Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లోకి టాప్‌ 10 వార్తలు  

తాజా వార్తలు

Updated : 26/10/2021 13:55 IST

Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లోకి టాప్‌ 10 వార్తలు  

1. కరోనా కేసులు భారీగా తగ్గాయి..!

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు ఎనిమిది నెలల కనిష్ఠానికి తగ్గి.. 12 వేలకు పడిపోయాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రారంభ వేళ.. మార్చిలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత ఏప్రిల్‌, మే నెలలో రికార్డు స్థాయికి చేరిన వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోకి వస్తోంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెలువరించింది.

2. పాక్‌కు రహస్యాలు చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లో పనిచేస్తూ, శత్రు దేశం పాకిస్థాన్‌కు గూఢచారిగా మారిన ఓ ఉద్యోగిని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జమ్మూ-కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన మహమ్మద్‌ సాజిద్‌.. పదేళ్ల క్రితం 74 బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌లో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా వాట్సాప్‌ ద్వారా పాక్‌కు రహస్య, సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడు. అందుకు ప్రతిఫలంగా అతని సోదరుడు వాజిద్, సహచరుడు ఇక్బాల్‌ రషీద్‌ల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నట్టు ఏటీఎస్‌ గుర్తించింది.

3. భారత్‌ ఎన్నికల్లో ‘ఫేస్‌బుక్‌’ జోక్యం: కాంగ్రెస్‌ విమర్శలు

సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌పై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. భారత్‌లో ఎన్నికలను ఆ సంస్థ ప్రభావితం చేస్తూ..ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ విరుచుకుపడింది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేసింది. భారతీయ జనతా పార్టీ(భాజపా) చేతిలో ఫేస్‌బుక్‌ ఒక సాధనంగా మారిపోయిందని ఆరోపించింది. విద్వేష ప్రచారం, ప్రసంగాల విషయంలో ఆ సంస్థ అనుసరిస్తున్న తీరును కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా  తప్పుపట్టారు. ముఖ్యంగా హిందీ, బెంగాలీ భాషల్లో విద్వేష పోస్టులపై చర్యలు తీసుకొనే సిబ్బందిని కూడా ఫేస్‌బుక్‌ నియమించలేదని మండిపడ్డారు.

4. ‘బాలీవుడ్‌ నటుల ఫోన్లు ట్యాప్‌ చేసిన వాంఖడే’..!

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ముంబయి క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహరం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తరపున డబ్బు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌.. ఓ సంచలన లేఖను బయటపెట్టారు. సమీర్‌ వాంఖడే బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్‌ చేసి, వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేవారని మాలిక్‌ తాజాగా ఆరోపించారు. 

5. భారత్‌ సహా పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

భారత్‌ సహా పలు దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ అగ్రదేశం అమెరికా ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. తాజా నిర్ణయం నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడంతో అమెరికా మొదటిసారి విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. 

6. భారత్‌ ఓటమికి కారణాలు చెప్పిన సచిన్‌.. 

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సైతం ఈ మ్యాచ్‌పై తన విశ్లేషణను పంచుకున్నాడు. ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేసిన సచిన్‌ ఇలా చెప్పుకొచ్చాడు.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించిందని, పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా భారత్‌ ఇంచుమించు 20-25 పరుగులు తక్కువ స్కోర్‌ సాధించిందని అభిప్రాయపడ్డాడు. 

7. భారత్‌-పాక్‌ మధ్య ‘కశ్మీర్‌’ ఒక్కటే సమస్య: ఇమ్రాన్‌

భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరముందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. అయితే, టి-20 క్రికెట్‌ మ్యాచ్‌లో తమ జట్టు విజయం సాధించిన తరుణంలో ఈ అంశంపై చర్చించడం సరికాదన్నారు. సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆహ్వానం మేరకు ఇమ్రాన్‌ఖాన్‌ మూడు రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రియాద్‌లో సోమవారం ఏర్పాటుచేసిన పాక్‌-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరం సమావేశంలో ఇమ్రాన్‌ మాట్లాడినట్టు డాన్‌ పత్రిక పేర్కొంది.

8.  ఆ క్షణం అమ్మానాన్న ఏడ్చారు: దేవరకొండ బ్రదర్స్

సహాయ నటుడిగా వెండి తెరకు పరిచమై, పాన్‌ ఇండియా స్థాయి హీరోగా ఎదిగాడు విజయ్‌ దేవరకొండ. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తన మార్క్‌ చూపిస్తున్నాడు. తన సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా, విజయ్‌ నిర్మించిన ‘పుష్పక విమానం’ నవంబరు 12న విడుదల కానుంది. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రచారంలో భాగంగా దేవరకొండ బ్రదర్స్‌ ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ జీవితాల్లో జరిగిన ఆసక్తికర సంఘటనలను అన్నదమ్ములిద్దరూ పంచుకున్నారు.

9.  బైక్‌పై చిన్నారులను తీసుకెళ్తున్నారా?

ద్విచక్ర వాహనంలో వెనుక సీట్లో నాలుగేళ్లలోపు పిల్లల్ని కూర్చొబెట్టుకొని తీసుకెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ సూచించింది. దీనికోసం కొత్త నిబంధనలు రూపొందించి వాటి ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. వీటిపై సలహాలు, సూచనలను ఆహ్వానించింది. నిబంధనలు ఖరారైన తర్వాత ఏడాది నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం 4 ఏళ్లలోపు చిన్నారులను తీసుకెళ్లేటప్పుడు లైఫ్‌జాకెట్‌ లాంటి కొత్త తరహా జాకెట్‌ ధరించాలని పేర్కొంది. ఈ జాకెట్‌కు ఉన్న స్ట్రాప్స్‌ని డ్రైవర్‌ నడుము చుట్టూ బెల్టు మాదిరిగా బిగించాలని తెలిపింది. 

10. పాక్‌ అభిమాని మాటలకు షమి రియాక్షన్‌ ఇది

 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమిపాలవ్వడంతో పలువురు నెటిజన్లు పేసర్‌ మహ్మద్‌ షమిని కించపరుస్తున్నారు. పరుషపదజాలంతో ఆన్‌లైన్‌లో కామెంట్లు చేస్తూ తీవ్రంగా దూషిస్తున్నారు. అయితే, ఈ చర్యలను చాలా మంది అభిమానులు, క్రికెటర్లు ఖండిస్తున్నారు. షమికి అండగా నిలుస్తున్నారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌ లాంటివారు స్పందించారు. అలాగే రాజకీయ నేతల్లోనూ కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సైతం వాటిని ఖండించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని