Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 23/10/2021 20:55 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. పోడు సాగుదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సీఎం ఆదేశం
పోడు భూముల సమస్య పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణతో పాటు హరితహారంపై తెలంగాణ సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అడవులపై ఆధారపడిన గిరిజనులకు మేలు చేయాలని, అడవులను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నవంబరు 8 నుంచి డిసెంబరు 8వరకు పోడు భూములు సాగుచేస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.
2.
ఏపీలో ఎంపీలాడ్స్‌ వివాదం.. వివరణ కోరిన కేంద్రం

ఏపీలో ఎంపీలాడ్స్‌ నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నిబంధనలకు అనుగుణంగా ఎంపీలాడ్స్‌ నిధులు ఖర్చుచేయకపోవటంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శికి కేంద్రం లేఖ పంపింది. మతపరమైన భవనాల నిర్మాణానికి, మరమ్మతుల కోసం ఎంపీలాడ్స్‌ నిధులు కేటాయించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు వివరణ కోరుతున్నట్టు స్పష్టం చేసింది.

3. ఈటల, కిషన్‌ రెడ్డి భేటీ ఏర్పాటు చేసింది తెరాస కాదా?: రేవంత్‌

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూర్‌ వెంకట్‌కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస, భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్‌లో గెల్లు చెల్లని నాణెం అని, హుజూరాబాద్‌ ప్రజలకు వెంకట్‌ అండగా ఉంటారని చెప్పారు. ‘‘గోల్కొండ రిసార్ట్స్‌లో నేను, ఈటల కలిశామని కేటీఆర్‌ అంటున్నారు. అది బహిరంగ రహస్యమే. ఈటల, కిషన్‌ రెడ్డి భేటీ ఏర్పాటు చేసింది తెరాస కాదా? కిషన్‌రెడ్డి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయలేదా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.

4. రఘురామపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు.. స్పందించిన ఆర్‌బీఐ

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌కు బ్యాంకు రుణాల మంజూరులో అవకతవకలపై విచారణ జరపాలంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాసిన లేఖపై రిజర్వు బ్యాంకు స్పందించింది. మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ విజయసాయిరెడ్డికి ఆర్‌బీఐ సీజీఎం జయశ్రీగోపాలన్‌ లేఖ రాశారు. 

5. ఆస్కార్‌ బరిలో తమిళ చిత్రం ‘కూళంగల్’

తమిళ చిత్రం ‘కూళంగల్’ (పెబెల్స్‌) 2022లో జరిగే 94వ ఆస్కార్‌ పోటీలకు మనదేశం తరఫు నుంచి ఎంట్రీ ఇవ్వనుంది. ఇదే విషయాన్ని శనివారం ఆస్కార్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్‌ పర్శన్‌ షాజీ ఎన్‌ కరుణ్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు (ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఎఫ్‌ఎఫ్‌ఐ జనరల్‌ సెక్రెటరీ సుప్రాన్‌ సెన్‌ తెలిపారు. దర్శకుడు పీఎస్‌ వినోద్‌ కుమార్‌కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ  బాగా చిత్రీకరించారు. ఆయన కుటుంబంలో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఇది తెరకెక్కింది.

6. కోర్టుల్లో మౌలికసౌకర్యాలు మెరుగుపరచాలి.. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ప్రజలకు సరైన న్యాయం అందించాలంటే అందుకు మెరుగైన మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమని, సమర్థ న్యాయవ్యవస్థ ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. అయితే మన దేశంలో న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ, సరైన ప్రణాళిక లేకుండా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. 

7. వ్యాక్సిన్‌ తయారీదారులతో మోదీ భేటీ

దేశంలోని ఏడు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది.  వ్యాక్సిన్‌ పరిశోధనను మరింత ముమ్మరం చేయడం సహా పలు అంశాలను ఈ భేటీలో చర్చించారు. దేశంలో టీకా పంపిణీ 100 కోట్ల డోసుల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించిన రెండు రోజులకు ఈ భేటీ జరగడం గమనార్హం. 

8. మేమొస్తే 20 లక్షల ఉద్యోగాలు.. ప్రియాంక గాంధీ హామీల వర్షం!

యూపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తున్నారు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నేటి నుంచి నవంబర్‌ 1 వరకు కొనసాగే ‘ప్రతిజ్ఞ యాత్రల’ ప్రారంభం సందర్భంగా ఇక్కడి బారాబంకీలో ఆమె మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 

9. భారత్‌సహా ఆరు దేశాల ప్రయాణికులకు సింగపూర్‌ ఆంక్షల సడలింపు

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్‌సహా ఆరు దక్షిణాసియా దేశాలను తన ప్రయాణ ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు సింగపూర్ శనివారం ప్రకటించింది. బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్‌, శ్రీలంక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఆరు దేశాల్లో 14 రోజుల ట్రావెల్‌ హిస్టరీ ఉన్నవారు ఈ నెల 27 నుంచి సింగపూర్‌ వచ్చేందుకు, లేదా సింగపూర్‌ మీదుగా రాకపోకలు సాగించేందుకు అనుమతిస్తున్నట్లు స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

10. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికాపై ఆసీస్‌ విజయం

టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా విజయంతో ప్రారంభించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఆసీస్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్‌ ఐదు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో 121 పరుగులు చేసిన గెలుపొందింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని