Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 21/06/2021 16:55 IST

Top Ten News @ 5 PM

1. TS news: చైనా టెక్నాలజీ తెలంగాణలోనూ రావాలి
వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ జిల్లాలకు హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మార్చనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. జిల్లాల కొత్తపేర్లపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయన్నారు. హన్మకొండలో రూ.57 కోట్లతో 3 అంతస్తుల్లో సమీకృత కలెక్టరేట్‌ సముదాయన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అన్ని హంగులు ఉన్న కలెక్టరేట్‌ నిర్మించినందుకు అభినందనలు తెలిపారు. 

2. పోతిరెడ్డిపాడు..లిఫ్ట్‌ పెడితే తప్పేంటి: అనిల్‌
కృష్ణానది నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ అక్రమ ప్రాజెక్టులు కడుతోందన్న తెలంగాణ ఆరోపణలను మంత్రి అనిల్‌కుమార్‌ కొట్టి పారేశారు. రాయలసీమలో కడుతున్న ప్రాజెక్టులన్నీ చట్టానికి లోబడినవేనని స్పష్టం చేశారు. తమకు కేటాయించిన నీటికి మించి చుక్క నీరుకూడా అదనంగా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. 6 టీఎంసీలకు పైగా సామర్థ్యమున్న పలు ప్రాజెక్టులను తెలంగాణ అనుమతి లేకుండా నిర్మిస్తోందన్నారు. 

3. తెలుగు రాష్ట్రాలకు బస్సులు..  కర్ణాటక రైట్‌ రైట్‌!
లాక్‌డౌన్‌తో నిలిపివేసిన అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను కర్ణాటక ప్రభుత్వం మళ్లీ ప్రారంభించనుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేసిన కేఎస్‌ఆర్టీసీ.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ఏపీ, తెలంగాణకు రేపట్నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో బస్సులు నడపనున్నట్టు కేఎస్‌ఆర్టీసీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌) ఓ ప్రకటనలో వెల్లడించారు.

4. MVA: మహారాష్ట్ర ప్రభుత్వ మనుగడ ఎన్నాళ్లు?
: మహారాష్ట్రలో ‘మహా వికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ)’ ప్రభుత్వ మనుగడపై రోజురోజుకీ కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కూటమి పక్షాల మధ్య ముసలం ప్రారంభమైందన్న వాదన ముంబయి వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే భాగస్వామ్య పక్షాలనుద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

5. Vaccine: టీకాలపై వదంతులతో పేదలకే హాని!
కరోనా వ్యాక్సిన్‌పై వదంతులు, అసత్య ప్రచారాల వల్ల సమాజంలో ఆర్థికంగా వెనుకబడిపోయిన ప్రజలకే తీవ్ర హాని కలుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై దుష్ర్పచారాలను తరిమికొడుతూ ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని పిలుపునిచ్చింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ ప్రారంభమైన సందర్భంగా.. వ్యాక్సిన్‌లపై కొందరు చేసే ఉద్దేశపూర్వక చెడు ప్రచారంపై కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి ప్రజలను అప్రమత్తం చేసింది.

6. Supreme Court: రూ.4లక్షల పరిహారంపై తీర్పు రిజర్వ్‌
కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, తీర్పును రిజర్వు చేసింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై నేడు రెండు గంటలపాటు విచారణ చేపట్టింది. మూడు రోజుల్లోగా ఇరు పార్టీల వాదనలను లిఖితపూర్వకంగా నివేదించాలని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం, కొవిడ్‌తో మరణించిన వారి మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరును సులభతరం చేయాలని కేంద్రానికి సూచించింది.

7. Vaccine: టీకా మిక్సింగ్‌తో వేరియంట్లకు చెక్‌?
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో నూతన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రెండు వేర్వేరు కరోనా టీకాలను ఇవ్వడం(వ్యాక్సిన్‌ మిక్సింగ్‌) ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తితో పాటు కొత్త రకాల నుంచి రక్షనిచ్చే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ స్పందించారు.
8.
ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి: లోకేశ్‌
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు జాబ్‌ రెడ్డిగా.. ఆ తర్వాత డాబు రెడ్డిగా మారారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఇటీవల జగన్‌ విడుదల చేసింది జాబ్‌ క్యాలెండర్‌ కాదని.. డాబు క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

9. Stock market: భారీ నష్టాల నుంచి లాభాల్లోకి
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరకు లాభాల్లో ముగియడం విశేషం. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ ఓ దశలో ఏకంగా 889 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఉదయం 51,887 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 51,740 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 230 పాయింట్ల లాభంతో 52,574 వద్ద ముగిసింది. 

10. WTC Final: ఆట ఆలస్యం.. వరుణుడి జోరు
అనుకున్నదే జరిగింది! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నాలుగో రోజు ఆట ఇంకా మొదలవ్వలేదు. వేకువజాము నుంచి సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు కాస్త తగ్గినట్టు అనిపించినా జల్లులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మైదానంలో పిచ్‌పై కప్పిన కవర్లపై నీరు నిలిచింది. ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. అక్కడక్కడా వరద నీరు చేరింది.వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఆటగాళ్లు తమ వ్యాపకాల్లో మునిగిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని