Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 25/10/2021 20:55 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఐపీఎల్‌లో కొత్తగా అహ్మదాబాద్‌, లఖ్‌నవూ జట్లు

వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మరింత రసవత్తరంగా సాగనుంది. కొత్తగా అహ్మదాబాద్‌, లఖ్‌నవూ జట్లు వచ్చి చేరాయి. ఈ విషయాన్ని బీసీసీఈ ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌-2022లో మొత్తం 10 జట్లు  టైటిల్‌ పోరులో నిలబడనున్నాయి.  అహ్మదాబాద్‌ను సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ దక్కించుకోగా, లఖ్‌నవూను ఆర్పీఎస్జీ గ్రూప్‌నకు దక్కింది. సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ ₹5,600 కోట్లకు, ఆర్పీఎస్జీ గ్రూప్‌ 7,090 కోట్లతో ఈ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. 

2. తెలంగాణలో ‘త్రీ’ ఐ సూత్రాన్ని పాటిస్తున్నాం: కేటీఆర్‌

సమగ్ర కుటుంబసర్వే దేశ చరిత్రలోనే సంచలనం అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగిన తెరాస ప్లీనరీలో పాలనా సంస్కరణలు, విద్యుత్‌, ఐటీ, పారిశ్రామిక అభివృద్ధిపై కేటీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో ‘త్రీ’ ఐ సూత్రం పాటిస్తున్నామని ప్రధాని మోదీకి వివరించినట్లు చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి.. అక్షాంశాలు, రేఖాంశాలతో భూములను గుర్తించి పాసు పుస్తకాలు జారీ చేస్తామన్నారు.

3. ఏపీలో రేపట్నుంచి రేషన్‌ దుకాణాలు బంద్‌!

సమస్యలు పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డీలర్ల నుంచి ఐసీడీఎస్‌కు మళ్ళించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డీలర్లు కోరారు. 

4. జల దృశ్యంతో మొదలై దోపిడీ దృశ్యంగా తెరాస ప్రస్థానం: రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి 20ఏళ్ల ప్రస్థానం జల దృశ్యంతో మొదలై దోపిడీ దృశ్యంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నిర్మాణం, ఉద్యమ సమయంలో అండగా ఉన్న ఏ ఒక్కరినీ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ స్మరించుకోలేదన్నారు. ఎంతో మంది సమాధుల మీద తెరాస పార్టీ నిర్మాణం జరిగిందని ఆరోపించారు.

5. రూ.వేల కోట్లు ఖర్చు పెట్టినా తెరాసకు ఓటమి తప్పదు: ఈటల

వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాసకు ఓటమి తప్పదని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్‌ పాలనను కూల్చడమే కర్తవ్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. ఆబాది జమ్మికుంటలో యువతతో నిర్వహించిన సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావుతో కలిసి ఈటల మాట్లాడారు.

6. నవంబర్‌లో బ్యాంకులకు 17 రోజుల సెలవు.. నిజమెంత?

నవంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. అయితే, అన్ని రాష్ట్రాలకూ ఈ సెలవులు వర్తించవు. రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే దీపావళి, గురునానక్‌ జయంతి/ కార్తిక పూర్ణిమ, సాధారణ సెలవులు (శని, ఆదివారాలు)తో కలిపి మొత్తం 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.

7. రష్యాలో ఆగని కొవిడ్‌ మరణ మృదంగం!

రష్యాలో కరోనా మృత్యుకేళి కొనసాగుతోంది. అక్కడ కొవిడ్ కేసులు, మరణాలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 39,930 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పట్నుంచి ఇవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు, ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్యా భారీగానే ఉంటోంది. నిన్న ఒక్కరోజే రష్యాలో 1069మంది మరణించారు.

8. అత్యంత పవర్‌ఫుల్‌ పల్సర్‌ ఇదేనట.. మరి ఫీచర్లివేనా?

కొత్త డిజైన్‌తో రానున్న బజాజ్‌ పల్సర్‌ 250తో పాటు మరో కొత్త బైక్ పల్సర్‌ 250ఎఫ్‌ ఈ నెల 28న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఇటీవల ఈ బైక్‌లకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు వచ్చిన పల్సర్‌ బైక్‌లలో ఇవే అత్యంత శక్తిమంతమైనవిగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. కొత్త పల్సర్‌ 250.. 27 హెచ్‌ఫీ శక్తిని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. 

9. కట్నం తీసుకున్నారా?అయితే ప్రభుత్వానికి లెక్క చెప్పండి!

వరకట్న వ్యవస్థని నిర్మూలించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. పెళ్లి సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఓ ఉత్తర్వులో పేర్కొంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 10 వేల మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి వరకట్న వివరాలు సమర్పించాల్సి ఉంది.

10. ఆకలితో అలమటిస్తోన్న అఫ్గాన్‌.. సగం మంది పస్తులే!
తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లో ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే లక్షల మందికి పూర్తి స్థాయిలో తిండి దొరకక పస్తులే ఉంటున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. తక్షణమే వీటి నుంచి బయటపడే చర్యలు చేపట్టకపోతే అఫ్గానీయుల ఆకలి కేకలతో అక్కడ దారుణ పరిస్థితులు ఏర్పడుతాయని ఐక్యరాజ్యసమితి మరోసారి హెచ్చరించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని