Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

తాజా వార్తలు

Updated : 26/10/2021 21:00 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. అనేక మంది ఐఏఎస్‌లు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే

ఐఐటీ ర్యాంకర్లు ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. ఎస్పీ, ఎస్టీ గురుకులాల్లో చదివిన ఐఐటీ ర్యాంకర్లను అభినందించిన సీఎం జగన్‌.. విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అనేక మంది ఐఏఎస్ అధికారులు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే అని అన్నారు. అలాంటి ఐఏఎస్‌లను చూసి ఐఐటీ ర్యాంకర్లు స్ఫూర్తి పొందాలన్నారు. సీఎంఓ అధికారి ముత్యాలరాజు జీవితమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యార్థులందరికీ తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

2. ఈటలను గెలిపించి కేసీఆర్‌ అహంకారాన్ని అణచాలి: తరుణ్‌ చుగ్‌

అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతోందని భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఈటలకు మద్దతుగా తరుణ్‌ చుగ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో భాజపా మేనిఫెస్టో విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు. హుజూరాబాద్‌లో విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

3. ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై జగన్‌ చర్యలు.. బజారునపడ్డ విద్యార్థులు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యాసంస్థల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విద్యావ్యవస్థ మనుగడకే గొడ్డలిపెట్టని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యార్థులు, తల్లిదండ్రుల డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే బాధితుల పక్షాన తెదేపా పోరాడుతుందని హెచ్చరించారు. జగన్ రెడ్డి చర్యలతో విద్యార్థులు బడిలో ఉండకుండా బజారున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

4. వివేకా హత్య కేసు.. ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కడప నుంచి పులివెందుల కోర్టుకు వచ్చిన సీబీఐ అధికారులు ఐదారు సంచుల్లో కేసుకు సంబంధించిన దస్త్రాలను తీసుకొచ్చారు. పులివెందుల కోర్టులో కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించిన అధికారులు ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

5. సమంతకు ఊరట.. వ్యక్తిగత వివరాలు ప్రసారం చేయొద్దన్న కోర్టు

ప్రముఖ నటి సమంతకి కూకట్‌పల్లి కోర్టులో ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయకూడదని, ఇప్పటికే పలు యూట్యూబ్‌ ఛానల్స్‌లో ఆమెకి సంబంధించిన వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఆమె కూడా వ్యక్తిగత వివరాల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకూడదని సమంతకి సూచించింది. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతో పాటు సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

6. క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్‌

బాలీవుడ్‌ని కుదిపేస్తున్న ముంబయి క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అరెస్టయినవారిలో ఇద్దరు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. ముంబయిలోని మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల (ఎన్‌డీపీఎస్‌) కేసుల విచారణకు ఉద్దేశించిన ప్రత్యేక న్యాయస్థానం మనీశ్‌ రాజ్‌గారియా, అవిన్‌ సాహూలకు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. 

ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

7. ‘ఏవై.4.2 వేరియంట్‌ వ్యాప్తి వేగవంతమే.. కానీ..’

కొవిడ్‌ వైరస్‌ మరో ఉత్పరివర్తనం చెంది ప్రస్తుతం ‘ఏవై.4.2’ వేరియంట్‌ రూపంలో వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు ఈ రకం వైరసే కారణమని అనుమానిస్తున్నారు. గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లుయెంజా డేటా(జీఐఎస్‌ఏఐడీ) వివరాల ప్రకారం.. భారత్‌లోనూ ఇప్పటివరకు దాదాపు 17 నమూనాల్లో ‘ఏవై 4.2’ వేరియంట్‌ను గుర్తించారు. అయితే.. ఈ కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నా.. ప్రాణాంతకం కాకపోవచ్చని ఐసీఎంఆర్‌ ఎపిడెమియాలజీ విభాగం అధిపతి డా.సమీరన్ పాండ ఓ వార్తాసంస్థకు తెలిపారు. 

8. చిగురుటాకులా వణుకుతోన్న రష్యా..!

కరోనా మహమ్మారి రష్యాను చిగురుటాకులా వణికిస్తోంది. నిత్యం 30 వేలకు పైగా కేసులు, వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోతోంది. తాజాగా రికార్డు స్థాయిలో రోగబాధితులు మృత్యు ఒడికి చేరుకున్నారు. 24 గంటల వ్యవధిలో 1,106 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఆ దేశంలో అడుగుపెట్టిన దగ్గరి నుంచి ఇవే అత్యధిక మరణాలు కావడం గమనార్హం. నిన్న 36,446 మందికి వైరస్ సోకింది.

9. మస్క్‌ సంపాదన.. గంటలో రూ.11 వేల కోట్లు!

ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన పారిశ్రామికవేత్త, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌.. తాను స్థాపించిన టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీలతో ఆయా రంగాల్లో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సంపద సైతం అదే స్థాయిలో పెరుగుతూ పోతోంది. సోమవారం ఒక్కరోజే ఆయన సంపద ఏకంగా 36.2 బిలియన్‌ డాలర్లు ఎగబాకింది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.2.71 లక్షల కోట్లు. అంటే గంటకు సుమారు రూ.11.31 వేల కోట్లన్నమాట! 

10. రాణించిన మార్‌క్రమ్‌.. వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా విజయం

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 దశ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మార్‌క్రమ్‌ (51; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డస్సెన్‌ (43; 51 బంతుల్లో 3 ఫోర్లు, ) రాణించడంతో విండీస్‌ నిర్దేశించిన  144 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ బావుమా (2) తర్వగా పెవిలియన్ చేరినా తర్వాత వచ్చిన డస్సెన్‌.. ఓపెనర్ హెన్‌డ్రిక్స్‌(39)తో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని