టాప్‌ 10 న్యూస్‌ @ 9AM
close

తాజా వార్తలు

Published : 17/04/2021 08:56 IST

టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

1. ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూత

కోలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు వివేక్‌(59) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వివేక్‌ చేరిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. వివేక్‌ ఆకస్మిక మరణంతో తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్‌ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ వెండితెరకు పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ ఒకరు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.కొవిడ్‌.. కొత్తగా!

కొవిడ్‌ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షించినప్పుడు కూడా పాజిటివ్‌ వస్తోందని చెబుతున్నారు. కనుగుడ్డు నుంచి సైతం వైరస్‌ శరీరంలోనికి చేరుతోందని, అలాంటి వారిలో కళ్లు ఎర్రబడుతున్నాయని పేర్కొంటున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. నెలకు 10 కోట్ల కొవాగ్జిన్‌ డోసులు

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత నివారణ చర్యల్లో భాగంగా భారత్‌ బయోటెక్‌ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తి స్థాయిని సెప్టెంబరుకల్లా నెలకు 10 కోట్ల డోసుల తయారీ స్థాయికి తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాఫ్‌కైన్‌తో పాటు హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌, బులంద్‌షెహర్‌లోని భారత్‌ ఇమ్యునలాజికల్స్‌ అండ్‌ బయోలాజికల్స్‌ లిమిటెడ్‌లోనూ కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు బయోటెక్నాలజీ విభాగం శుక్రవారం తెలిపింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.గాలి ద్వారా కరోనా వ్యాప్తి!

గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు బలమైన ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణులు ఈ పరిశోధన చేశారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందన్న వాస్తవాన్ని విస్మరిస్తే మహమ్మారి మరింతగా విజృంభిస్తుందని హెచ్చరించారు. ఈ పరిశోధనకు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నేతృత్వం వహించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. కొనసాగుతున్న తిరుపతి, సాగర్‌ పోలింగ్‌

 ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోని నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 17,10,699 మంది ఓటర్లున్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. పారాసెట్మాల్‌కు అధిక గిరాకీ

కొవిడ్‌-19 రెండోదశ తీవ్రత హెచ్చి ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో  జ్వరం, యాంటీ-బయాటిక్‌, మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లకు మళ్లీ గిరాకీ పెరిగింది. జ్వరానికి వాడే పారాసెట్మాల్‌ ట్యాబ్లెట్ల అమ్మకాలు బాగా పెరిగినట్లు ఔషధ కంపెనీలు, రిటైల్‌ దుకాణాల నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. కొవిడ్‌-19 వ్యాధి మొదటి లక్షణం జ్వరం రావడం. ఆ తర్వాత గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు,  జలుబు, దగ్గు, ఆయాసం.. కనిపిస్తున్నాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితి రావద్దు

‘‘రాష్ట్రంలో మళ్లీ ఎలాంటి లాక్‌డౌన్‌ లేకుండా కరోనాను నియంత్రించాలి. రెండోదశలో కేసులు తీవ్రమవుతున్నాయి. ఇంతకుముందు లాక్‌డౌన్‌తో ఆర్థిక రంగం దెబ్బతిన్నది. ప్రజలూ ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదు. వ్యాక్సిన్‌ అస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. పరీక్షలు పెంచి, ఆసుపత్రులను సన్నద్ధం చేసి కొవిడ్‌ విస్తరించకుండా చూడాలి. బాధితులు 104కు ఫోన్‌ చేసిన మూడు గంటల్లోనే... 108 వాహనం, వైద్యుడు, పడకలు, మందుల కిట్‌ అన్నీ సమకూర్చాలి.’’ అని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులకు ముఖ్యమంత్రి ఉద్బోధించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. దీపక్‌ స్వింగ్‌.. చెన్నై కింగ్‌

ఆఖరి బంతి వరకు ఉత్కంఠ లేదు.. సిక్స్‌ల హోరు లేదు.. పరుగుల వరద లేనే లేదు.. ఈసారి ఐపీఎల్‌లోనే తొలి ఏకపక్ష మ్యాచ్‌! స్వల్ప స్కోర్లు నమోదైన కింగ్స్‌ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌ పైచేయి సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌ను అలవోకగా ఓడించి ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. దీపక్‌ మెరుపు బౌలింగ్‌తో మ్యాచ్‌ ఆరంభంలోనే వెనకబడ్డ పంజాబ్‌.. ఆ తర్వాత ఏ దశలోనూ చెన్నైకు పోటీ ఇవ్వలేకపోయింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. నైరుతిపై చల్లని కబురు

దేశంలో ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ పరిశోధన సంస్థ (ఐఎండీ) కూడా చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతం ఉంటుందని శుక్రవారం వెల్లడించింది. ‘‘దేశానికి నిజంగా ఇది శుభవార్త. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ)లో 98 శాతం (5 శాతం అటు ఇటుగా) ఉంటుంది. ఇది సాధారణ వర్షపాతాన్నే సూచిస్తుంది. భారత్‌లో మంచి వ్యవసాయ దిగుబడులకు ఇది ఎంతగానో దోహదపడుతుంది’’ అని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర శాఖ కార్యదర్శి ఎం.రాజీవన్‌ ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. సకాలంలో చేరితే సంపూర్ణ ఆరోగ్యం

కరోనా రోగులు సకాలంలో తమ ఆసుపత్రిలో చేరితే వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి ఇళ్లకు పంపించే బాధ్యత తమదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు భరోసా ఇచ్చారు. గత ఏడాది కొవిడ్‌ సమయంలో గాంధీ ఆసుపత్రి విశేషంగా సేవలందించింది. కొన్ని నెలలపాటు రాత్రీపగలూ తేడా లేకుండా వైద్యులు, ఇతర సిబ్బంది పని చేశారు. ఇప్పుడు కూడా అదే విధమైన సేవలు అందించేందుకు ‘గాంధీ’ సిద్ధమైంది. శనివారం నుంచి మళ్లీ పూర్తిస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా రూపాంతరం చెందనుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని