Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 21/10/2021 11:55 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం

తెదేపా అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది. తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే చంద్రబాబు దీక్షకు కూర్చొన్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష.. రేపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.

2. అవినీతిపరుల్ని వెంటాడండి: ప్రధానిమోదీ

అవినీతిపరులెంతటి బలవంతులైనా వదలొద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లకు స్పష్టం చేశారు. వారికి ప్రపంచంలో ఎక్కడా చోటు దొరకకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రధాని బుధవారం కేవడియాలో సీవీసీ, సీబీఐ సంయుక్త సమ్మేళనాన్ని ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జాతీయ జీవితం నుంచి అవినీతిని నిర్మూలించడానికి సీబీఐ, సీవీసీ అధికారులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

3. మళ్ళీ కొవిడ్‌ కల్లోలం.. జోరుగా పెరుగుతున్న కేసులు

క్రమంగా అదుపులోకి వస్తోందనుకుంటున్న కొవిడ్‌ మరోసారి విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. అగ్రరాజ్యాల నుంచి చిన్న దేశాల వరకు అన్నిచోట్లా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో రోజూ 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలూ సంభవిస్తున్నాయి. డెల్టా ఉత్పరివర్తనంలోని ఏవై 4.2 రకం ఇక్కడ కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం.

4. విమానాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌ సేవలు

మన దేశ గగనతలంపై దేశీయ విమానాలు, అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడానికి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సన్నద్ధమైంది. ఇందుకు అవసరమైన లైసెన్సులను టెలికాం విభాగం (డాట్‌) నుంచి పొందింది. భారత్‌లో గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌(జీఎక్స్‌) మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడానికి తమ వ్యూహాత్మక భాగస్వామి బీఎస్‌ఎన్‌ఎల్‌కు లైసెన్సులు దక్కాయని బ్రిటిష్‌ శాటిలైట్‌ సంస్థ ఇన్‌మర్సాట్‌ బుధవారం తెలిపింది.

5. ధరలు మండిపోతున్నాయ్‌.. ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు..!

దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రో ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నేపథ్యంలో  రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి రంగంలోనూ కేంద్రం దేశాన్ని మోసం చేస్తోందని ఆరోపించారు. జైపూర్‌ సమీపంలోని చాక్సు వద్ద నిర్వహించిన దళిత్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ఏడేళ్లుగా భాజపా ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని.. నిరుద్యోగం రికార్డుస్థాయికి చేరిందని చెప్పారు.

బహిరంగ సభలో నిమ్మరసం చేసుకొని తాగిన అసోం సీఎం!

6. ఆరు నెలలుగా అతడి కడుపులో మొబైల్‌ ఉండిపోయింది!

ఓ వ్యక్తి కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడి కడుపులో ఆరు నెలలుగా మొబైల్‌ ఫోన్‌ ఉండటం గుర్తించి నివ్వెరపోయారు. వెంటనే శస్త్రచికిత్స చేసి మొబైల్‌ను బయటకు తీశారు. దక్షిణ ఈజిప్ట్‌లోని ఆస్వాన్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆరు నెలల క్రితం పొరపాటున మొబైల్‌ను మింగేశాడట.

7. అమెరికాలో అతి త్వరలోనే పిల్లలకు టీకా

అమెరికాలో అతి త్వరలోనే 5-11 ఏళ్ల పిల్లలకు కరోనా టీకాలు వేసేందుకు అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. పిల్లల టీకాకు సంబంధించి ఫైజర్‌ సంస్థకు అనుమతులు రావడం ఆలస్యం చిన్న పిల్లల ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, పాఠశాలల్లోనూ టీకా పంపిణీ కార్యక్రమాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈమేరకు శ్వేతసౌధం టీకా పంపిణీ ప్రణాళికను బుధవారం వెల్లడించింది.

8.పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులకు శిక్ష.. ఎక్కడంటే.?

పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులను శిక్షించేలా కొత్తచట్టాన్ని సిద్ధం చేసింది... చైనా! ‘ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ ప్రమోషన్‌ లా’ పేరుతో ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించింది. దీని ప్రకారం- పిల్లల ప్రవర్తన సరిగా లేకపోయినా, వారు నేరాలకు పాల్పడినా ముందుగా తల్లిదండ్రులకు సమాచారమిస్తారు. ఆ తర్వాత బిడ్డల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కన్నవారిపైనే ఉంటుంది. అప్పటికీ పిల్లలు మారకపోతే, వారి తల్లిదండ్రులు పనిచేసే సంస్థలకు, లేదా యజమానులకు విషయం చేరవేస్తారు.

9.ఫేస్‌బుక్‌కు షాక్‌.. రూ.515 కోట్ల జరిమానా!

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ కాంపీటీషన్‌ రెగ్యులేటర్‌ భారీ జరిమానా విధించింది. తాము అడిగిన వివరాలు సమర్పించడంలో ఫేస్‌బుక్‌ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, అందుకే రూ.515 కోట్ల (50.5 మిలియన్‌ పౌండ్లు) జరిమానాగా చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపింది. ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్న హెచ్చరిక పంపించాలన్న విధానాల మేరకు ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.

10. ఇద్దరు ఉన్నా ఒకరికే ఛాన్స్‌..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 24న టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ జట్టుతో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హై వోల్టేజీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న జట్టును తన అంచనాతో భారత మాజీ క్రికెటర్ పార్థివ్‌ పటేల్‌ ఎంపిక చేశాడు. అయితే, తన అంచనా ప్రకారం.. భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరినే తుదిజట్టులోకి తీసుకునే అవకాశముందని పేర్కొన్నాడు. దాంతో పాటు ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో అదరగొట్టిన యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కి తను అంచనా వేసిన జట్టులో చోటు కల్పించకపోవడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని