తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉంది: సీఎస్‌
close

తాజా వార్తలు

Updated : 05/05/2021 15:43 IST

తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉంది: సీఎస్‌

హైదరాబాద్‌: కరోనా విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని.. ఇది మంచి పరిణామమన్నారు. బీఆర్కే భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎస్‌ మాట్లాడారు.  

ఆక్సిజన్‌ కొరత రాకుండా చర్యలు

రాష్ట్రంలో ఆక్సిజన్‌ బెడ్‌ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్‌ చెప్పారు. మెడికల్‌ ట్రీట్‌మెంట్‌కు హైదరాబాద్‌ క్యాపిటల్‌గా మారిందని.. నగరంలో తెలంగాణ వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు కూడా చికిత్స పొందుతున్నారని తెలిపారు. గత 15 రోజుల్లోనే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి 33 మెడికల్‌ ఎయిర్‌ అంబులెన్స్‌లు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు.  సీఎం కేసీఆర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై రోజుకు మూడు, నాలుగు సార్లు తనతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన చర్చిస్తూ పలు సూచనలు చేసేవారని సీఎస్‌ చెప్పారు.  కొరత రాకుండా పకడ్బందీగా ఆక్సిజన్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్నామన్నారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్‌ రాష్ట్రానికి వచ్చేందుకు 6 రోజుల సమయం పడుతోందని.. అందుకే విమానాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 

లాక్‌డౌన్‌తో పెద్దగా ఉపయోగముండదు..

కరోనా పాజిటివ్‌ వచ్చి లక్షణాలుంటేనే వైద్యం అందించాలని ఐసీఎంఆర్‌ చెప్పినట్లు సీఎస్‌ గుర్తు చేశారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టాలన్నారు.  ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌ ఓపీ సర్వీసును ప్రారంభించామని.. అక్కడికి వెళ్తే లక్షణాలున్న వారికి మందులు ఇస్తారని చెప్పారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆస్పత్రికి రావాల్సిన అవసరమే ఉండదన్నారు. వారాంతపు లాక్‌డౌన్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఆ అంశాన్ని పరిశీలిస్తామని సోమేశ్‌కుమార్‌ తెలిపారు. కరోనా సమస్యకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదని.. దానివల్ల పెద్దగా ఉపయోగముండదని, జీవనోపాధి దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైనపుడు సీఎం, కేబినెట్‌ దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలను దాచడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా సీఎస్‌ చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని