Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 21:09 IST

Top Ten News @ 9 PM

1. Ap News: పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘జులై 31 లోపు ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం. మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతాం. ఫలితాల కోసం హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదు. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాం’’ అని మంత్రి వెల్లడించారు. 

2. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కేటీఆర్‌

వర్షాకాలం కోసం రూపొందించుకున్న ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పని చేయాలని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) యంత్రాంగాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జోనల్ కమిషనర్లు, అధికారులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు.

3. వ్యాక్సిన్‌ సరఫరా పెంచండి: ఏపీ హైకోర్టు

కొవిడ్‌ వ్యాక్సి్న్‌, బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్ల సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న కేటాయింపులపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేసింది. కొవిడ్‌ నియంత్రణ చర్యలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

4. AP NEWS: కేసీఆర్‌తో చర్చలకు సిద్ధం: సజ్జల

రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ, తెలంగాణ మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. సీమ ఎత్తిపోతలకు అనుమతులుంటే... పనులు ఆపాలని కృష్ణా బోర్డు ఎందుకు ఆదేశించిందని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కొందరు తెలంగాణ నేతలు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ఎవరైనా మాట్లాడితే సమస్య పరిష్కారమయ్యేలా ఉండాలని, విద్వేషాలు పెంచేలా ఉండకూడదన్నారు. 

5. ఆంధ్రా నాయకులు ఏం సమాధానం చెబుతారు?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఆదేశించిందన్నారు. డీపీఆర్‌ లేకుండా ప్రాజెక్టును కట్టవద్దని బోర్డు స్పష్టంగా చెప్పిందన్నారు. బోర్డు ఆదేశాలతో ఈ ప్రాజెక్టు అక్రమమని తేలిపోయిందని.. దీనిపై ఆంధ్ర ప్రాంత నాయకులు ఏం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు.

6. Corona Origin: డేటాను ‘డిలీట్‌’ చేస్తోన్న చైనా!
ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా వైరస్‌ మూలాలు యావత్‌ ప్రపంచానికి ఓ మిస్టరీగానే మారాయి. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచే లీక్‌ అయ్యిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనావైరస్‌ పరిణామ క్రమానికి సంబంధించిన నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్‌ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం. కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ.. చైనా కుటిల యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు.

7. JK: రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మోదీ సానుకూలం!

జమ్మూకశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది. మొత్తం 8 పార్టీల నుంచి 14 మంది నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అంశంపై ఈ భేటీలో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు తెలిపారు. అలాగే జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి గురించి నేతలు ప్రస్తావించిన పలు అంశాలను మోదీ ఓపిగ్గా విన్నారని చెప్పారు.

8. Pfizer: డెల్టా వేరియంట్‌ను కట్టడి చేస్తున్న ఫైజర్‌

భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌తో పాటు స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ కూడా డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఇదివరకే వెల్లడైంది. తాజాగా ఆ జాబితాలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ కూడా చేరింది. కాగా  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. భారత్‌లో నమోదైన డెల్టారకం వైరస్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతోందని తేలింది. తమ టీకా తీసుకుంటే డెల్టారకం వైరస్‌ నుంచి రక్షణ పొందొచ్చని గురువారం ఇజ్రాయెల్‌లో ఫైజర్‌ కంపెనీ అధికారి తెలిపారు.

9. Shiv Sena: రాహుల్‌ను టార్గెట్ చేసిన శివసేన

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను శివసేన పార్టీ తప్పుపట్టింది. రాహుల్ కేవలం ట్విటర్‌లో మాత్రమే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. అలాగే ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో దిల్లీలో జరిగిన సమావేశం గురించి శివసేన ప్రస్తావించి, ప్రశంసించింది.

10. పారదర్శకంగానే టీకాల కేటాయింపు: కేంద్రం

జనసంఖ్య, కేసుల పెరుగుదల, టీకాల వృథా నియంత్రణ ప్రాతిపదికగానే రాష్ట్రాలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్ 19 వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పారదర్శకంగా కేటాయించలేదని వచ్చిన మీడియా కథనాలను, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిరాధారమైనవిగా పేర్కొంటూ కొట్టిపారేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల ఆధారంగానే భారత్‌లో టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని