Top 10 News @ 1PM

తాజా వార్తలు

Updated : 26/04/2021 13:01 IST

Top 10 News @ 1PM

1. మే నెలలో.. ఒక్కరోజులో 10 లక్షల కేసులు!

దేశంలో కరోనా రెండో దశ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య మొత్తంగా 2 లక్షలకు చేరువవుతోంది. ఈనేపథ్యంలో మే నెలలో కొవిడ్‌ ఉద్ధృతి తారస్థాయికి చేరనుందన్న మిచిగాన్‌ విశ్వవిద్యాలయం అంచనాలు ఆందోళన రేపుతున్నాయి. భారత్‌లో మే నెల మధ్యనాటికి రోజువారీ కేసుల సంఖ్య 8 నుంచి 10 లక్షలకు చేరుతాయని మిచిగాన్‌ విశ్వవిద్యాలయం హెచ్చరించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి: చంద్రబాబు

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బ్లాక్‌మార్కెట్‌లో ఆక్సిజన్‌ అమ్ముతున్న సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. Telangana Covid: 6,551 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 73,275 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 6,551 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 43 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 3,804 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 65,597కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1418 కేసులు నమోదయ్యాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. నా హృదయం ముక్కలైంది: సత్యనాదెళ్ల

భారత్‌లో పరిస్థితి చూసి తన హృదయం ముక్కలైందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల అన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆక్సిజన్‌ పరికరాల కొనుగోలులో భారత్‌కు మద్దతిస్తామని చెప్పారు. భారత్‌కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ తన వనరులను ఉపయోగిస్తుందన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. ‘ఆ ఇద్దరి మృతికి ఆక్సిజన్‌ కొరత కారణం కాదు’

మహారాజా ఆస్పత్రిలో లో ప్రెజర్‌ ఆక్సిజన్‌ సమస్య వచ్చిందని.. దీన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని విజయనగరం జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఆస్పత్రిలో మొత్తం 290 మంది కొవిడ్‌ రోగులు ఉన్నారని.. వారిలో 25 మందికి ఐసీయూలో ఆక్సిజన్‌తో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారని.. వారు చనిపోవడానికి ఆక్సిజన్‌ కొరత కారణం కాదని వైద్యులు చెప్పారన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. భారత్‌కు కావాల్సిన సహకారం అందిస్తాం: బైడెన్‌

కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు.. కావాల్సిన సహకారం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ హామీ ఇచ్చారు. కరోనా కట్టడిలో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను భారత్‌కు పంపనున్నామని తెలిపారు. మొదటి దశ విజృంభణ సమయంలో అమెరికా ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా.. భారత్‌ తమకు అండగా నిలబడిందని బైడెన్‌ గుర్తుచేసుకున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. ఐపీఎల్‌కు విరామం తీసుకుంటున్నా: అశ్విన్‌

ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్న ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కుటుంబసభ్యుల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా రేపటి నుంచి తాను ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. Oscars 2021: ఉత్తమ చిత్రం కథ ఇదే

సినీ ప్రియులందరూ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. కరోనా కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తోన్న అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం నేడు అట్టహాసంగా జరిగింది. ప్రముఖ మహిళా దర్శకురాలు క్లోవీ చావ్‌ దర్శకత్వం వహించిన ‘నోమడ్‌ ల్యాండ్‌’ ఈ సారి మూడు ముఖ్యమైన విభాగాల్లో(ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటి) అస్కార్‌ అవార్డు అందుకుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. మనసుల్ని కట్టిపడేస్తున్న ఓ బీడీ కార్మికుడి త్యాగం!

రోనా కష్టాలనే కాదు.. అనేక గుణపాఠాలనూ నేర్పింది. మనుషుల్లోని దాతృత్వాన్ని మేల్కొల్పింది. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసి బతకడం నేర్పింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఉన్న సంతృప్తిని రుచి చూపింది. కేరళకు చెందిన ఓ బీడీ కార్మికుడి సహృదయం ఇప్పుడు నెటిజన్ల మనసుల్ని దోస్తోంది. సాటి మనుషుల్ని కాపాడుకునేందుకు ఆయన చేసిన త్యాగం సీఎం ప్రశంసల్ని దక్కించుకుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. అంబులెన్స్‌ దొరక్క.. కారుపైనే అంతిమయాత్ర!

దేశంలో కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలం కారణంగా.. అనారోగ్యంతో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు బాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తాజాగా అగ్రాలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు అంబులెన్స్‌ దొరక్క బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు చేసేదేం లేక తమ కారుపైనే మృతదేహాన్ని కట్టి శ్మశాన వాటికకు తరలించడం చూపరులను కంటతడి పెట్టించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని