Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 17/06/2021 16:57 IST

Top Ten News @ 5 PM

1. దేవరయాంజల్‌ భూములపై హైకోర్టు కీలక నిర్ణయం

దేవరయాంజల్‌ భూముల సర్వేపై ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 1014 అమలు నిలిపివేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆలయ భూముల గుర్తింపునకు విచారణ చేస్తే ఇబ్బందేంటి? ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా?అని పిటిషనర్‌ సదాకేశవరెడ్డిని న్యాయస్థానం ప్రశ్నించింది. కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోనీయాలా?అని ఘాటుగా వ్యాఖ్యానించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యత అని తెలిపింది. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి వస్తున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేవరయాంజల్‌ భూములపై విచారణ జరిపే స్వేచ్ఛ కమిటీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

2.  మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు

ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారదర్శకతతో ముందుకెళ్తున్నామన్నారు. అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాన్సాస్‌ ట్రస్టు సిబ్బందికి జీతాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కార్యాలయాన్ని విజయనగరం నుంచి ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఆడిట్‌ జరగలేదని తెలిసి ఆశ్చర్యపోయాను, ఆడిట్‌ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు.

3. తెదేపా నేతల హత్యలో ఎమ్మెల్యే హస్తం: చంద్రబాబు

కర్నూలు జిల్లా పెసరవాయిలో తెదేపా నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి హత్యల వెనుక వైకాపాకు చెందిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి హస్తం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. వైకాపా నేతలు, పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో పట్టపగలే తెదేపా నేతలు, కార్యకర్తలను హతమారుస్తున్నారు. పోలీసు వ్యవస్థ పనిచేస్తోందో లేదో అనే అనుమానం కలుగుతోంది. బంధువు చిన్నదినం కార్యక్రమం కోసం శ్మశానానికి వెళ్లి వస్తున్న నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిలను ప్రత్యర్థి వర్గం కారుతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసింది.’’

4. ‘ఆడుకోవాలని ఉంది.. మమ్మల్ని ఆదుకోండి!’

బడికి వెళ్లలేకపోయినా.. ఆ సోదరులు ఆంగ్లంలో అదరగొడతారు. తమ తెలివితేటలతో అబ్బురపరుస్తారు. పెరిగి పెద్దయ్యాక దునియానే దున్నేస్తామనేంత ఉత్సాహం ప్రదర్శిస్తారు. అలాంటి వారిని ఉన్నచోటు నుంచి కదల్లేని స్థితిలోకి నెట్టింది ఓ వింత వ్యాధి. దేశంలో మందుల్లేవ్.. విదేశాల నుంచి తెప్పించుకునేందుకు డబ్బుల్లేవ్. పిల్లలను ఎలాగైనా కాపాడుకోవాలని పరితపిస్తున్న ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. బొద్దుగా, అల్లారు ముద్దుగా ఉన్న ఈ చిన్నారులు ప్రకాశం జిల్లా ఒంగోలులోని గద్దలకుంటకు చెందిన వినయ్ కుమార్, వేదవతి దంపతుల కుమారులు. ఇద్దరూ స్పైనల్ మస్క్యూలర్ ఎట్రోపీ వ్యాధితో బాధపడుతున్నారు.

5. Biological E: టీకాకు 90శాతం సమర్థత..?

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ అభివృద్ధి చేస్తోన్న టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొవాగ్జిన్‌ టీకా మహమ్మారిని నిరోధించడంలో మెరుగైన పనితీరు కనబరుస్తుండగా, తాజాగా మరో దేశీయ టీకా కూడా అత్యంత ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న బయోలాజికల్‌ ఇ (BE) తయారు చేస్తోన్న కార్బివాక్స్‌ (Corbevax) టీకా ప్రయోగాల్లో దాదాపు 90శాతానికిపైగా ప్రభావశీలత చూపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

6.  అంబానీకి బెదిరింపుల కేసులో సచిన్‌ వాజే గురువు‌..!

ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద బాంబు బెదిరింపుల కేసులో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ముంబయికి చెందిన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు సచిన్‌ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకొంది. తాజాగా సచిన్‌ వాజేకు తొలినాళ్లలో గురువుగా వ్యవహరించిన ప్రదీప్‌ శర్మ హస్తం కూడా ఈ కేసులో ఉన్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. దీంతో గురువారం తెల్లవారుజామున ఆయన నివాసంపై దాడులు నిర్వహించింది. ఉదయం 5 గంటలకు ఎన్‌ఐఏ, సీఆర్‌పీఎఫ్‌ దళాలు అంధేరీలోని అతని ఇంటి వద్దకు చేరుకొన్నాయి. దాదాపు 6 గంటల పాటు తనిఖీలు నిర్వహించాయి. అనంతరం ప్రదీప్‌ శర్మను ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. 

7. Stock market: నష్టాల్లో సూచీలు..

దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లు పెంచుతుందన్న సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. దేశీయ మార్కెట్లపైనా దాని ప్రభావం ఉండడంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 15,700 దిగువన ముగిసింది. ఉదయం 52,231 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా అదే ఒరవడిని కొనసాగించింది. చివరికి 178.65 పాయింట్ల నష్టంతో 52,323.33 వద్ద స్థిరపడింది. 

8.Google:భారత్‌కు 113 కోట్ల సాయం ప్రకటించిన గూగుల్

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌కు రూ. 113 కోట్ల కరోనా సాయాన్ని అందించనుంది. ఈ మేరకు గురువారం గూగుల్‌ ఒక సమావేశంలో తెలిపింది. భారత్‌లో 80 ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పడంతో పాటు వివిధ సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా గివ్‌ ఇండియా సంస్థకు 90 కోట్ల రూపాయలు, 18.5 కోట్ల రూపాయలను పాత్‌ సంస్థకు అందించనుంది. అంతేకాకుండా కొవిడ్‌ 19 కోసం గ్రామీణ ప్రాంతాల్లోని 20వేల మందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్న అపోలో మెడ్‌స్కిల్స్‌కు ఆర్థిక సహకారాన్ని అందించనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.

9. అంగన్‌వాడీ ఉద్యోగులను తొలగించం: జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో నూతన విద్యా విధానం అమలుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ, నూతన విద్యా విధానం, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై సీఎం సమీక్షించారు. రెండేళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులు, ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు మేలు జరుగుతుంతని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.  పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని.. ఒక్క కేంద్రాన్ని కూడా మూసివేయడం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

10. ఆ గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్‌

దేశంలో కరోనా టీకాలకు తీవ్ర కొరత ఏర్పడిన కారణంగా చాలా మంది వ్యాక్సిన్‌కు దూరమవుతున్నారు. మరోవైపు వీలైనంత తొందరగా 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ చాలా మందికి వ్యాక్సిన్‌ అందడం లేదు. కానీ, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా మేఘవాన్ పరియత్‌ గ్రామంలో మాత్రం అర్హులైన వారందరికీ తొలిడోసు వ్యాక్సిన్ పూర్తయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో మొత్తం 1,002 ఓటర్లు ఉన్నారు. వీరిలో 956 మంది తొలి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వీరిలో ఇద్దరు శతాధిక వృద్ధులు కూడా ఉన్నారు.  మిగతా 46 మందిలో తాజాగా కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వీరంతా వైద్యుల సూచనల మేరకు వ్యాక్సిన్‌ వేయించుకోలేదు.

నా మొదటి పారితోషికం రూ.500: విద్యా బాలన్‌
Mahesh Babu: గౌత‌మ్ స్విమ్మింగ్‌ రికార్డు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని