TS Highcourt: వారికి జీతాలు ఇవ్వకపోతే ఎలా?
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS Highcourt: వారికి జీతాలు ఇవ్వకపోతే ఎలా?

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
వెంటనే విడుదల చేయాలని ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యఆరోగ్యశాఖ తెలంగాణ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 1 నుంచి 14 వరకు సరాసరి 69,185 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం పేర్కొంది. దేశ సరాసరితో పోలిస్తే కరోనా పరీక్షల్లో వెనుకబడిలేమని వైద్యఆరోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. రోజూ కనీసం లక్ష పరీక్షలు జరపాలని అనేకసార్లు ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని న్యాయస్థానం ఆక్షేపించింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ఠ ధరలు గతంలోనే ఖరారు చేశామని డీహెచ్‌ తెలపగా.. చికిత్స విధానాలు మారినందున సమీక్షించి తాజా జీవో ఇవ్వాలని.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఫిర్యాదుల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పడకలపై వెబ్‌సైట్‌లోని వివరాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఆస్పత్రుల్లో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్న అంశంపై హైకోర్టు ఆరా తీసింది. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోతే ఎలా? అని ప్రశ్నించింది. వారికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి

మరోవైపు కరోనా నిబంధనల అమలుపై డీజీపీ మహేందర్‌రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఔషధాల బ్లాక్‌ మార్కెట్‌పై 98 కేసులు నమోదుచేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాల ఏర్పాటుతో పాటు లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీ అమలుకు చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. ఈనెల 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించనందుకు 3,39,412 కేసుల నమోదు చేయడంతో పాటు రూ.31కోట్ల జరిమానా విధించినట్లు చెప్పారు. భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశామన్నారు. లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసుల పనితీరు అభినందనీయమని.. ఇదే విధంగా పనిచేయాలని హైకోర్టు సూచించింది. విచారణకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు హాజరయ్యారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని