Top Ten News @ 9 PM 
close

తాజా వార్తలు

Published : 17/06/2021 20:56 IST

Top Ten News @ 9 PM 

1. ఆత్మనిర్భర్‌ భారత్‌ ఎక్కడ?: కేటీఆర్‌

ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీని పునర్‌ నిర్వచించి కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాలకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వీలైనంత ఎక్కువ చేయూత అందించేలా చూడాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ రాశారు. ‘‘కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి రూ.20లక్షల కోట్లతో ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికి ఏడాదిపైగా కావస్తోంది. అయితే, తెలంగాణలోని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నా’’ అని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

Ts News: కొత్తగా 1,492 కరోనా కేసులు
ap news: కొత్తగా 6,151 కేసులు

2. డెల్టా వేరియంట్‌కు స్పుత్నిక్‌ బూస్టర్‌ డోస్‌

వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కరోనా బూస్టర్‌ డోసును సిద్ధం చేస్తున్నట్లు స్పుత్నిక్‌-వి టీకాను తయారుచేసిన గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. ఈ బూస్టర్‌ డోసును ఇతర వ్యాక్సిన్‌ తయారీదారులకు అందజేయనున్నట్లు పేర్కొంది. డెల్టా వేరియంట్‌పై ఇది సమర్థంగా పనిచేస్తుందని తెలిపింది. అయితే, ఏయే వ్యాక్సిన్‌ తయారీదారులకు ఈ బూస్టర్‌ డోసు అందజేసేదీ వివరాలు వెల్లడించలేదు. కరోనా డెల్టా వేరియంట్‌ (B.1.617.2) తొలుత భారత్‌లో గుర్తించారు. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే వేగంగా విస్తరిస్తుండడం పట్ల ప్రపంచవ్యాప్తంగా  పలు దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. 

3. వేధిస్తే సహించేది లేదు: ఈటల

తన మద్దతుదారులను వేధిస్తున్నారని.. అలా చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. ప్రజలు కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతారని అన్నారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవం ఉందా? అని నిలదీశారు. 2024 ఎన్నికలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఒక రిహార్సల్‌ లాంటిదన్నారు. ఆత్మగౌరవ పోరాటానికి హుజూరాబాద్‌ వేదిక అయిందని.. రేపటి నుంచి ఇంటింటికీ వెళ్తానని ఈటల స్పష్టం చేశారు.

4. వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. గడువు పొడిగింపు

కొవిడ్‌ వేళ వాహనదారులకు కేంద్రం ఊరట కల్పించే కబురు చెప్పింది. మోటార్‌ వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌), రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), ఇతర పర్మిట్లకు సంబంధించిన పత్రాల గడువును ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన పత్రాలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

5. Novavax: జులైలో పిల్లలపై ‘సీరమ్‌’ ట్రయల్స్‌?

నోవావాక్స్‌ టీకాను పిల్లలపై ప్రయోగించేందుకు పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రయత్నాలు చేస్తోంది. జులైలో క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కరోనా నివారణలో తమ టీకా 90.4శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్లనూ అడ్డుకోగలదని అమెరికాకు చెందిన నోవావాక్స్‌ కంపెనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న ‘సీరమ్‌’ సెప్టెంబర్‌ కల్లా భారత్‌లో ఈ టీకాను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

6. ఏడు మామిడిపళ్లకు నలుగురు కాపలాదారులు

అనగనగా రెండు మామిడి చెట్లు. వాటికి కాసిన ఏడు మామిడి పండ్లు. చుట్టూ ఆరు శునకాలు. నలుగురు కాపలాదార్లు. ఇవేం లెక్కలు అనుకుంటున్నారా? ఇది తెలియాలంటే మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ వెళ్లాల్సిందే. జబల్‌పూర్‌లోని రాణి, సంకల్ప్‌ పరిహార్‌ దంపతుల కష్టాలు అన్నీ ఇన్నీకాదు. సాధారణంగా పండ్ల తోటల్లోకి ఇతరులు ప్రవేశించకుండా కంచె వేస్తుంటారు. అవసరమైతే ఒకరో, ఇద్దరో కాపలా ఉంటారు. కానీ పరిహార్‌ దంపతులు మాత్రం తమ తోటలోని రెండు మామిడి చెట్లకు నలుగురు వ్యక్తులను, ఆరు శునకాలను కాపలాగా ఉంచారు. ఎందుకంటే అవి మామూలు మామిడి చెట్లు కాదు.

7. Mamata Banerjee: మాకు కూడా ట్విటర్ పరిస్థితే..

సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ను ధ్వంసం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. తన ప్రభుత్వానికి కూడా కేంద్రం నుంచి అదే పరిస్థితి ఎదురవుతోందని మండిపడ్డారు. ‘నేను దీన్ని ఖండిస్తున్నాను. వారు ట్విటర్‌ను అదుపు చేయలేరు. అందుకే దాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. వారు కట్టడి చేయలేని ప్రతి ఒక్కరితో ఇలాగే ప్రవర్తిస్తారు. వారు నన్ను నియంత్రించలేరు. అందుకే నా ప్రభుత్వాన్ని కూడా ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు’ అని మమత మీడియా చెంత కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 

8. Space Station: నింగిలోకి చైనా వ్యోమగాములు!

అంతరిక్షంలో సొంత స్పేస్‌ స్టేషన్‌ నిర్మించాలని పట్టుదలతో ఉన్న చైనా, తాజాగా మరో ముందడుగు వేసింది. ఇందుకోసం ముగ్గురు వ్యోమగాములతో కూడిన లాంగ్‌మార్చ్-2F రాకెట్ గురువారం నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు చైనా జరిపిన అంతరిక్ష ప్రయోగాల్లో ఇదే అత్యంత కీలకమైనది కావడంతో, తాజా ప్రయోగం విజయవంతమవడం పట్ల డ్రాగన్‌ దేశం ఆనందం వ్యక్తం చేస్తోంది.

9.Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర!

బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త! గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న పసిడి ధర గురువారం భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని నగరం దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.861లు తగ్గడంతో రూ.46,863కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.47,742గా ముగిసింది. ప్రపంచ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ తగ్గుదల కనిపించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.1709లు తగ్గడంతో 68,798గా ట్రేడ్‌ అవుతోంది.

10. WTC Final: టీమిండియా తుది జట్టు ఖరారు

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. సౌథాంప్టన్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ కాగా.. అజింక్యా రహానె వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆరుగురు బ్యాట్స్‌మెన్, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్‌ బరిలోకి దిగబోతోంది. స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా ఇద్దరూ బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉండటంతో మేనేజ్‌మెంట్‌ తుది జట్టులో వారికి చోటు కల్పించింది.

పీవీ సింధు అకాడమీకి భూమి కేటాయింపు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని