Top Ten News @ 9 AM

తాజా వార్తలు

Published : 16/07/2021 08:56 IST

Top Ten News @ 9 AM

1. పెత్తనం బోర్డులదే

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా అన్నింటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయి. బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గురువారం రాత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబరు 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

2. 50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ

రాష్ట్రంలో మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ మొదలైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇకపై వార్షిక కేలండర్‌ ద్వారా కొత్త ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువతకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

3. ఎకరా రూ. 60 కోట్లు

హైదరాబాద్‌ నగరంలోని కోకాపేట భూములు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. అంచనాకు మించి భారీ ధర పలికాయి. గురువారం నిర్వహించిన ఈ-వేలానికి భారీ స్పందన వచ్చింది. కీలకమైన ప్రాంతం కావడంతో ప్లాట్లను దక్కించుకునేందుకు ప్రముఖ సంస్థలు పోటాపోటీగా ధర పెంచుకుంటూ పోయాయి. ముఖ్యంగా 1.65 ఎకరాల ప్లాట్‌కు తీవ్ర పోటీ నెలకొంది.

4. కృష్ణా జలాలు.. పోలవరం నిధులపై ప్రశ్నించాలి

కృష్ణా జలాల వివాదంపై కేంద్రం నుంచి స్పందన లేకపోవడం... పోలవరం నిధులను తిరిగి చెల్లించడంలో జాప్యం.. పునరావాసానికి కావల్సిన రూ.30వేల కోట్లలో ఇప్పటివరకూ పైసా ఇవ్వకపోవడం.. ఆహార భద్రతా చట్టంలో ఏపీకి జరిగిన అన్యాయం... తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు రూ.6,112 కోట్లు... ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు తదితర అంశాలపై సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో గురువారం జరిగిన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు.

5. రాజద్రోహ చట్టం ఇప్పటికీ అవసరమా?

స్వాతంత్య్రోద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషర్లు తీసుకొచ్చిన రాజద్రోహ చట్టం అవసరం ఇప్పటికీ ఉందా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. మహాత్మాగాంధీ, బాలగంగాధర్‌ తిలక్‌లాంటి వారిని మాట్లాడకుండా చేయడానికి బ్రిటిషర్లు 124-ఏ సెక్షన్‌ కింద రాజద్రోహం (సెడిషన్‌) కేసులు పెట్టారని గుర్తుచేశారు.

6. గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వేస్టేషన్‌తో పాటు మరో ఎనిమిది ప్రాజెక్టులను వీడియో ద్వారా ప్రారంభించనున్నారు. రూ.71.50 కోట్లతో అధికారులు దీన్ని ఆధునిక వసతులు, హంగులతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. విశాలమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటుచేశారు. 160 కార్లు, 40 ఆటోలు, 120 ద్విచక్ర వాహనాలను పార్కు చేసేందుకు వసతి కల్పించారు.

7. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు వ్యతిరేకంగా పనిచేస్తాం

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు వ్యతిరేక వాతావరణం సృష్టించేలా అన్నివిధాలుగా పని చేస్తామని రైతు నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ అన్నారు. పశ్చిమబెంగాల్‌ మాదిరిగానే ఇక్కడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా కృషి చేస్తామన్నారు. కొత్త సాగుచట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న రైతులకు నాయకత్వం వహిస్తున్న టికాయిత్‌ గురువారం పీలీభీత్‌లో విలేకరులతో మాట్లాడారు. 

8. ఇక డ్రోన్ల కోసం ప్రత్యేక నడవాలు

దేశంలో డ్రోన్ల వినియోగాన్ని మరింత సులభతరం చేసేలా కేంద్రం కొత్త విధానంతో ముందుకు వచ్చింది. అనుమతుల ప్రక్రియ నుంచి ఫీజుల వరకు భారీగా మార్పులు చేసింది. డ్రోన్లు తిరిగేందుకు ప్రత్యేక నడవా(కారిడార్‌)లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ.. డ్రోన్‌ నియమాలు-2021 పేరిట కొత్త ముసాయిదాను రూపొందించింది.

9. 88888 88888 కి ముకేశ్‌ డయల్‌ చేస్తున్నారా?

స్థానిక వ్యాపార సంస్థల ఫోన్‌ నెంబర్లు, ఇతర వివరాలు తెలిపే జస్డ్‌ డయల్‌ (88888 88888)ను సొంతం చేసుకునేందుకు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) చర్చలు జరుపుతోందని సమాచారం. వ్యవస్థాపక ప్రమోటర్ల నుంచి 800-900 మిలియన్‌ డాలర్ల (రూ.6,000-6,750 కోట్లు) మొత్తానికి కొనుగోలు చేయాలన్నది ఆర్‌ఐఎల్‌ ఆలోచన. 

10. కొత్తగా.. ఆశలొచ్చెనా..?

ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటివరకూ 28 పతకాలు గెలిస్తే అందులో ఒక్క క్రీడలోనే 11 పతకాలు వచ్చాయి. మొత్తం 9 స్వర్ణాల్లో ఎనిమిది ఈ ఆటలో దక్కినవే. ఆ ఆటే హాకీ. గతమెంతో ఘనం అన్నట్లు ఒలింపిక్స్‌ హాకీలో మన చరిత్ర చిరస్మరణీయం. ఈ ఆటలో ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో అత్యధిక విజయవంతమైన దేశం మనదే. ఇలా గతం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘనతలు. ఇప్పుడు పతకం సాధిస్తే గొప్ప అన్నట్టుగా మారిపోయింది. అయితే గత కొన్నేళ్లుగా మెరుగవుతున్న భారత హాకీ ఈసారి పతక ఆశలు పుట్టిస్తోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని