమె ఇంట్లో ఈరోజు ఎన్‌సీబీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే.

7. ఈ 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్‌ డోస్‌ పూర్తి

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులందరికీ ఫస్ట్‌ డోస్‌ పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, లక్షద్వీప్, సిక్కిం, ఉత్తరాఖండ్, దాద్రా నగర్ హవేలీలు ఈ జాబితాలో ఉన్నాయి. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 75 శాతం కంటే ఎక్కువ మంది కనీసం ఒక డోసు వేయించుకున్నట్లు చెప్పారు.

8. చైనా వినడం లేదు.. ఆక్రమణలకు పాల్పడుతోంది: అమెరికా

హిమాలయ పర్వతాల ప్రాంత సరిహద్దుల్లో చైనా దురాక్రమణ చర్యలకు పాల్పడుతూనే ఉందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి వెల్లడించింది. అమెరికాతో పాటు మిత్రదేశాలపైనా చైనా దాడులకు దిగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. వీటితోపాటు పలు అంశాల్లో అంతర్జాతీయ నిబంధనలను పాటించని చైనా ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాల్సిందేనని అమెరికాకు చెందిన సీనియర్‌ దౌత్యవేత్త పేర్కొన్నారు.

9. అమెజాన్‌ ప్రైమ్‌ ఇక ప్రియం!

అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు చేదువార్త. త్వరలో సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెరగనున్నాయి. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్లాన్‌ ధరలను కూడా అమెజాన్‌ సవరించనుంది. త్వరలోనే ఈ పెంపు ఉంటుందని అమెజాన్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఎప్పటి నుంచి పెంచేదీ మాత్రం వెల్లడించలేదు.

10. బాబోయ్‌.. నా పెళ్లికీ, ప్రపంచకప్‌కీ లింక్ లేదు!: రషీద్‌ఖాన్‌ 

అఫ్గాన్‌ ప్రపంచకప్‌ గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని క్రికెటర్‌ రషీద్‌ఖాన్‌ అన్నట్లు కొన్నాళ్ల కిందట వార్తలు వైరల్‌ అయ్యాయి. దీనిపై రషీద్‌ స్పష్టతనిచ్చాడు. ‘ప్రపంచకప్‌ గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు. నేనేం చెప్పానంటే.. వచ్చే మూడేళ్లు చాలా బిజీగా ఉండబోతున్నా. 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లు, 2023లో వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. ఇప్పుడు నా దృష్టి అంతా వాటిపైనే ఉందని చెప్పా. అంతే తప్ప ప్రపంచకప్‌ గెలిచిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని అనలేదు’ అని రషీద్ అన్నాడు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని