Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 20/10/2021 20:59 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. గంజాయిపై యుద్ధం ప్రకటించాలి: సీఎం కేసీఆర్‌

తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... గంజాయిపై తీవ్ర యుద్ధం ప్రకటించాల్సిన అవసరముందన్నారు.

2. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి‌: లోకేశ్‌

రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి మాఫియా పెరిగిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.  దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ పట్టుకున్నా రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘దాడులు చేసినంత మాత్రాన మేం భయపడం. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

3. ఈ-ఓట్‌ ప్రయోగం సక్సెస్‌.. స్మార్ట్‌ఫోన్‌తో ఇంటి నుంచే ఓటు

దేశంలోనే మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఇంటినుంచే ఓటు వేసే ఈ-ఓట్‌ విధానాన్ని తెలంగాణలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), రాష్ట్ర ఐటీ శాఖ లోని ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ విభాగం రూపొందించిన ఈ-ఓట్‌ విధానంలో ఇవాళ ఖమ్మంలో ప్రయోగాత్మకంగా పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు యాప్‌ ద్వారా ఓటింగ్‌ నిర్వహించారు.

4. తెదేపాకు పోటీగా... వైకాపా జనాగ్రహ దీక్షలు

తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా ‘‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’’ పేరుతో తెదేపా అధినేత చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టనున్నారు. రేపు ఉదయం నుంచి 36 గంటల పాటు దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు. చంద్రబాబు దీక్షకు పోటీగా వైకాపా కూడా నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. తెదేపా నేతల అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్టు  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

రాహుల్‌తో జట్టుకట్టిన చంద్రబాబు.. అమిత్ షాను ఎలా కలుస్తారు: కొడాలి

5. నన్ను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. లఖ్‌నవూ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్‌ప్లాజా వద్ద ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు ఆగ్రా వెళ్లేందుకు అనుమతిలేదని తెలిపారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.

6. విమానయాన రంగం కొత్తపుంతలు: ‘జపాన్‌’ మిస్టరీ డెస్టినేషన్‌!

కరోనా.. లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు అన్ని సేవలు మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలను నిషేధించడంతో విమానయానరంగం కూడా కుంటుపడింది. జపాన్‌లోనూ అదే పరిస్థితి. ఇటీవల తిరిగి విమాన సేవలకు అనుమతులు రావడంతో అక్కడి ప్రజలు విహారయాత్రలకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారట. దీంతో విమానయానరంగానికి, పర్యటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అక్కడి పీచ్‌ ఏవియేషన్‌ సంస్థ.. ‘మిస్టరీ డెస్టినేషన్‌’ పేరుతో వినూత్న ప్రయత్నం చేస్తోంది. 

7. జీతమిస్తాం.. వారం రోజులు ఆఫీసులకు రావొద్దు: పుతిన్‌

కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం కొనసాగిస్తున్న వేళ రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక ఆదేశాలు జారీచేశారు. దేశంలో పగ్గాల్లేకుండా వ్యాప్తి చెందుతున్న వైరస్‌ కట్టడికి వారం రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలన్న కేబినెట్‌ ప్రతిపాదనను సమర్థించారు.  గత కొన్ని వారాలుగా భారీగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులు, మరణాలతో రష్యా విలవిలలాడుతోన్న విషయం తెలిసిందే.

8. జియో ఫోన్ వివరాలు లీక్‌.. ఈ సారి గూగుల్ నుంచి!

తక్కువ ధరలో.. ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో జియో టెలికాం సంస్థ గూగుల్‌తో కలిసి కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘జియోఫోన్‌ నెక్ట్స్‌’ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో వినాయకచవితి సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తారని భావించినప్పటికీ వివిధ కారణాలతో విడుదల వాయిదా పడింది. దీంతో ఈ ఫోన్‌ను దీపావళికి మార్కెట్లోకి తీసుకొస్తామని సంస్థ వెల్లడించింది.

9. ఫేస్‌బుక్‌కు షాక్‌.. రూ.515 కోట్ల జరిమానా! 

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ కాంపీటీషన్‌ రెగ్యులేటర్‌ భారీ జరిమానా విధించింది. తాము అడిగిన వివరాలు సమర్పించడంలో ఫేస్‌బుక్‌ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, అందుకే రూ.515 కోట్ల (50.5 మిలియన్‌ పౌండ్లు) జరిమానాగా చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపింది. ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్న హెచ్చరిక పంపించాలన్న విధానాల మేరకు ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.

10. వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

దుబాయ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఒకే వికెట్ కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (60*) అర్ధశతకంతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్టన్ అగర్‌ ఒక వికెట్‌ తీశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని