అమ్మాయిని కాబట్టే నాకు క్రికెట్‌ నేర్పించట్లేదా?
close

తాజా వార్తలు

Published : 28/05/2021 01:43 IST

అమ్మాయిని కాబట్టే నాకు క్రికెట్‌ నేర్పించట్లేదా?

ఆరేళ్ల వయసులోనే బ్యాట్‌ పట్టిన బుజ్జాయి
పర్‌ఫెక్ట్‌ షాట్లతో అదరగొడుతున్న కేరళ బాలిక

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ చిన్నారి పాప వయసు ఆరేళ్లే. అయితేనేం క్రికెట్‌పై అమితమైన ప్రేమ. సోదరుడికి మాత్రమే క్రికెట్‌లో మెళకువలు నేర్పిస్తున్న తన తండ్రిని చూసింది. తాను కూడా నేర్చుకోవాలనుకుంది. కానీ నేర్పేవారేరని తనలో తాను ప్రశ్నించుకుంది. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్లి ‘‘అమ్మాయిని కాబట్టే నాకు క్రికెట్‌ నేర్పించడం లేదా?’’ అని సూటిగా ప్రశ్నించింది. ఆ తండ్రికి అప్పుడు అర్థమైంది, తన కుమార్తెకు క్రికెట్‌ అంటే ఎంత ఇష్టమోనని! అంతే, అప్పటి నుంచి ఆమెకు కూడా ఆట ఎలా ఆడాలో నేర్పించడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే ఆ బుజ్జిపాప పదునైన షాట్లు కొడుతూ ఆటలో తన ప్రతిభను చాటసాగింది. స్ర్టెయిట్‌ డ్రైవ్‌, పుల్‌షాట్స్‌లాంటివి పర్‌ఫెక్ట్‌గా కొడుతూ ఆమె ఆడుతున్న వీడియోను క్రికెట్‌కోచ్‌ బిను జార్జ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతే.. బుల్లి బ్యాట్స్‌మన్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

భారతీయుల రక్తంలోనే క్రికెట్‌పై అభిమానం ఉంది. ఎంతోమందికి క్రికెటర్‌ అవ్వాలనేది జీవితలక్ష్యం. అయితే మన దేశంలో పురుషుల క్రికెట్‌కు ఉన్న ఆదరణ మహిళల క్రికెట్‌కు ఉండదు. ఇటీవలి కాలంలోనే ఈ పరిస్థితి కొంత మారి, మహిళల క్రికెట్‌ పోటీలను చూసేందుకు ఆసక్తి కనబరిచేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అమ్మాయిలు సైతం ఈ క్రీడను తమ కెరీర్‌గా మలచుకునేందుకు ముందుకు వస్తున్నారు. వారి దారిలోనే పయనిస్తోంది కేరళకు చెందిన ఆరేళ్ల మెహక్‌ ఫాతిమా. కోయికోడ్‌లో నివాసముంటున్న మెహక్‌ తన మూడేళ్ల సోదరుడికి తండ్రి మునీర్‌ క్రికెట్‌ నేర్పిస్తుండటం చూసి  తాను కూడా నేర్చుకోవాలనుకుంది. తమకు ఇష్టం వచ్చిన ఆట ఆడే హక్కు అమ్మాయిలకూ ఉందన్న విషయాన్ని ఆమె చిన్న వయసులోనే గుర్తించినట్లు తల్లి ఖదీజా చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఆమెకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల పాటు శిక్షణ సాగగా.. లాక్‌డౌన్‌ విధింపుతో అది అర్ధాంతరంగా ఆగిపోయిందని పేర్కొన్నారు. అయితే ఆ కొద్ది సమయంలోనే ఫాతిమా తన నైపుణ్యానికి పదును పెట్టినట్టు వివరించారు. ప్రస్తుతం తన ఆటతీరు, ఆసక్తి చూసి పలు క్రికెట్‌ శిక్షణ కేంద్రాలవారు ఆమెకు ట్రైనింగ్‌ ఇస్తామంటూ ముందుకొస్తున్నట్టు తెలిపారు. క్రికెట్‌ ఆ కుటుంబసభ్యుల రక్తంలోనే ఉందని.. ఫాతిమా తండ్రి మునీర్‌ కూడా  13 ఏళ్ల వయసులోనే పలు పోటీల్లో ప్రతిభ చాటినట్లు వివరించారు. ఫాతిమా సోదరుడు కూడా 18 నెలల వయసులోనే బ్యాట్‌ పట్టుకున్నట్టు చెప్పి మురిసిపోయారు. తమ కుమార్తెకు క్రికెటర్‌ స్మృతి మంథాన అంటే ఎంతో అభిమానమని చెప్పారు. ఎప్పుడూ ఆమె వీడియోలు చూస్తూ తాను కూడా పెద్దయ్యాక ఆమెలా క్రికెటర్‌ అవుతానని ఫాతిమా చెబుతుంటుందని వివరించారు. తాము ఫాతిమాను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని