Top Ten News @ 9AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 24/10/2021 08:56 IST

Top Ten News @ 9AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఎడారిలో విరబూసిన తంగేడు పూలు

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా సౌధం తెరపై బతుకమ్మ ఆవిష్కృతమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం రాత్రి పూలపండగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 9.40 గంటలకు, మళ్లీ 10.40 గంటలకు రెండు దఫాలుగా 3నిమిషాల నిడివి గల వీడియోను బుర్జ్‌ ఖలీఫా తెరపై ప్రదర్శించగా... ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

2. సైన్యానికి సహకారి

ఎవరినైనా తిట్టాలంటే గాడిదా అంటాం. తెలివితక్కువ వారనో, పనికిరాని వారనో భావన వచ్చేలా తిట్టడానికీ గాడిదా అనే నిందిస్తాం. కానీ ‘గాడిదల వల్ల ఎంతో ఉపయోగం ఉంది. అవి ఎంతో తెలివైనవి... ఓర్పు కలిగిన జీవుల’ని అంటోంది భారత సైన్యం. దేశ రక్షణ విధుల్లో కంచర గాడిదల సహకారంతో సైన్యం ఎన్నో సమస్యలను అధిగమిస్తోంది. పోషణ, శిక్షణ, చివరికి చనిపోయాక సైనిక లాంఛనాలతో వీడ్కోలు పలికే వరకూ వీటికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. సైనికుల మాదిరే పతకాలు ప్రదానం చేస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

3. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత

రెండేళ్ల సర్వీసు పూర్తవడంతో ప్రొబేషన్‌ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. బయోమెట్రిక్‌ హాజరు లేదని అక్టోబరు జీతంలో కొందరికి 10%, మరికొందరికి 50% వరకు తగ్గించారు. ఈ మేరకు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 వరకు హాజరుకు సంబంధించిన డాటా జిల్లాలకు చేరింది.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

4. ప్రజల్లో ఉన్నాం.. ప్రగతి చూపిస్తాం

హుజూరాబాద్‌... ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాను గెలిస్తే పేద ప్రజలు గెలిచినట్టేనని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ అంటుండగా హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవ బావుటాను ఎగురవేస్తానని భాజపా అభ్యర్థి ఈటల విశ్వాసం ప్రకటించారు. తాను విజయం సాధిస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భయంపుట్టి హామీలు అమలు చేస్తాయని కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ అన్నారు. ‘ఈనాడు’ ముఖాముఖిలో వారు తమ మనోగతాలను ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

5. ఈ రాజకీయాలతో ప్రజలు నష్టపోతున్నారు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలు ఆందోళనకరమని లోక్‌సత్తా, ప్రజాస్వామ్య పీఠం (ఎఫ్‌డీఆర్‌) వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్‌ నారాయణ్‌ పేర్కొన్నారు. పార్టీల మధ్య ఈ తరహా రాజకీయం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. ఈ రాజకీయవేడి చల్లార్చేందుకు చొరవ చూపాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, పౌరసమాజం, మీడియా సంస్థలకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

6. పోలవరానికి మరో కోత!

 పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇప్పటికే ఇచ్చిన నిధుల్లోనూ కేంద్రం కోత పెడుతోంది. విద్యుత్కేంద్రం తవ్వకం పనులకు గతంలో ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం తెలిపినట్లు సమాచారం. పోలవరం దగ్గర 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం పనులు సాగుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.4,560.91 కోట్లను డీపీఆర్‌ నుంచి ఇప్పటికే మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రమూ అడగడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

7. గుర్రపు స్వారీ మొదలైంది అక్కడి నుంచే

గుర్రంపై ఠీవిగా స్వారీ ఎవరికి ఆసక్తి ఉండదు? మేలు జాతి అశ్వాలపై కూర్చొని.. వాటిని వేగంగా దౌడు తీయిస్తుంటే ఆ రాజసమే వేరు. శతాబ్దాల పాటు మానవాళికి రవాణా సాధనాలుగా అశ్వాలు సేవలు అందించాయి. ఎందరో రాజులు, చక్రవర్తులు వీటిని అధిరోహించి కదనరంగంలో కౌశలాన్ని ప్రదర్శించారు. అశ్వాలు మానవులకు ఎప్పుడు మచ్చిక అయ్యాయన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై 162 మంది శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం పరిశోధన సాగించింది. మనిషికి నేస్తంగా మారిన ఆధునిక గుర్రం మూలాలు రష్యాలో ఉన్నాయని తేల్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

8. ఆందోళనే.. అయినా ఆదరణే

మేలో ఈ ఊహాజనిత కరెన్సీ విలువ ఒక్కసారిగా కుప్పకూలి 30000 డాలర్లకు పతనమైంది. మళ్లీ జూన్‌ నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చినా.. అక్టోబరులో దూకుడు అధికమైంది. తాజాగా బిట్‌కాయిన్‌ ఆధారిత ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదుకావడంతో.. గత గరిష్ఠమైన 64895 డాలర్ల విలువను బిట్‌కాయిన్‌ అధిగమించింది. 66000 డాలర్ల మైలురాయిని అందుకోవడమే కాకుండా కొత్త జీవనకాల గరిష్ఠమైన 66,975 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

9. సప్త వసంతాల షివంగి

మహిళలపై వేధింపుల నియంత్రణలో ప్రత్యేకత చాటుతున్న ‘షీ’ బృందాలు ఏడేళ్లు పూర్తి చేసుకున్నాయి. వీటిని 2014 అక్టోబరు 24న ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 331 ఉన్నాయి. షీ బృందాల గురించి 30,427 సదస్సుల ద్వారా 30,51,323 మందికి అవగాహన కల్పించినట్లు తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా శనివారం వెల్లడించారు. ఏడేళ్లలో 35,699 ఫిర్యాదులను పరిష్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

10. అనాథల ‘పుణ్యక్షేత్రం’..!

ఒంటి మీద స్పృహ ఉండదు. ఆకలిదప్పులూ అర్థం కావు. స్థిమితం లేని మనసో... సత్తువ లేని శరీరమో... వారిని చేతకానివారిని చేసి రోడ్డున పడేస్తే చెత్తకుప్పల దగ్గర దొరికిందే తింటూ చీకిపోయిన దుస్తుల్లో తిరిగే ఆ అభాగ్యులను చీదరించుకుంటుంది సమాజం. కానీ ఒకప్పుడు వారూ ఏ ఇంట్లోనో కలల పంటలే అయ్యుంటారు... అమ్మఒడిలో ఆడుకునే ఉంటారు. నాన్న చేయి పట్టుకుని నడిచే ఉంటారు. విధి వక్రించి నేడు వీధిపాలైన ఆ అమాయక ప్రాణుల్ని ఆదరించి అక్కున చేర్చుకుంటోంది ఓ అనాథాశ్రమం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఉన్న ఈ ఆశ్రమాన్ని నెలకొల్పింది శంకర్‌ అయితే, అతనికి అన్నివిధాలా అండగా నిలుస్తున్నారు ఎందరో మనసున్న మంచి మనుషులు! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని