Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 24/10/2021 20:59 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. నా గెలుపునెవరూ అడ్డుకోలేరు: ఈటల

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో ప్రజలను భయపెట్టి తెరాస ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ఈటల  తెరాస అబద్ధాలను ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. వీణవంక మండలం వల్బాపూర్‌లో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

2. తెదేపా కార్యాలయంలో దాడి కేసులో మరో ఆరుగురి అరెస్టు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మీడియాలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వీరిలో నలుగురు విజయవాడ వాసులు కాగా,  ఇద్దరు గుంటూరుకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 10 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.

3. ధరల పెరుగుదల పాపం ముమ్మాటికీ భాజపాదే: హరీశ్‌రావు

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్నింటి ధరలు పెంచుతూ సామాన్యులపై భారం వేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ధరల పెరుగుదల పాపం ముమ్మాటికీ భాజపాదే అని అన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచనపల్లిలో ప్రచారం నిర్వహించారు. 

4. కేసీఆర్‌, ఈటల మధ్య విభేదాలకు కారణమిదే: రేవంత్‌రెడ్డి 

హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరాస సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

5. ఈ నెల 29నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన!

రోమ్‌లో జరుగనున్న 16వ జీ-20 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న ఇటలీ బయలుదేరనున్నారు. ఐదురోజుల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత రోమ్‌కు అక్కడ నుంచి యూకే, స్కాట్‌లాండ్‌లోనూ ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కాప్‌-26 సదస్సులోనూ ప్రధాని మోదీ నేరుగా పాల్గొంటారు.

6. ప్రజలకు ఇబ్బందులు కలిగించడంలో మోదీ ప్రభుత్వం రికార్డు..!

దేశంలో నిత్యం రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ మరోసారి మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని ఆరోపించారు. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే పెట్రోల్‌ ధర రూ.23 పెరగినట్లు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

7. పికాసో చిత్రాలకు 110 మిలియన్‌ డాలర్లు..

ప్రముఖ చిత్రకారుడు పికాసో గీసిన చిత్రాలకు 110 మిలియన్‌ డాలర్ల ధర లభించింది. ఈ చిత్రం 20 ఏళ్లుగా ఓ హోటల్‌ గదిలో ఉన్నాయి. లాస్‌వేగాస్‌లోని బెల్లాజియో హోటల్‌లో సౌత్‌బే ఆక్షన్‌ సంస్థ ఈ వేలం నిర్వహించింది. మొత్తం ఐదు చిత్రాలను ఈ వేలంలో విక్రయించారు. ఈ హోటల్లో మరో 12 పికాసో చిత్రాలు కూడా ఉన్నాయి.

8. సమీర్‌ వాంఖడేను అందుకే టార్గెట్‌ చేసుకున్నారు..!

ఆర్యన్‌ ఖాన్‌ కేసును దర్యాప్తు జరుపుతోన్న ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి రాందాస్‌ అఠవాలే స్పందించారు. ఆయనపై వస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి.. మహారాష్ట్ర ప్రభుత్వానివి దుర్మార్గమైన చర్యలని అన్నారు. కేవలం సమీర్‌ వాంఖడే వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే ఆయనను మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. 

9. ‘తమసోమా జ్యోతిర్గమయ’ బృందానికి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశంస

చేనేత గొప్పతనాన్ని తెలియజేసేలా రూపొందిన ‘తమసోమా జ్యోతిర్గమ’ మంచి విజయం అందుకోవాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆకాంక్షించారు. తన కార్యాలయంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి ఈ చిత్ర ట్రైలర్‌ని ఆదివారం చూశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ట్రైలర్‌ చాలా బాగుందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. చేనేత వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

10. అదరగొట్టిన అసలంక.. బంగ్లాపై శ్రీలంక విజయం

టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. చరిత్‌ అసలంక (80; 49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), రాజపక్స (53; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడటంతో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని లంక 18.5 ఓవర్లలోనే ఛేదించింది.

IND vs PAK: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని