Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 20/06/2021 20:56 IST

Top Ten News @ 9 PM

1. భావోద్వేగానికి గురయ్యా: జస్టిస్‌ ఎన్వీ రమణ

తెలుగు ప్రజల రుణం తీర్చలేనిదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ భావోద్వేగానికి గురయ్యారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన .. మధుర జ్ఞాపకాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేశారు. భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో  తనను చూసి గర్వించటానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదని, అయితే, సీజేఐగా ఈ వారంరోజుల పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వలే అక్కున చేర్చుకుని ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు తెలిపారు. కొవిడ్‌కు సైతం వెరవక అసంఖ్యాకంగా వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ  పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు చెప్పారు.

2. KCR: నన్నే మాస్క్ తీయమన్నాడు.. నవ్వులే నవ్వులు

ప్రతి సభను, సమావేశాన్నీ తమదైన పంచ్‌లతో ఆద్యంతం రక్తికట్టించే అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకరు. కేసీఆర్‌ మాట్లాడటం మొదలు పెడితే మాటల ప్రవాహం ఆగదు. ఆయన విసిరే ఛలోక్తులకు నవ్వని వారు ఉండరు. ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మధ్య మధ్యలో తనదైన చమక్కులు విసిరారు. ప్రస్తుతం ఆయన మాటలు సామాజిక మాధ్యమాల్లో నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. ఒక పెళ్లికి వెళ్తే, తననే మాస్క్‌ తీయమన్నారంటూ కేసీఆర్‌ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ‘‘నేనో పెండ్లికి పోయిన. పెండ్లికి పోతే ఆ పెండ్లి పిల్లగాడు ‘సార్ మాస్క్ తీయ్’ అన్నడు. ‘ఎందుకయ్య’ అంటే ‘సార్ నువ్వు మళ్ల దొరుకతవో లేదో ఓ ఫొటో తీసుకుంటా’ అన్నడు.

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పర్యటన

3. రేపట్నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేతతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు  సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  సాయంత్రం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఈనేపథ్యంలో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. కర్ఫూ నిబంధనలకు అనుగుణంగా ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల లోపు ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా  ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. 

4. Vaccination: వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డు

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 9 లక్షల నుంచి 10 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులు వేయాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలో మాస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇవాళ ఒక్కరోజే 11.85 లక్షల మందికి టీకాలు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. ఒకే రోజు ఆరు లక్షల మందికి టీకా ఇచ్చిన గత రికార్డును రాష్ట్రం అధిగమించినట్లు వెల్లడించారు. వ్యాక్సిన్‌ సామర్థ్యానికి అనుగుణంగా వ్యాక్సిన్‌ డోసులను కేంద్రం అందించగలిగితే ఏపీకి ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 96 లక్షల మందికి మొదటి డోసు డోసు వేసినట్లు అనిల్‌ సింఘాల్‌ చెప్పారు. 

5. Delta Variant: యూకేని చూసి నేర్చుకోవచ్చు..!

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌కు కారణమైన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ (B.1.617.2) మరో సారి రూపంతరం చెందడంతో k417N మార్పు చోటు చేసుకొందని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. ఇది ఆందోళనకర వేరియంట్‌ అయ్యే ప్రమాదం ఉందన్నారు. డెల్టావేరియంట్‌ కారణంగా యూకేలో కేసులు పెరగటాన్ని చూసి భారత్‌ నేర్చుకోవాలన్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని హెచ్చరించారు. దేశలో అన్‌లాక్‌ చేసిన ప్రదేశాల్లో కొవిడ్‌ కేసుల పెరుగుదలను ఎప్పటికప్పుడు కనిపెట్టి చూసుకోవాలన్నారు. ‘‘డెల్టా వేరియంట్‌లో చిన్న చిన్నమార్పులతో డెల్టాప్లస్‌ వేరియంట్‌ తయారైంది. దీనిలో k417N అనే మ్యూటేషన్‌ చోటు చేసుకొంది. దీంతో ఇది వేగంగా సోకే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. దీనిని ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా పేర్కొంది. ఇప్పుడు కేసులు తక్కువగా ఉన్నాయి.

6. IT Rules: సామాన్య యూజర్ల సాధికారత కోసమే..!

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలపై ఐక్యరాజ్యసమితి లేవనెత్తిన ఆందోళనలపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాలను వినియోగించే సాధారణ యూజర్ల సాధికారత కోసమే నూతన నిబంధనలు రూపొందించామని స్పష్టం చేసింది. అంతేకాకుండా పౌర సమాజం, ఇతర భాగస్వామ్యపక్షాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నూతన ఐటీ నిబంధనలను రూపొందించామని వెల్లడించింది. ‘సామాజిక మాధ్యమాల్లో సామాన్య వినియోగదారుల సాధికారత కోసమే ఈ నియమాలు రూపొందించాం. వివిధ భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నూతన ఐటీ నిబంధనలు ఖరారు చేశాం. సోషల్‌ మీడియా దుర్వినియోగం కారణంగా బాధితులైన వారి వేదనను పరిష్కరించడానికి ఇదొక వేదిక అవుతుంది’ అని ఐరాసకు రాసిన లేఖలో భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

Kerala: శైలజా టీచర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు!

7. Congress:అధ్యక్షుడు కాకపోయినా రాహులే మన నేత

కాంగ్రెస్‌ పార్టీలో సంస్కరణలు కోరుతూ గతంలో అధిష్ఠానానికి లేఖ రాసి జి-23గా ముద్రపడ్డ సొంత పార్టీ వర్గంపై తాజాగా సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ మండిపడ్డారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని బహిరంగంగా డిమాండ్‌ చేయడాన్ని తప్పుబట్టారు. లేఖ రాసిన వారంతా ప్రస్తుతం వారున్న హోదాలకు ఎన్నికల వల్లే ఎదిగారా? అని ప్రశ్నించారు. సంస్కరణలు త్యాగాల వల్లే సాధ్యమని.. ఆకస్మికంగా ప్రశ్నించడం వల్ల కాదని హితవు పలికారు.‘కాంగ్రెస్ పార్టీకి పెద్దాపరేషన్‌ చేయాలి’అంటూ జి-23 వర్గంలోని నేత వీరప్ప మొయిలీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి స్పందనగానే ఖుర్షీద్‌ తాజా వ్యాఖ్యలు చేశారు. అద్భుతమైన వాక్యాలు పరిష్కారం చూపలేవని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లుగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు చర్చల ద్వారా ఓ పరిష్కారం చూపాలని హితవు పలికారు. 

8. UNLOCK: దిల్లీలో వీటిని తెరిచేందుకు అనుమతి

దేశ రాజధాని దిల్లీలో సెకండ్‌వేవ్‌ తీవ్రత దాదాపు తగ్గిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఇప్పటికే అనేక సడలింపులు ఇచ్చింది. సోమవారం నుంచి బార్లు, పబ్లిక్‌ పార్కులు, ఉద్యానవనాలను తెరిచేందుకు అనుమతి ఇస్తూ, దిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(డీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. 50శాతం సామర్థ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ బార్లు తెరిచి ఉంచవచ్చని తెలిపింది. కొవిడ్‌ నిబంధనలు సక్రమంగా అమలు చేసే బాధ్యత బార్ల యజమానులదే. ఇక పబ్లిక్‌ పార్కులు, ఉద్యానవనాలు, గోల్ఫ్‌ క్లబ్‌లు, ఆరు బయట యోగా కార్యక్రమాలకు కూడా డీడీఎంఏ అనుమతి ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, సినిమాలు, జిమ్‌లు, స్పాలలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదు.

9. Loans pay off: వేగంగా రుణాల‌ను తీర్చాలంటే...

కొవిడ్‌-19 ప్ర‌జ‌ల ఆరోగ్యాన్నే కాకుండా ఆర్థిక ప‌రిస్థితినీ దెబ్బ‌తీసింది. ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌లు విధించ‌డం, కొన్ని సంస్థలు వేత‌నాలు త‌గ్గించ‌డం, వ్యాపారాలు మూత‌ప‌డ‌డం లేదా స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో చాలామంది ఆదాయం త‌గ్గింది. దీంతో  గతంలో తీసుకున్న రుణాల‌ను ప్ర‌ణాళిక ప్ర‌కారం చెల్లించాల‌నుకున్న వారు కూడా స‌రైన స‌మ‌యానికి చెల్లించ‌లేక‌, ఆర్థికంగా ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఇలాంటి ఇబ్బందుల‌ను మీరూ ఎదుర్కుంటున్నారా? అయితే ఇటువంటి ప‌రిస్థితులలో రుణాల‌ను స‌రిగ్గా నిర్వ‌హించేందుకు ఒక ప్ర‌ణాళిక అవ‌స‌రం. దీని కోసం ముఖ్యంగా ఒత్తిడికి గురుకాకుండా మ‌నోధైర్యంతో ఉండాలి. నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం క‌ష్ట స‌మ‌యంలో రుణాల‌ను తెలివిగా మేనేజ్ చేయాలి. ఇందుకు రెండు స్ట్రాట‌జీలు ఉన్నాయి. మొద‌టిది చాలా మంది సాధార‌ణంగా అనుస‌రించే స్ట్రాట‌జీ. వ‌డ్డీ ఆధారంగా రుణాల‌ను రెండు భాగాలుగా విభ‌జించ‌డం. ఈ విధానంలో అధిక వ‌డ్డీ రుణాల‌ను ఒక కేట‌గిరికి, త‌క్కువ వ‌డ్డీ రుణాల‌ను మ‌రొక కేట‌గిరిలోకి తీసుకుంటారు.

10. WTC Final: కఠిన పరిస్థితుల్లో పోరాడిన భారత్‌ 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ప్రతికూల పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్‌ అయింది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(49; 117 బంతుల్లో 5x4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(44; 132 బంతుల్లో 1x4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మూడోరోజు ఆటను భారత్‌ 146/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ప్రారంభించగా మరో 71 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. మరో ఎండ్‌లో ఇతర పేసర్లు సైతం పదునైన బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వలేదు. దాంతో భారత్‌ చివరికి 217 పరుగులకు ఆలౌటైంది. జేమీసన్‌ 5/31, నీల్‌ వాగ్నర్‌ 2/40, బౌల్ట్‌ 2/47 మెరుగైన ప్రదర్శన చేశారు. ఆదివారం ఆట ప్రారంభమైన కాసేపటికే జేమీసన్‌.. కోహ్లీ, పంత్‌(4)ను స్వల్ప వ్యవధిలో ఔట్‌చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అనంతరం రహానె, జడేజా కాసేపు వికెట్లను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే, పరుగుల వేగం పెంచే క్రమంలో వైస్‌ కెప్టెన్‌ అర్ధశతకానికి ఒక్క పరుగు ముందు నీల్‌వాగ్నర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.

WTC Final: లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని