Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 28/10/2021 20:57 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తెరాస ప్లీనరీ ఫ్లెక్సీలు.. మంత్రి, మేయర్‌, ఎమ్మెల్యేకు జరిమానా

తెరాస ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై విమర్శలు రావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన  ఒక్కో ఫ్లెక్సీకి రూ.5 వేల నుంచి రూ.25వేల వరకు జరిమానాలు విధించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి ఈవీడీఎం (డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) వెబ్‌సైట్‌ పనిచేయలేదని, వెబ్‌సైట్‌ను ఇవాళ పునరుద్ధరించినట్టు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

2. గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఏపీ సీఎం జగన్‌ కలిశారు. గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన జగన్‌.. నవంబరు ఒకటో తేదీన జరిగే వైఎస్సార్‌ జీవిత సాఫల్య అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానించారు. దాదాపు 40 నిమిషాల పాటు గవర్నర్‌తో సమావేశమైన సీఎం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు దారితీసిన అంశాలను గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది.

3. డీపీఆర్‌లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపించాలి: తెలంగాణ 

తెలంగాణ ప్రాజెక్టులకు ఆరు డీపీఆర్‌లను పరిశీలన పేరుతో జాప్యం చేస్తున్నారని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ అన్నారు. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. రిమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ డీపీఆర్‌లను వెంటనే కేంద్ర జలసంఘానికి పంపించాలని లేఖలో పేర్కొన్నారు. జాప్యం చేయడం ద్వారా విభజన చట్టం క్లాజులను మీరుతున్నారని వెల్లడించారు.

4. తెదేపా పరుష వ్యాఖ్యలను ఈసీకి వివరించాం: వైకాపా

వైకాపా నేతల బృందం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తెలుగుదేశం పార్టీపై ఫిర్యాదు చేసింది. ఈసీని కలిసిన అనంతరం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెదేపా నేతలు లోకేశ్‌, పట్టాభి చేసిన పరుష వ్యాఖ్యలను ఈసీకి వివరించినట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని  కోరామని వివరించారు. శాసనమండలిలో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని కోరామని తెలిపారు.

5. రాజధాని రైతుల పాదయాత్రకు అనుమతివ్వలేం: డీజీపీ

అమరావతి ఉద్యమాన్ని విస్తృతం చేసే క్రమంలో రాజధాని రైతులు మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో 45 రోజుల పాటు పాదయాత్ర చేయాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస నిర్ణయించాయి. దీంతో పాదయాత్రకు అనుమతి కోరుతూ పోలీసులకు రాజధాని రైతులు లేఖ రాశారు. దీనిపై స్పందించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. 

6. భాజపా ఎటూ వెళ్లిపోదు.. రాహుల్‌కే అది అర్థంకావట్లేదు: పీకే

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు కాంగ్రెస్‌తో సంబంధాలు పూర్తిగా చెడినట్లేనా..?ప్రస్తుత పరిణామలు చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కిన పీకే.. తాజాగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయాల నుంచి భాజపా ఇప్పుడప్పుడే దూరంగా వెళ్లిపోదని, ఆ విషయం రాహుల్‌కే ఇంకా అర్థమవ్వట్లేదంటూ ఎద్దేవా చేశారు. 

7. మళ్లీ బుసకొడుతోన్న కరోనా.. ఆంక్షల చట్రంలోకి ప్రపంచ దేశాలు..!

ప్రపంచ దేశాలు మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంటున్నాయి. రికార్డు స్థాయి మరణాలతో రష్యా అల్లాడిపోతోంది. గంటల వ్యవధిలో భారీగా కేసులు పెరగడంతో సింగపూర్ ఉలిక్కిపడింది. జీరో టోలరెన్స్‌ పాలసీ అనుసరిస్తోన్న చైనా పదుల సంఖ్యలో వస్తోన్న కేసులను కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. దాంతో పలు దేశాలు కొవిడ్ ఆంక్షల్ని కఠినతరం చేస్తున్నాయి. మరికొన్ని ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.

8. తక్కువ తినండి.. ఉత్తర కొరియా ప్రజలకు కిమ్‌ పిలుపు!

ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార కొరతతో అల్లాడుతోంది. కఠినమైన కరోనా ఆంక్షలు, సరిహద్దుల మూసివేత, గతేడాది తుపానుల కారణంగా దేశంలో పరిస్థితులు మరింత దిగజారాయి. దీంతో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పిలుపునిచ్చినట్లు సమాచారం. ధాన్య ఉత్పత్తి ప్రణాళికను నెరవేర్చడంలో వ్యవసాయ రంగం విఫలమైనందునే ఈ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినట్లు కిమ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం! 

9. ‘పాక్‌ గెలిస్తే సంబరాలా..? దేశద్రోహం కేసు పెడతాం’

ఇటీవల టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్థాన్‌ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నవారిపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అలాంటి వారిపై దేశద్రోహం కేసులు మోపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం గురువారం ఉదయం ట్వీట్‌ చేసింది. 

10. టాప్‌-5 దానకర్ణులు వీళ్లే!

దేశంలో ఎంతో మంది సంపన్నులు తమ సంపదలో కొంతమొత్తాన్ని దానం చేస్తూ సహృదయాన్ని చాటుకుంటున్నారు. ఈ విషయంలో విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.9,713 కోట్లు దాతృత్వానికే వెచ్చించి అందరికంటే ముందున్నారు. ఆ తర్వాత హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ శివనాడర్ రూ.1,263 కోట్లతో రెండో స్థానంలో, ముఖేశ్‌ అంబానీ రూ.577 కోట్లతో మూడు, కుమార మంగళం బిర్లా రూ.377 కోట్లతో నాలుగు, గౌతమ్‌ అదానీ రూ.130 కోట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని