Top Ten News @ 9AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 26/10/2021 09:03 IST

Top Ten News @ 9AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మేం వచ్చాకే ఆరోగ్య రంగానికి చికిత్స

అత్యంత కీలకమైన ఆరోగ్య రంగాన్ని మునుపటి ప్రభుత్వాలు విస్మరించి, దానినొక ఆదాయ వనరుగా భావించి అవినీతికి పాల్పడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అన్ని కర్మలకూ మూలం ఆరోగ్యమేననీ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చేసే పెట్టుబడులు ఎల్లప్పుడూ ఉత్తమమైనవిగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలాకాలం పాటు ఆరోగ్య రంగంలో చేయాల్సినంత చేయలేదని విమర్శించారు. రూ.64,000 కోట్లతో దేశవ్యాప్తంగా చేపట్టే ‘ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌’ను, రూ.5,200 కోట్లతో తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని సోమవారం ఆయన ప్రారంభించారు.

2. తలెత్తుకునేలా చేశాం

‘అవహేళనలు, అగమ్యగోచరమైన పరిస్థితుల మధ్య సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏడేళ్లలో అద్భుత ప్రగతిని సొంతం చేసుకుంది. అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. తెలంగాణను తలెత్తుకునేలా చేసిన పార్టీ తెరాస. సమాజంలో చిరునవ్వే మా లక్ష్యం’ అని ముఖ్య మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడితే ఎన్నో అనర్థాలు జరిగిపోతాయన్న అపోహలను అభివృద్ధితో పటాపంచలు చేశామని చెప్పారు. దేశ, విదేశాల్లో మన ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నామన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ మతమని.. సమస్యల పరిష్కారమే అభిమతమని స్పష్టం చేశారు.

ఉద్యమకారుడు సీఎం కావడంతోనే ఈ అభివృద్ధి

3. ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా రాజ్యం

ఆంధ్రప్రదేశ్‌ మాఫియా రాజ్యంగా మారిపోయిందని.. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్‌ పట్టుకున్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను చెప్పే పరిస్థితి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. లేసుల ఎగుమతులకు ప్రసిద్ధి పొందిన నర్సాపురం నుంచి ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలు పంపించే పరిస్థితి తలెత్తిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిందును కలిసిన అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు.

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల సాయం

4. ‘ఫేస్‌బుక్క’వుతోంది!

ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఫేస్‌బుక్‌’ తాజాగా తీవ్ర ఇరకాటంలో పడింది! లాభార్జనకే ప్రాధాన్యమిస్తూ, ప్రజా ప్రయోజనాలను ఆ కంపెనీ పణంగా పెడుతోందని సంస్థ మాజీ ఉద్యోగి ఒకరు ఆరోపించారు. చిన్నారులు, సమాజంపై తమ వేదిక చూపే ప్రతికూల ప్రభావాలు బయటకు తెలియకుండా దాచిపెడుతోందని విమర్శించారు. విద్వేష ప్రచారాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోందనీ పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థ అంతర్గత పరిశోధనలకు సంబంధించిన కీలక పత్రాలను బయటపెట్టారు. ‘ఫేస్‌బుక్‌ పత్రాలు’ పేరిట వెలుగుచూసిన ఈ పేపర్లు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

5. వచ్చేస్తోంది.. మెటావర్స్‌ ప్రపంచం

మనిషి పనిని సులభతరం చేసేది సాంకేతికత. కొత్త ఆవిష్కరణలతో మానవుడు ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతలను రూపొందిస్తూనే ఉన్నాడు. అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ వంటి సాధనాలు..విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. ఇప్పుడు వీటికి మించిన సాంకేతికత రానుంది. అదే ‘మెటావర్స్‌’. ఇంటర్నెట్‌ తర్వాత దీన్ని అతి పెద్ద మార్పుగా పేర్కొంటున్నారు. మనుషులను పూర్తిగా వర్చువల్‌ ప్రపంచంలో ఓలలాడించే ఈ సాంకేతికత.. ఆన్‌లైన్‌ అనుభూతిని సమూలంగా మార్చేస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫేస్‌బుక్‌ సహా ప్రముఖ సంస్థలు.. ఈ సరికొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టాయి. 

6. మేల్కోకపోతే కష్టమే

టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో.. గత రికార్డు నేపథ్యంలో దాయాదిపై తిరుగుండదు.. భారీ విజయంతో టీమ్‌ఇండియా టోర్నీని ప్రారంభించడం ఖాయమేనంటూ ఏర్పడ్డ అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. గెలవాలన్న కసి.. పక్కా ప్రణాళికతో మైదానంలో అడుగుపెట్టిన ప్రత్యర్థి.. భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. టీ20, వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి తన చేతిలో టీమ్‌ఇండియాకు ఓటమి రుచి చూపించింది. ఈ ఓటమి దేశవ్యాప్తంగా అభిమానుల ఆవేదనకు కారణమవడమే కాకుండా.. ఇప్పుడీ టోర్నీలో భారత ప్రయాణాన్ని కఠినంగా మార్చింది. పాక్‌తో ఓటమి బాధను పక్కకుపెట్టి.. వైఫల్యాలపై దృష్టి సారించి.. ఇప్పటికైనా మేల్కొని రాబోయే మ్యాచ్‌ల్లో జట్టు సత్తాచాటాలి. లేదంటే మరోసారి కప్పు అందని ద్రాక్షే అవుతుంది.

అఫ్గానిస్థాన్‌ అదరహో..

7. ఇది సూపర్‌మార్ట్‌!

వాళ్ల వ్యాపార నిర్వహణ కార్పొరేట్‌ సంస్థలనే అబ్బురపరిచింది... ప్రభుత్వాన్నీ కదిలించింది. ఎనిమిదివేలమంది మహిళలు ఒక్కతాటిపైకొచ్చి, పొదుపు సొమ్ముతో ఏర్పాటు చేసిన ఈ మహిళా మార్ట్‌ సాధించిన విజయం స్ఫూర్తిదాయకం. నెలకి పదిహేడులక్షల రూపాయలకు పైగా వ్యాపారం చేస్తున్న కడప జిల్లా పులివెందుల మహిళల విజయగాథ ఇది.

8. ఎయిడెడ్‌ విలీనంపై భగ్గుమన్న తల్లిదండ్రులు

ఎయిడెడ్‌ పాఠశాలల రద్దుకు నిరసనగా రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదిస్తూ దాదాపు ఆరుగంటలపాటు ఆందోళన చేశారు. నాణ్యమైన విద్యను అందించకుండా అమ్మఒడి, ఉచిత పుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు ఎందుకని వారు నిలదీశారు. తల్లిదండ్రుల ఆందోళనతో ట్రాఫిక్‌ పెద్దఎత్తున నిలిచిపోయింది. కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. అమ్మఒడి వద్దు.. మా బడి ముద్దు అంటూ ఒక బాలుడు చేసిన నినాదాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

9. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి..

‘‘రొమాంటిక్‌’ భావోద్వేగభరితంగా ఉంటుంది. ఆ ఎమోషన్‌కు ప్రేక్షకులు తప్పక కనెక్ట్‌  అవుతార’’న్నారు సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌. ఇప్పుడాయన స్వరాలందించిన చిత్రం ‘రొమాంటిక్‌’. ఆకాష్‌ పూరి, కేతిక శర్మ జంటగా నటించారు. అనిల్‌ పాదూరి దర్శకుడు. పూరి జగన్నాథ్‌, ఛార్మినిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారుసునీల్‌  కశ్యప్‌.

10. కాలేయం కొవ్వెక్కితే..

మనం కాలేయం గురించి పెద్దగా పట్టించుకోం గానీ ఇది మనకోసం ఎంత కష్ట పడుతుందో. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యతో (ఫ్యాటీ లివర్‌) బాధపడుతుండటమే దీనికి నిదర్శనం. నిజానికి కాలేయం మహా మొండిది. దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికే ప్రయత్నిస్తుంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని