మినీ పురపోరుకు నోటిఫికేషన్‌ విడుదల
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 16:21 IST

మినీ పురపోరుకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో మినీ పుర పోరుకు నోటిఫికేషన్‌ వెలువడింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం, నగరపాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ పురపాలికల ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రేపటి నుంచి ఈనెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న అభ్యర్థుల నామపత్రాల పరిశీలన,  22 వరకు నామినేషనల్ ఉప సంహరణకు అవకాశం కల్పించారు. ఈనెల 30న పోలింగ్‌ నిర్వహిస్తారు. మే 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.

వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఈనెల 30న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు, గజ్వేల్‌, నల్గొండ, జల్‌పల్లి, అలంపూర్‌, బోధన్‌, పరకాల, మెట్‌పల్లి, బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఎన్నిక జరగనుంది.సిద్దిపేట పాలకమండలి పదవీకాలం ఇవాళ్టితో పూర్తి కానుంది. జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ ఉదయం వార్డుల వారీ రిజర్వేషన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు వార్డుల వారీ రిజర్వేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీల సమక్షంలో కలెక్టర్లు లాటరీ తీశారు. అటు కొత్తగా ఏర్పాటైన జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్ పదవుల మహిళా రిజర్వేషన్ల కోసం పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ తీశారు. జడ్చర్ల బీసీ మహిళకు, కొత్తూరు జనరల్ మహిళకు, నకిరేకల్ బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. అందుకు అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల వివరాలు అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని