close

తాజా వార్తలు

Published : 16/04/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1PM

1. కాకర్ల సుబ్బారావు కన్నుమూత
ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజుల క్రితం కిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.  పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్‌ పట్టా పొందారు. 1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన తర్వాత  వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్‌, బాల్టిమోర్‌ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.  ఒంటిమిట్ట ఆలయం మూసివేత

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత కొనసాగుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కుంభమేళాలో 30మంది సాధువులకు కరోనా 

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న పవిత్ర కుంభమేళాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటికే అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. తాజాగా కుంభమేళాలో పాల్గొన్న 30 మంది నాగసాధువులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆల్‌ ఇండియా అఖాడా పరిషత్‌ నాయకుడు మహంత్‌ నరేంద్ర గిరి కూడా కరోనాతో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేరారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. రెండోరోజూ రెండు లక్షలకుపైగా కేసులు.. 

దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత సంవత్సర కాలంలో ఎన్నడూ లేని ఉద్ధృతితో ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. దేశవ్యాప్తంగా తాజగా 14,73,210 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,17,353 కొత్త కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917 చేరింది. నిన్న 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల దీక్ష

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్‌ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. మూడు రోజులు పాటు చేపట్టిన దీక్షకు పోలీసులు ఒక రోజు మాత్రమే అనుమతించిన విషయం తెలిసిందే. మొదటి రోజు గురువారం ఉదయం ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో షర్మిల దీక్షను ప్రారంభించారు. కాగా, సాయంత్రం ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఇండియానా పోలిస్‌లో భారీగా కాల్పులు

అమెరికాలోని ఇండియానా పోలిస్‌లో స్థానిక కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి భారీగా కాల్పలు జరిగాయి. ఈ ఘటన ఇండియానా పోలిస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఫెడెక్స్‌ కొరియర్‌ సేవల సంస్థ వద్ద  చోటు చేసుకొంది.  ఈ విషయాన్ని మెట్రో పోలిస్‌ డిపార్ట్‌మెంట్‌ పబ్లిక్‌ ఇన్ఫ్మర్మేషన్‌ అధికారి విలియమ్‌ యంగ్‌ వెల్లడించారు. ఈ కాల్పుల్లో కనీసం ఐదుగురు మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భారీ సంఖ్యలో గాయపడినట్లు భావిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

7. ఆమె మేను పరాధీనం!

భాగస్వాములతో శృంగారంలో పాల్గొనాలో వద్దో స్వతంత్రంగా నిర్ణయించుకునే హక్కు మహిళలకు కరవవుతోందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. గర్భనిరోధక సాధనాలు వినియోగించడం, ఆరోగ్య సేవలు పొందడం వంటి విషయాల్లోనూ వారికి నిర్ణయాధికారం ఉండటం లేదని వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న 57 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం ‘ఐరాస జనాభా నిధి (యూఎన్‌పీఎఫ్‌)’ ఈ నివేదికను విడుదల చేసింది. కోట్ల మంది మహిళలు, బాలికలకు శారీరక స్వతంత్రత లేదని అందులో ఆవేదన వ్యక్తం చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

8. తెలంగాణలో 3,840 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 3,840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,797కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1198 మంది కోలుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

9. ఉద్యోగం కోల్పోయారా..పరిహారంపై పన్ను రాయితీ!

కరోనా మహమ్మారి మూలంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ క్రమంలో కంపెనీ నుంచి ఉద్యోగికి కొంత పరిహారం లభించే అవకాశం ఉంది. అయితే, వీటిపై పన్ను రాయితీ లభిస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఒకవేళ రాయితీని క్లెయిం చేసుకోకపోతే.. మీ ట్యాక్స్‌ శ్లాబ్‌ని అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 89, ఐటీ రూల్స్‌, 1962 లోని రూల్‌ నెం 21ఏ ప్రకారం రాయితీని పొందే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

10. ఎంపీ కేశినేనికి కొవిడ్‌ పాజిటివ్‌

విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నానికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని