జీఎస్టీ వసూళ్లు పెరగడం వెనక మతలబు..?

తాజా వార్తలు

Published : 03/08/2021 01:05 IST

జీఎస్టీ వసూళ్లు పెరగడం వెనక మతలబు..?

ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: జులై నెల జీఎస్‌టీ వసూళ్లు మరోసారి రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. రూ.1,16,393 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది జులై నాటితో పోలిస్తే ఇది 33 శాతం అధికం. వరుసగా ఎనిమిది నెలల పాటు రూ.లక్ష కోట్లకు పైగా వచ్చిన జీఎస్టీ వసూళ్లు.. 2021 జూన్‌లో రూ.92,849 కోట్లకు తగ్గిపోయిన విషయం తెలిసిందే. మనదేశంలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి నేపథ్యంలోనూ జులైలో పెరిగిన జీఎస్టీ లెక్కలు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనే సంగతిని చెబుతున్నాయని ఆర్థికమంత్రి, మరికొద్దిమంది  నిపుణులు చెబుతున్నారు.  ఇది ఎంతవరకూ సరైనదో ఒకసారి పరిశీలిద్దాం!

ధరల పెరుగుదల కూడా కారణమే!
జనవరి 2021 నుంచి మార్చి వరకు ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకుంది. దాదాపు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. అందువల్ల వినియోగదారులు తాము కొనుగోలు చేసేందుకు వస్తువులకు చెల్లించిన అధిక ధరలపై, జీఎస్టీ బాదుడు కూడా ఎక్కువగా పడింది. ఆ కారణంగానే ఏప్రిల్‌, మేలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి. కానీ మేలో చాలా చోట్ల  లాక్‌డౌన్‌ విధించడంతో తిరిగి ఆర్థిక కార్యకలాపాలు, కొనుగోళ్లు తగ్గిపోయాయి. అందువల్ల జూన్‌ మాసంలో జీఎస్టీ లక్ష కోట్ల రూపాయలకంటే తగ్గింది.  మార్చిలో నమోదైన 7.1 కోట్ల రవాణాకు సంబంధించిన ఈ-వే బిల్లులు, ఏప్రిల్‌-మే నెలలకొచ్చేసరికి 30 శాతం తగ్గిపోయి, 4.8 కోట్లకు పడిపోయాయి. క్రితం నెలలోని ఆర్థిక కార్యకలాపాలపై పన్నుల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయాన్ని ఆ తర్వాతి నెలలో ప్రకటిస్తారనే సంగతి తెలిసిందే. 

పన్నుల ఎగవేతకు చెక్‌ పెట్టడం..
పన్నుల ఎగవేతను అరికట్టడం, పన్నుల ద్వారా ఆదాయం పెరగడం వల్లనూ  జీఎస్టీ అధికంగా వసూలయింది. ఈ-వాయిసింగ్‌, డాటా అనలిటిక్స్‌ ఆధారిత ఇన్వెస్టిగేషన్స్‌, ఏడాది చివరి ఆడిటింగ్‌ తదితర కట్టుదిట్టమైన చర్యల వల్ల ఏప్రిల్‌, జులై మాసాల్లో జీఎస్టీ లక్షల కోట్ల రూపాయలను దాటింది.  తప్పుడు బిల్లులు తగ్గిపోయాయి. జీఎస్టీ సమర్పించనివారిపై, అవకతవకలకు పాల్పడుతున్నవారిపై కేసులు పెట్టడం కూడా జీఎస్టీ పెరుగుదలకు కారణమైంది. పన్నుల వ్యవస్థను సజావుగా నిర్వహించడం వల్లనే ఆదాయం నిలకడగా పెరుగుతోందని నిపుణుల అభిప్రాయం. గతేడాది మార్చితో పోలిస్తే, 2021 మార్చికి జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం 24 శాతం పెరిగింది. తమిళనాడులో 23, గుజరాత్‌లో 22 , మహారాష్ట్రలో 14, కర్ణాటకలో 11, ఆంధ్ర ప్రదేశ్‌లో 5 శాతం జీఎస్టీ పెరిగింది.  గత ఏడాదితో పోల్చితే ఒడిశా, ఝార్ఖండ్‌, హర్యానాలో జీఎస్టీ వసూలు జులై మాసానికి యాభైశాతానికి పైగా పెరిగింది.

జీఎస్టీలో అధిక వాటా దిగుమతులదే!
దిగుమతుల ద్వారా 36 శాతం జీఎస్టీ వస్తే, దేశీయంగా జరిగిన ఆర్థిక లావాదేవీలతో 32 శాతం వచ్చింది. కాబట్టి దిగుమతులకు వేసే సుంకం కూడా జీఎస్టీ వసూళ్లు పెరిగేందుకు బాగా తోడ్పడుతోంది. దీన్ని మరింతగా పెంచడం ద్వారా దేశీయ తయారీ రంగానికి ఊతం ఇవ్వవచ్చు. 

లాక్‌డౌన్‌ లేకపోతే జీఎస్టీ లక్ష కోట్లకు పైమాటే!
కరోనాను కట్టడి చేస్తూ, విస్తృత లాక్‌డౌన్‌లకు వెళ్లకపోతే జీఎస్టీ వసూళ్లకు తిరుగుండదని జులై మాసానికి రికార్డు స్థాయిలో వచ్చిన 1.16 లక్షల కోట్ట వస్తు సేవాపన్ను నిదర్శనంగా నిలుస్తోంది. గత ఏడాది కంటే ఇది 33 శాతం ఎక్కువ. గతేడాదితో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాల్లోనూ జీఎస్టీ వసూళ్లు భారీగానే పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది ఇదే సమయానికి రూ.2,138 కోట్లు ఉండగా, ఈసారి 2,730 కోట్లతో, 28 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి.  అలాగే తెలంగాణాలో రూ.2,876 కోట్లు ఉండగా, రూ.3,610 కోట్లతో వసూళ్లలో 26 శాతం వృద్ధి  కనిపిస్తోంది.

పెరిగిన ఆర్థిక కార్యకలాపాలకు సూచిక!
జూన్‌ 2021లో జీఎస్టీ లక్ష కోట్లకు దిగువకు వెళ్లింది. అంతకుముందు వరుసగా ఎనిమిది నెలలు లక్షకోట్ల పైనే వసూళ్లయ్యాయి. మే, 2021లో కొవిడ్‌ కేసులు పెరగడంతో చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు విధించినందున జూన్‌లో వసూళ్లు తగ్గాయి. కానీ తిరిగి జూన్‌ నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేయడం, కొవిడ్‌ నిబంధనలు సరళీకరించడంతో ఆర్థిక కార్యకలాపాలు  పుంజుకున్నాయి. దాంతో జులైలో 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. కానీ జూన్‌ నెల జీఎస్టీని జులై 5 వరకు సమర్పించేందుకు గడువు ఇచ్చారు. అందువల్ల ఐదు రోజుల జీఎస్టీ రూ.4,937 కోట్లు జులై లెక్కలోకి కలిసింది.  అయితే నిలకడగా చాలా నెలలపాటు లక్ష కోట్లకు పైగా వసూలైన జీఎస్టీ మన ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌ బారి నుంచి తొందరగా పుంజుకునింది అనేందుకు ఓ సూచిక.  మొదట్లో 2020 మార్చి నుంచి సెప్టెంబరు వరకు వరుసగా ఏడునెలలు జీఎస్టీ వసూళ్లు రూ. 1 లక్ష కోట్ల కంటే తక్కువ ఉన్నాయి.
కానీ ఆ తర్వాతి కాలంలో.. అక్టోబరు2020 నుంచి ఏప్రిల్‌ 2021 వరకు వరుసగా జీఎస్టీ రూ.లక్ష కోట్లకు పైనే వసూలయింది.  ‘‘ఏప్రిల్‌2021లో జీఎస్టీ ఆల్‌టైమ్‌ రికార్డుగా 1.41 లక్షల కోట్లు వచ్చింది. కాబట్టి  జులైకి వసూలైన 1.16 లక్షల కోట్లను ఏప్రిల్‌ ఆదాయంతో పోలిస్తే  తక్కువగానే ఉంది. అందువల్ల ఇంకా మన ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో పుంజుకోలేదనేదాన్నే ఇది సూచిస్తుంది’’ అని ఐసీఆర్‌ఏకు చెందిన ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణులు అదితి నాయర్‌ తెలిపారు. 

మూడోవేవ్‌ను అదుపు చేస్తే..?
గత ఏడాది ఏప్రిల్‌ మాసానికిగాను జీఎస్టీ అతి తక్కువగా రూ. 32,172 కోట్లు వసూలయింది. కానీ కొవిడ్‌ నుంచి వచ్చిన పాఠాలను స్వీకరిస్తూ, వ్యాక్సినేషన్‌ను కూడా ప్రారంభించడంతో ఈ ఏడాది ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి.  దేశంలో మరో నెలన్నర రోజుల్లో మూడోవేవ్‌ తారస్థాయికి చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని గనుక అదుపు చేస్తే, జీఎస్టీ వసూళ్లు రాబోయే నెలల్లోనూ లక్ష కోట్ల రూపాయలకు పైనే వసూలవుతాయని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. కొవిడ్‌ భయాందోళనలు లేకపోతే వినియోగదారులు ఖర్చు పెట్టేందుకు వెరవరు. కాబట్టి త్వరితగతిన అందరికీ వ్యాక్నిన్లను పంపిణీ చేస్తే, పాత జీఎస్టీ రికార్డులన్నీ బద్దలవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని