Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 22/10/2021 20:58 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మేం ఆధారాలు ఇస్తాం.. పోలీసులు యూనిఫాం తీసేయండి: చంద్రబాబు

గంజాయిపై మాట్లాడితే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారు. మేం ఆధారాలు ఇస్తాం.. పోలీసులు యూనిఫాం తీసేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులను నిరసిస్తూ  ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం’ పేరుతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల దీక్ష చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా తీరుపై మండిపడ్డారు

2. కేసీఆర్‌ కంటే అబద్దమే ముందు పుట్టింది: కిషన్‌రెడ్డి

దళితబంధుపై తెరాస అసత్య ప్రచారాలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దమ్ముంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే రాష్ట్రంలోని ఎస్సీలందరికీ దళితబంధు అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఏదైనా కాంగ్రెస్‌తో భాజపా పొత్తు పెట్టుకోదన్న ఆయన తెరాసనే ఆపని చేస్తోందన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని బూజునూరులో భాజపా అభ్యర్థి ఈటలతో కలిసి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

3. జగన్‌రెడ్డిలా నేను చిన్నాన్న జోలికి వెళ్లలేదు: లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ రాకపోయినా.. రాష్ట్రంలో గంజాయి పరిశ్రమ మాత్రం బాగా నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ‘‘తెదేపా కార్యకర్తలు కేసులకు భయపడక్కర్లేదు. ఒక చెంప మీద కొడితే .. రెండు చెంపలు వాయగొడతాం. జగన్‌రెడ్డిలా నేను చిన్నాన్న జోలికి వెళ్లలేదు. జగన్‌ మగాడైతే చిన్నాన్న హత్యకేసు తేల్చాలి. రెండున్నరేళ్లు ఆగండి .. చంద్రబాబే మళ్లీ సీఎం’’ అని మంగళగిరి దీక్షలో లోకేశ్‌ అన్నారు. 

4. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని అరెస్టు

న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈకేసులో తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈకేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం, కిషోర్‌ కుమార్‌ దరిస, సుద్దులూరి అజయ్‌ అమృత్‌లను అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. 

5. మహిళా భద్రతకు కమిటీ: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తన మేనిఫెస్టోను అమలు చేసే దిశగా ముందడుగేశారు. ‘మా’లో మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విష్ణు తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

6. ఆ కమిషన్లలో ఖాళీల భర్తీలో జాప్యంపై ‘సుప్రీం’ ఆగ్రహం

రాష్ట్ర, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో ఖాళీలు భర్తీలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ట్రైబ్యునళ్ల నియామకం ఇష్టంలేకపోతే చట్టాన్ని రద్దుచేయాలంటూ జస్టిస్‌ ఎస్కే కౌల్‌,  జస్టిస్‌ ఎంఎం సుందరేషన్‌తో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ అధికార పరిధిని దాటి ఖాళీలు భర్తీ చేయాలని కోరుతున్నామన్న న్యాయమూర్తులు.. ఈ విషయాన్ని తాము చెప్పాల్సి రావడం దురదృష్టకరమన్నారు. 

7. కొవిడ్‌ పోరులో ‘సాంకేతికతే’ గేమ్‌ఛేంజర్‌..: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

సాంకేతికత ప్రాముఖ్యాన్ని కొవిడ్‌ మహమ్మారి మరోసారి తెలియజేసిందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరతతో పాటు మౌలిక సదుపాయాల సమస్యలున్న మన దేశంలో సాంకేతికతను సక్రమంగా వినియోగించుకుంటే ‘గేమ్‌ఛేంజర్‌’గా ఎలా అవుతుందో తాజాగా కొవిడ్‌ మహమ్మారి మరోసారి నిరూపించిందన్నారు. 

8. రష్యాలో కొవిడ్ కల్లోలం: డెల్టాను మించిన దాని ఉపరకం..!

రష్యాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ కేసులకు కారణమవుతోన్న ఉపరకం ay.4.2.. డెల్టా వేరియంట్ కంటే అధిక సంక్రమణ వేగం కలిగి ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు అక్కడి మీడియాతో ఆ దేశ సీనియర్ పరిశోధకులు ఒకరు వెల్లడించారు.

9. డెలివరీ విమెన్‌కు రెండురోజుల నెలసరి సెలవులు: స్విగ్గీ

 ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ తన వద్ద పనిచేసే డెలివరీ విమెన్‌ సౌకర్యార్థం మంచి నిర్ణయం తీసుకుంది. మహిళా డెలివరీ పార్ట్‌నర్లకు ప్రతి నెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు స్విగ్గీ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిహిర్‌ షా తన బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించారు.

10. ధోనీ ఉండటం ఆ ఆటగాళ్లకు లాభం: సురేశ్‌రైనా

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ధోనీ మెంటార్‌గా ఉండటం జట్టులో యువ ఆటగాళ్లకు ఎంతో మేలుచేస్తుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో వారు ఆడడం టీ20 ప్రపంచకప్‌లో కలిసొస్తుందని రైనా పేర్కొన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని