Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 24/10/2021 13:03 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఆ విషయంలో కేసీఆర్‌, కేటీఆర్, హరీశ్‌రావులు అంతే: రేవంత్‌ 

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను స్థానికేతరుడు అనడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు తమ నియోజకవర్గాలకు అనామకులే అని విమర్శించారు. బల్మూరి వెంకట్‌ స్థానికేతరుడు అని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో పోలీసులను నిజాయతీగా విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

2. మేఘాలకొండపై పర్యాటకుల సందడి.. 

విశాఖ జిల్లాలోని వంజంగి మేఘాలకొండకు పర్యాటకులు పోటెత్తారు. వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో మంచు వర్షం కురుస్తున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. దారి పొడవునా ప్రయాణంలో మునుపెన్నడూ లేని అనుభూతిని పొందుతూ ద్విచక్ర వాహనాలు, కార్లలో మేఘాలకొండకు చేరుకుంటున్నారు.

3.నగరంలో డ్రగ్స్‌ సమస్య లేనప్పటికీ అప్రమత్తత అవసరం: అంజనీకుమార్‌

తెలంగాణలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీసు శాఖ నడుం బిగించింది. యువతలో అవగాహన కల్పించడానికి చర్యలు చేపడుతోంది. మాదకద్రవ్యాలు తీసుకోవడం వలన కలిగే అనర్థాలపై కళాశాలలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల వద్ద విద్యార్ధులతో కలిసి పోలీసులు అవగాహన నడక నిర్వహంచారు. నడకను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రారంభించారు.

4. 16వేలకు దిగువన కొత్త కేసులు

భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే తాజా కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. తాజాగా 16 వేలకు దిగువన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

5. భారత్‌-చైనా మధ్య అనుమానాలే అడ్డంకి: బిపిన్‌ రావత్‌

భారత్‌-చైనా మధ్య అనేక అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలన్నింటినీ ఒకేలా చూడాలన్నారు. లద్దాఖ్‌, ఈశాన్య ప్రాంతంలోని సమస్యల్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు.

6. మీరూ చేస్తున్నారా డూమ్‌ స్క్రోలింగ్‌?

‘‘కొవిడ్‌ కారణంగా పెరుగుతున్న మరణాలు... కరోనాతో దీర్ఘకాల రుగ్మతలు... రోగులతో ఆసుపత్రులు కిటకిట..’’- సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ప్రతికూల కథనాలను ఎక్కువగా చూస్తున్నారా? అయితే, మీరు ‘డూమ్‌ స్క్రోలింగ్‌’ చేస్తున్నారన్న మాట! కొవిడ్‌ మహమ్మారి తలెత్తినప్పటి నుంచి ప్రపంచమంతటా చాలామంది ఇదే చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే కొవిడ్‌ ప్రతికూల కథనాలను ఒకదాని తర్వాత ఒకటిగా చూసుకుపోతుండటమే...‘డూమ్‌ స్క్రోలింగ్‌’.

7. రెండు వారాలైనా ఎన్‌కౌంటర్‌ ముగియలేదెందుకు..?

దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పూంచ్‌ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితో సహా.. బందీగా ఉన్న మరో ఉగ్రవాదిని గాయపర్చారు. భాతా-దురియా వద్ద ఎన్‌కౌంటర్‌ జరుగుతోన్న ప్రదేశానికి పోలీసులు, సైనికులు కలిసి.. తమ వెంట లష్కరే సంస్థకు చెందిన జియా ముస్తఫా అనే పాకిస్థానీ ఉగ్రవాదిని తీసుకెళ్లారు.

8. అగ్గిపెట్టె రూ.2.. 14 ఏళ్ల తరవాత ధర పెంపు

అగ్గి పెట్టె ధరలు 14 ఏళ్ల తరవాత పెరగనున్నాయి. ఇప్పటివరకు రూ.1కి విక్రయిస్తున్న అగ్గిపెట్టెను డిసెంబరు 1 నుంచి రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థలు ప్రకటించాయి. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి. రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర రూ.425 నుంచి రూ.810కి, మైనం ధర రూ.58 నుంచి రూ.80కి పెరిగిందని పేర్కొన్నారు.

9. నాకంటే ముందు నా తమ్ముడు ఆనంద్‌కే పెళ్లి

తనకంటే ముందు తన సోదరుడు ఆనంద్‌కే వివాహం జరుగుతుందని టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆనంద్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్పకవిమానం’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమాలో ఆనంద్‌ అమాయకుడైన యువకుడి పాత్రలో నటించారు.

10. ఈ చిన్నారుల చేతులు అద్భుతం చేశాయ్‌!

చెన్నైకి చెందిన ఇద్దరు చిన్నారులు అద్భుతం చేశారు. ఎలాగైనా మందుబాబుల బెడద నుంచి తమ స్కూల్‌ని రక్షించాలని సంకల్పించారు. తమ ఆలోచనకు.. పెన్నుకున్న పవర్‌ను జోడించారు. ఏకంగా కలెక్టర్‌కే లేఖ రాశారు. మంచి చేసే వారికి మంచే జరుగుతుంది కదా మరి! అందుకే వారి నిర్మలమైన మనస్సుకి తట్టిన ఆలోచన కలెక్టర్‌ను కదిలించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని