బాలసుబ్రహ్మణ్యం గారు మానాన్నకు స్నేహితులు. ఆయనని ఎనిమిదో తరగతిలో తొలిసారి కలిశా. ఆయన మా అమ్మను చెల్లి, నాన్నను బావ అని పిలుస్తారు. బాలు గారిని మామయ్యా అని పిలుస్తా. |
నా పేరులో సుని తీసుకుని కొందరు హేమసుని, దుర్గసుని.. అని పేరుపెట్టుకోవటం చూసి ఆశ్చర్యపోయా. |
మాది గుంటూరు. అమ్మ పేరు సుమతి, నాన్న పేరు నరసింహారావు. నాకో చెల్లి ఉంది. అమ్మ సంగీత ఓనమాలు నేర్పించి ఆరేళ్ల వయసులో సంగీతం క్లాసులో చేర్పించింది. శని, ఆదివారాల్లో ఆడుకోకుండా సంగీతం క్లాసుకి తీసుకెళ్తోందని బాగా ఏడ్చేదాన్ని. లలిత సంగీతమూ నేర్చుకున్నా. లలితమైన సంగీతం, లాలిపాటలు, ప్రకృతి పాటలంటే ఇష్టపడేదాన్ని. చిన్నపూల మొక్కను చేత్తో నిమురుతూ.. లాలిపాట పాడుకునేదాన్ని. ఇంట్లో తాతయ్య పెంచిన మొక్కలు 500పైగా ఉండేవి. జామ, సపోటా చెట్లుండేవి. ఏ పుట్టదగ్గరో, చెట్టుకిందనో సాధన చేసేదాన్ని. ఇప్పటికీ ఏ హాయిపాట విన్నా.. ఆ మొక్కలతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. మహ్మద్‌రఫీ, సుశీల, బాలుగారి పాటల్ని బాగా వినేదాన్ని. బడిలో మొదటి బహుమతి కాకుండా రెండో బహుమతి వస్తే.. ఏడ్చేదాన్ని. అలిగేదాన్ని. |
చీరలు నేను డిజైన్ చేసుకున్నవే

మూడు నెలలకోసారి కొత్తప్రదేశాలు చూస్తా. ఫొటోలు తీయటం అలవాటు. ఇంట్లో ఖాళీగా ఉన్నరోజు సాయంత్రం పూట కాటన్ చీర కట్టుకుంటాను. దేవుడిని పూజించి ఇంటిని కొవ్వొత్తులతో అలంకరిస్తా. హాయిగా ఓ సినిమా చూసి భోజనం చేశాక.. నా కూతురికి లాలిపాట పాడి నిద్రపుచ్చటం నాకిష్టం. మా అమ్మ స్తోత్రాలు పాడుతూ వంట చేస్తుంది. నేనూ పాటలు పాడుతూ వంట చేస్తా. చుక్కకూర, మామిడికాయ పప్పు చేయటంలో ఎక్స్‌పర్ట్‌ని. శాకాహారిని. మసాలా ఆహారం, ఫాస్ట్‌ఫుడ్, కూల్ డ్రింక్స్‌కు దూరం. చీరలంటే ఇష్టం. నా ఐడెంటిటీ చీరతోనే. నాకు ఏ రంగు చీర నప్పుతుందో తెలుసు. చీరలో సింప్లిసిటీ ఉంటుంది. పాట పాడినపుడు పల్లవి, చరణాల్లాగా చీర ఉండాలనుకుంటాను. నేను ధరించేవన్నీ సొంతంగా డిజైన్ చేసుకున్నవే.
|
జీవితం నేర్పిన పాఠం అనేకన్నా.. మనుషులు నేర్పిన పాఠాలు చాలా ఉన్నాయి. ఏదేమైనా జీవితం నన్ను ఎక్కువ సందర్భాల్లో గందరగోళంలో పడేసింది. |
ప్రేమ అంటే అర్థంకాని విషయం. పెళ్లి, కుటుంబ వ్యవస్థంటే చాలా ఇష్టం. ప్రేమతో కూడిన వైవాహిక జీవితానికి మించిన అందమైన జీవితం మరొకటి లేదు. |
* అమ్మ మ్యూజిక్ టీచర్. నన్ను ‘బ్రహ్మరాక్షసి’ అని పిలిచేది. మా చిన్నప్పుడు మేనత్తతో కలిసి ఇంట్లోనే ‘అన్నమాచార్య సంగీత నృత్యకళాశాల’ ప్రారంభించింది. మా తాతగారు మల్లాది శివరామశాస్త్రి. ప్రముఖ కవి. స్వాతంత్య్రోద్యమంలో జైలుకెళ్లారు. * ఇంటర్ తర్వాత సంగీతంలో డిగ్రీ చేశా. ‘ఈవేళలో.. ’ పాడిన తర్వాత ఓ అభిమాని క్యాసెట్లో రెండు వైపులా ఈ పాటనే రికార్డు చేశాడు. ఆ క్యాసెట్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. * ఇప్పటివరకూ మూడువేల పాటలు పాడాను. 700 చిత్రాలకి డబ్బింగ్ చెప్పా. తొమ్మిది నంది అవార్డులొచ్చాయి. యాంకరింగ్, స్టేజ్షోలు చేస్తున్నా. ఈటీవీలో ‘ఝుమ్మంది నాదం’ కార్యక్రమం చూసి ‘నీ యాంకరింగ్‌కు అభిమాని’ని అని గుమ్మడి గారు అనడం గొప్ప ప్రశంస.
* ‘శ్రీరామదాసు’ ఆడియో రిలీజ్ అయ్యాక ఏఎన్నార్‌గారు ఫోన్ చేశారు. ‘చాలు చాలు.. పాట ఇప్పుడే విన్నా. ప్లేబ్యాక్ సింగర్‌గా నటించావ’ని ప్రశంసించారు. కథానాయికగా అవకాశాలొచ్చినా నటించలేదు. బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ పాత్ర వస్తే చేద్దామనుకున్నా. కుదరలేదు. * ఈ ఏడాది నుంచి గురుముఖంగా హిందూస్థానీ సంగీతాన్ని నేర్చుకోవాలనుకుంటున్నా. ఒకవేళ నేను సినీ గాయని కాకపోతే.. కచ్చితంగా భక్తిపాటలు పాడుకొనేదాన్ని. ప్రకృతి ఒడిలో సంగీత పాఠశాల ప్రారంభించాలనే కల ఉంది.
|
వాడి స్పందన కోసం ఎదురుచూస్తా

మా అబ్బాయి ఆకాష్ పాడతాడు, డ్యాన్స్ ఇంకా బాగా చేస్తాడు. బీబీఏ చదివాక క్యాంపస్ ఎంపికల్లోనే దిల్లీలో ఉద్యోగం వచ్చింది. తొలి జీతం చేతికొచ్చాక కాల్ చేశాడు. ‘అమ్మా.. కరెంట్ బిల్ కడతా.’ అన్నాడు. ఇదే నాకు పెద్ద విజయం (నవ్వులు). నా పాటలకు తనే పెద్ద ఫ్యాన్. ఏదైనా పాట పాడితే.. దాన్ని మా అబ్బాయికి పంపి వాడి స్పందన కోసం ఎదురుచూస్తా. ‘మహానటి’ చిత్రంలో ‘చివరకు మిగిలేది..’ పాట విన్నాక.. ‘ఇంత హైనోట్్స ఎలా పలుకుతావ’ని ప్రశంసించాడు. ఇటీవల హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కచేరీ చేశా. నా ఎదురుగా కూర్చుని విన్నాడు. ‘అబ్బా.. ఎంత బాగా పాడతావమ్మా.. ఆ ఎక్స్ప్రెషన్ భలే అమ్మా..’ అంటుంటే కన్నీళ్లొచ్చాయి. నా కూతురు శ్రేయ బాగా పాడుతుంది. పాశ్చాత్య సంగీతాన్ని ఇష్టపడుతుంది. ‘సవ్యసాచి’ చిత్రంలో కీరవాణి స్వరకల్పనలో ఓ పాట పాడింది.
|
కన్నీటిలో అమ్మ పిల్లలకు గుర్తు రాకూడదు
చిన్నవయసులోనే కెరీర్, కుటుంబం, పిల్లలతో బిజీ అయిపోయా. నామీద శ్రద్ధ పెట్టే సమయం లేదు. సంసార జీవితంలో బోలెడన్ని ఇబ్బందులు చూశా. కుటుంబం, కెరీర్‌ను సమతూకం చేయలేకపోయా. విపరీతమైన ఒత్తిడికి గురయ్యా. స్టూడియోకి వెళ్లి నవ్వుతూ పాడాల్సి వచ్చేది. ‘ఆ రోజు పాట అలా పాడటానికి వచ్చిన ఇబ్బందులివీ’ అని శ్రోతలకూ, సంగీత దర్శకులకూ చెప్పుకోలేని పరిస్థితి నాది. అయినా నన్ను ప్రోత్సహించిన సంగీత దర్శకులకు చేతులెత్తి నమస్కరిస్తా. క్లిష్ట పరిస్థితుల్లోనూ కెరీర్‌ను ఆపలేదు. నేనెవరి మెప్పునూ ఆశించలేదెప్పుడు. నా వ్యక్తిగత విషయాల్ని ఇతరులతో చర్చించడం తక్కువే. నేనేంటో నా తల్లిదండ్రులకు, పిల్లలకు తెలుసు. నా కుటుంబమే నా బలం. పిల్లలే నన్ను నడిపిస్తున్నారిప్పుడు. నా పిల్లలకు ఎప్పుడూ కన్నీటితో ఉన్న అమ్మ గుర్తుకురావొద్దు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ నిలదొక్కుకున్న అమ్మ గురించి తెలియాలి. ‘ఆత్మవిశ్వాసానికి అమ్మనే ఉదాహరణగా తీసుకోండ’ని చెబుతా. సెలయేరులానే నా జీవితం మలుపులు తిరుగుతూ పయనించింది.
|
నమ్మకమొచ్చిందప్పుడే..!
1995... ఇంటర్ రెండో సంవత్సరం సెలవుల్లో హైదరాబాద్‌కొచ్చా. పండక్కి ఊరెళ్లిపోవాలనుకున్నప్పుడు ‘ఆడిషన్’కి రమ్మన్నారు. ఏబీసీఎల్ కార్పొరేషన్ సినిమా కదా.. అమితాబ్, వర్మ ఉంటారని వెళ్లానక్కడికి. వాళ్లు కనిపించలేదు. హంగామా లేకుండా సంగీత దర్శకుడు శశిప్రీతమ్ పాట పాడించారు. ఆడియో ఫంక్షన్‌కి రమ్మని.. ఐదువేల రూపాయలు చేతిలో పెట్టాడు మేనేజర్. ఆ చిత్రమే ‘గులాబీ’. ఆ పాటే.. ‘ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావో..’. తొలి పారితోషికంతో తొలిసారి గాగ్రా కొనుక్కున్నా. ఆ పాట సూపర్‌హిట్ కావడంతో కీరవాణి, కోటి, ఎస్వీ కృష్ణారెడ్డిగారు.. అవకాశాలిచ్చారు. నన్ను హెచ్చరించి నా ప్రతిభను బయట మెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. ప్రశంసించి..బయటికెళ్లి తిట్టిన వాళ్లూ ఉన్నారు. ‘సార్.. నాకు పాటలివ్వండ’ని సంగీత దర్శకులను ఎన్నడూ అడగœలేదు. ఫలానా పాటకి సునీత అయితే సరిపోతుందనుకుంటే పాడించారు.
|
ఇట్లు నీ వీరాభిమాని.. బాపు!
‘పెళ్లిపందిరి’ చిత్రంలో రాశికి డబ్బింగ్ చెప్పా. ‘చూడాలని ఉంది’, ‘ఆనంద్’, ‘గోదావరి’, రాధాగోపాలం, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం.. ఇలా ఎన్నో చిత్రాల్లో డబ్బింగ్‌తో పాత్రలకు అదనపు అందం తెచ్చారని మెచ్చుకున్నారంతా. డబ్బింగ్ ఆర్టిస్టులున్నారు కాబట్టే.. హీరోయిన్స్ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఈ మాటను పొగరనుకున్నా ఫర్లేదు. వాళ్లు ఒప్పుకొని తీరాల్సిందే. రోజారమణి, దుర్గ, సరిత, శిల్ప, సవితారెడ్డి, హరిత, సౌమ్య.. ఇలా మేమంతా హీరోయిన్స్ జీవితాల్ని నిలబెట్టాం. తొలిసారి సౌందర్యగారికి ‘చూడాలని ఉంది’లో ‘పద్మావతీ పద్మావతి..’ అంటూ డబ్బింగ్ చెప్పా. ఆమె ప్రతి సినిమాకి కాల్ చేసి మాట్లాడేది. ఛార్మీ బొకే పంపేది. ‘నా వాయిస్’ అంటూ కథానాయిక స్నేహ ఇతరులకు పరిచయం చేసేది. డబ్బింగ్ చెప్పలేకపోతే.. కల్యాణి అలిగేది. అలాంటివాళ్లంటే గౌరవం. ‘రాధాగోపాలం’ డబ్బింగ్ పూర్తయ్యాక.. బాపూగారు ‘చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతి సునీతకు ఆశీస్సులతో వీరాభిమాని బాపు’ అని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ‘శ్రీరామరాజ్యం’లో సీతమ్మ పాత్రకు డబ్బింగ్ పూర్తయ్యాక.. వెక్కి వెక్కి ఏడ్చా.
- రాళ్లపల్లి రాజావలి ఫొటోలు : వసంత్ కుమార్ ఘంటసాల
|