Top TenNews @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 23/10/2021 17:02 IST

Top TenNews @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1.జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. పట్టాభికి బెయిల్‌ మంజూరు

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పట్టాభిరామ్‌ ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడ గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో బుధవారం రాత్రి విజయవాడ పటమటలోని ఆయన ఇంటివద్ద పోలీసులు హైడ్రామా నడుమ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

2.తెలంగాణలో పలు చోట్ల స్పల్పంగా కంపించిన భూమి

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి.

3. ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి ఘటనలో 10 మంది అరెస్టు

తెదేపా పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన 10 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శేషగిరి, పవన్‌, అడపాల గణపతి, షేక్‌ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్‌, పానుగంటి చైతన్య, పల్లపు మహేశ్‌, పేరూరి అజయ్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

4. కరోనా.. రెండేళ్ల ఆయువును తినేసింది..!

గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి దాదాపు అన్ని రంగాలను కుదిపేసింది. ఆర్థికంగా, సామాజికంగా కోట్లాది మంది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేనా, కొవిడ్‌ కారణంగా భారతీయుల ఆయుర్దాయం కూడా రెండేళ్లు తగ్గినట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

5. పిల్లలకు బండెడు హోంవర్క్‌ వద్దు.. చైనాలో కొత్త చట్టం!

చైనాలోని జిన్‌పింగ్‌ సర్కారు భావితరాలను గాడిన పెట్టేందుకు కఠిన చట్టాలను అమల్లోకి తీసుకొస్తోంది. పిల్లల్లో క్రమశిక్షణ, దేశభక్తి నింపడమే లక్ష్యమని చెబుతూ వారి అలవాట్లపై ఒకరకంగా ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ సమయాన్ని కుదించింది. అలాగే పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని గుర్తుచేస్తూ.. పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించింది.

6. అధికారంలోకి వచ్చాక జగన్‌ ఇంటి నుంచి కదలట్లేదు: సోము

ఏపీలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇంటి నుంచి బయటకు రావట్లేదని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కడప జిల్లా బద్వేల్‌లో ఉప ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న ఆయన.. వైకాపా నేతలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. బద్వేలులో భూకబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వైకాపా నేతలు సామాన్యుల స్థలాలనూ వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ కేసుల విచారణపై సుప్రీంలో రఘురామ పిటిషన్‌

7. కశ్మీర్‌కు చేరుకున్న అమిత్‌ షా.. 370 రద్దు అనంతరం తొలిసారి

మూడు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు జమ్మూ- కశ్మీర్‌కు చేరుకున్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ఆయన కశ్మీర్‌కు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా శ్రీనగర్‌ విమానాశ్రయంలో స్థానిక లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమిత్‌ షా.. ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జమ్మూకశ్మీర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ పర్వేజ్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్లారు.

8. ధాన్యానికి నిప్పుపెట్టిన రైతు.. వరుణ్‌ గాంధీ కీలక వ్యాఖ్య

కొత్త సాగు చట్టాలు.. ఇటీవల లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటన.. ఇలా రైతు సంబంధిత అంశాలపై తరచూ స్పందిస్తూ వస్తున్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ తాజాగా దేశ వ్యవసాయ విధానాలపై కీలక వ్యాఖ్య చేశారు. వాటి విషయంలో పునరాలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. లఖింపుర్‌లో ఓ రైతు.. ధాన్యానికి నిప్పు పెడుతున్న దృశ్యాలను పోస్ట్‌ చేస్తూ.. ఈ వ్యాఖ్యను జోడించారు.

9. మొత్తానికి నా కల నెరవేరింది

టాలీవుడ్ కథానాయిక సమంత.. నాగచైతన్యతో వైవాహిక జీవితానికి ముగింపు పలికిన తరువాత.. కెరీర్‌ పై దృష్టి పెట్టింది. వరుసగా తన తదుపరి చిత్రాల అప్‌డేట్‌ను దసరా రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే సామ్‌.. తన స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డితో కలిసి ‘ఛార్‌ధామ్‌ యాత్ర’ (గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌) పుణ్యక్షేత్రాల సందర్శనను పూర్తి చేసుకున్నారు.

10. మేడ్చల్‌ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌

మేడ్చల్‌ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న మెపిడ్రిన్‌ డ్రగ్‌ను ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పవన్‌, మహేందర్‌రెడ్డి, రామకృష్ణగౌడ్‌ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ఎస్‌.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నారు. నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని