Corona: ఊరటనిచ్చే పాజిటివ్‌ న్యూస్‌
close

తాజా వార్తలు

Published : 13/06/2021 19:40 IST

Corona: ఊరటనిచ్చే పాజిటివ్‌ న్యూస్‌

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ పక్రియను వేగవంతం చేసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం..

✍️ కరోనాతో కన్నుమూసిన తమ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ ప్రైవేటు రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు ముందుకు వచ్చింది. నాలుగు రెట్ల సీటీసీ(cost to company)ని చెల్లించడంతో పాటు, చనిపోయే సమయానికి ఉద్యోగి అందుకుంటున్న వేతనాన్ని ప్రతి నెలా రెండేళ్ల పాటు అతడి కుటుంబ సభ్యులకు అందించనుంది. ‘మా బ్యాంకులో పనిచేస్తున్న వారందరూ యువ ఉద్యోగులు. చనిపోయిన ఉద్యోగి కుటుంబాలు షాక్‌లో ఉన్నాయి. అలాంటి వారికి రెండేళ్ల పాటు వేతనం అందిస్తే, ఆర్థికంగా కోలుకుంటారు’ అని బ్యాంకు ఎండీ వైద్యనాథన్‌ తెలిపారు.

✍️ కరోనా నిర్ధారణకు సరికొత్త సెన్సార్లు కలిగిన డివైజ్‌ అందుబాటులోకి రానుంది. జన సమ్మర్థ ప్రదేశాల్లో ఈ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను ఉపయోగించి ఎవరెవరిలో ఇన్‌ఫెక్షన్‌ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసన్‌ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేస్తున్నారు. కరోనా లక్షణాల ఆధారంగా శరీరం నుంచి వచ్చే వాసనను బట్టి ఈ పరికరం సెన్సార్లు కరోనా వైరస్‌ను గుర్తిస్తాయి. ప్రస్తుతం ఇది ప్రయోగదశలోనే ఉంది.

✍️ ఇప్పటి వరకూ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు 26 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు సరఫరా చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన డోసులతో పాటు రాష్ట్రాలు నేరుగా తయారీ సంస్థల నుంచి కోనుగోలు చేసినవి ఉన్నాయని తెలిపింది. రాష్ట్రాలకు అందిన మొత్తం 26,64,84,350 టీకా డోసుల్లో 25,12,66,637 డోసులు వినియోగించారని(వ్యర్థాలతో కలిపి) పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రాల వద్ద ఇప్పటికీ 1.53 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు మరో 4.5 లక్షల డోసులు సరఫరాలో ఉన్నాయి. రానున్న మూడు రోజుల్లో ఇవి ఇవి ఆయా రాష్ట్రాలకు చేరనున్నాయి.

✍️ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,02,876 పరీక్షలు నిర్వహించగా.. 6,770 కేసులు నిర్ధారణ అయ్యాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో 85,637 యాక్టివ్‌ కేసులున్నాయి.

✍️ కరోనా ఉద్ధృతి నుంచి దేశ రాజధాని దిల్లీ దాదాపు కుదుటపడింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి దిల్లీలో మరిన్ని సడలింపులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 14వ తేదీ నుంచి రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని అయితే, 50శాతం సామర్థ్యంతోనే వాటిని నడపాలని అన్నారు. అదే విధంగా మున్సిపల్‌ జోన్స్‌లో వారాంతపు మార్కెట్‌లకు కూడా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.

✍️ భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు వైరస్‌లు వ్యాప్తి చెందకుండా కళ్లెం వేసే చర్యల్లో భాగంగా బ్రిటన్‌లో ‘జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం’ ఏర్పాటు కానుంది. భవిష్యత్తులో ఎప్పుడు కొత్త రకం వైరస్‌ బయటపడినా దానిని కీలకమైన తొలి 100 రోజుల్లోనే నియంత్రించగలిగేలా వివిధ రకాల చర్యలు చేపట్టాలని జి-7 దేశాలు నిర్ణయించాయి.

✍️ కరోనా చికిత్సకు భారత్‌లో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌’ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)’లో 40 మంది కొవిడ్‌ బాధితులకు ఇటీవల ఈ డ్రగ్‌ ఇచ్చినట్లు ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. వారంతా జ్వరం సహా ఇతర అనారోగ్య లక్షణాల నుంచి 24 గంటల్లో కోలుకున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల్లో వైరస్‌ సైతం పూర్తిగా కనుమరుగైనట్లు తెలిపారు.

✍️ దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు లక్షకు దిగువనే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 80,834 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 2 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసుల నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక క్రితం రోజుతో పోల్చితే మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని