Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

తాజా వార్తలు

Published : 29/07/2021 12:54 IST

Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. ఉన్నతవిద్యతోనే పేదరికం నిర్మూలన : సీఎం జగన్‌

ఉన్నత చదువులు లేకపోతే పేదరికం ఎప్పటికీ పోదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. గురువారం ‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత సాయం నిధులను సీఎం విడుదల చేశారు. మొత్తం 10.97 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.693.81 కోట్లను జమ చేశారు. ఏప్రిల్‌ 19న మొదటి విడత ఇవ్వగా.. గురువారం రెండో విడత చెల్లింపులు చేసినట్లు వివరించారు. 

2. సినారెను పాత, కొత్త తరానికి వారధి: వెంకయ్య

జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి(సినారె) జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.‘‘సాహితీ ప్రపంచంలో సినారేది ప్రత్యేక స్థానం. తెలుగు కవుల్లో సినారెను ఎంతగానో అభిమానిస్తా. ఆయన రచనలు పాత తరానికి, కొత్త తరానికి వారధి వేశాయి. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సినారె సుసంపన్నం చేశారు. సినారెను తెలుగుజాతి తరతరాలు గుర్తు పెట్టుకుంటుంది’’ అని వెంకయ్య అన్నారు.

3. శ్రీశైలానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ఆలయం: శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. దీంతో 10 గేట్లను పది అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.2,76,160 క్యూసెక్కుల వరద ప్రవాహం సాగర్‌ దిశగా సాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4,62,390 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

4. విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం.. లోక్‌సభ వాయిదా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ఫోన్ల హ్యాకింగ్‌, రైతు సంబంధిత అంశాలు కుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో గురువారం కూడా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్‌సభలో బుధవారం కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు ప్లకార్డులు, పత్రాలు చించి వాటిని స్పీకర్‌ స్థానం వైపు, అధికార పక్షం వైపు విసిరి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

5. 4 లక్షల ఎగువకు క్రియాశీల కేసులు

దేశంలో రెండోరోజు కరోనా కేసులు 40వేలకు పైనే వెలుగుచూశాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ కూడా 600పైనే మరణాలు సంభవించాయి. అలాగే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

6. కేరళలో సంపూర్ణ లాక్‌డౌన్

కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ 20వేలపైన కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడికి చేసేందుకు అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపింది. వారాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31, ఆగస్టు 1న ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

7. అగ్రరాజ్యంపై మళ్లీ కరోనా పంజా..

అగ్రరాజ్యం అమెరికాపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్‌ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించగా.. గత కొన్ని రోజులుగా మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. తాజాగా అక్కడ 24 గంటల వ్యవధిలో 88,376 కేసులు వెలుగుచూశాయి.

8. లాభాల్లో మొదలైన సూచీలు.. సెన్సెక్స్‌ 200+

వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా దిగ్గజ రంగ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో మార్కెట్లు లాభాలతో మొదలుపెట్టాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా ఎగబాకగా.. నిఫ్టీ 15,750 పైన కదలాడుతోంది. 

9. Tokyo Olympics: వేకువ నుంచీ గెలుపు వార్తలే..

ఓటములతో విసిగిపోయిన అభిమానులకు గురువారం శుభవార్తలు వినిపించాయి. ఉదయాన్నే గెలుపు వార్తలు తెలిశాయి. భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాపై భారత హాకీ జట్టు తిరుగులేని విజయం నమోదు చేసింది. విలువిద్యలో అతాను దాస్‌ ప్రీక్వార్టర్స్‌ చేరుకొని ఆశలు కల్పిస్తున్నాడు.

10. KGF2: స్టైలిష్‌ లుక్‌లో అధీరా అదరగొట్టేశాడు..!

‘కేజీఎఫ్‌-2’ నుంచి ఓ సరికొత్త అప్‌డేట్‌ వచ్చింది. సంజయ్‌ దత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ‘అధీరా’ సరికొత్త పోస్టర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఇందులో సంజయ్‌దత్‌.. కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు. మరోవైపు ‘అధీరా’ పోస్టర్‌ షేర్‌ చేసిన సంజయ్‌.. ‘మీ అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ‘కేజీఎఫ్‌-2’లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని