close

తాజా వార్తలు

పర్మిట్లలో గందరగోళం...ఖజానాకు గండి

ఏటా రూ. కోట్లలో నష్టం
జిల్లాలోని పలు కలప డిపోల్లో అక్రమాలు
పట్టించుకోని వాణిజ్య పన్నులు, అటవీ అధికారులు
ఈనాడు - విజయవాడ

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జోరందుకున్నాయి. విజయవాడతో పాటు దాని చుట్టు పక్కల ఇళ్ల నిర్మాణాలు పెరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ ఇదే జోరు కనిపిస్తోంది. దీంతో పాటు కలప విక్రయాలు కూడా జోరందుకున్నాయి. ఎగువ మధ్యతరగతి వారు కూడా తమ కలల సౌధానికి నాణ్యమైన కలపను వినియోగించేందుకే ఆసక్తి చూపుతున్నారు. కొన్ని డిపోల్లో అక్రమాలు పెరిగాయి. ప్రభుత్వాదాయానికి భారీగా గండికొట్టడంతో పాటు, వినియోగదారులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. అటవీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ఉదాసీనతను సొమ్ము చేసుకుంటూ పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏటా రూ. కోట్లలో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. విదేశీ కలపను విక్రయించేందుకు పర్మిట్లు అవసరం లేదు. వీటిని దుర్వినియోగం చేస్తే అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. నిరంతరం డిపోలపై ఆ శాఖ అధికారులు నిఘా ఉంచాలి. ఈ విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. నిల్వలు ఎలా ఉన్నాయి? పర్మిట్లను సక్రమంగా వాడుతున్నారా? దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారా? అన్న కోణంలో పరిశీలించడం లేదు. ఫలితంగా అక్రమాలు నానాటికీ పెరుగుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గంలోని ఓ డిపోలో గత నాలుగైదు రోజులుగా విజిలెన్స్‌ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. భారీగా అక్రమలు బయటపడుతున్నట్లు తెలిసింది.

చట్టం ఏం చెబుతోంది?
* డిపోల యాజమాన్యం రెండు రకాల రిజిస్టర్లను నిర్వహించాలి. ‘ఎ’ రిజిస్టర్‌లో డిపోలోకి వచ్చే కలప వివరాలను నమోదు చేయాలి. ఎంత క్యూబిక్‌ మీటర్ల సరకు వచ్చింది, వాటి రకం, తదితర వివరాలు ఉండాలి.
* ‘బి’ రిజిస్టర్‌లో ఎంత సరకు విక్రయించారు? వాటి విలువ ఎంత? వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. దీని ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. విక్రయాలు జరిగిన సరకుపై వాణిజ్య పన్నుల శాఖకు పన్ను కట్టాలి.
* కలపను విక్రయించేందుకు అటవీ శాఖ అధికారులు డిపోల యజమానులకు ఏటా పర్మిట్లు మంజూరు చేస్తారు. తాము విక్రయించిన సరకు వివరాలను పర్మిట్లలో నమోదు చేసి అటవీ అధికారులకు అందజేయాలి. వాటిని అధికారులు సరిచూసి తదుపరి పర్మిట్లు మంజూరు చేయాలి.

భారీగా దుర్వినియోగం
జిల్లాలో దాదాపు 300 పైగా టింబర్‌ డిపోలు ఉన్నాయి. ఏటా సుమారు రూ. 10 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు సమాచారం. విదేశీ కలపను విక్రయించేందుకు అనుమతి అవసరం లేదు. బర్మా, నైజీరియా, తదితర దేశాల నుంచి సరకు వస్తుంది. దీన్ని విశాఖపట్నం, చెన్నై, తదితర ఓడరేవుల నుంచి తీసుకొస్తారు. పెద్దగా నాణ్యత ఉండదు. దేశీయ కలపకే మంచి డిమాండ్‌ ఉంది. ఇది అడుగు రూ. 3,500 నుంచి రూ. 4,200 వరకు ఉంటుంది. అదే.. విదేశాలకు చెందిన సరకు అయితే రూ. 1,500 నుంచి రూ. 2,000కు మించి ఉండదు. చౌకగా లభించే విదేశీ కలపను మన సరకుతో కలిపి విక్రయిస్తున్నారు. పర్మిట్లలో ఈ వివరాలేవీ సరిగా నమోదు కావడం లేదు.
* విదేశీ సరకు అమ్మకాలకు సంబంధించి లెక్కలు చూపించాల్సిన అవసరం లేకపోవడమే అక్రమాలకు దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో అటవీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు జరగకపోవడంతో విచ్చలవిడితనం పెరిగింది. జారీ చేస్తున్న పర్మిట్లను తనిఖీ చేసి లెక్కలు చూడాల్సిన అటవీ అధికారులు మిన్నకుండిపోతున్నారు. డిపోలకు తెస్తున్న సరకుకు కూడా వేబిల్లులు ఉండడం లేదు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. విక్రయించిన సరకు తాలూకు లెక్కలు కూడా సరిగా నమోదు కావడం లేదు.
* చాలా చోట్ల వినియోగదారులను దారుణంగా మోసగిస్తున్నారు. దేశీయ కలప ముసుగులో సగం వరకు నాసిరకమైన విదేశీ సరకును కలుపుతున్నారు. కానీ బిల్లుల్లో మాత్రం ఇక్కడి సరకుగానే చూపిస్తున్నారు. ఇందుకు గాను డిపోల యాజమాన్యం సంబంధిత వడ్రంగికి విక్రయించి సరకులో 5 శాతం కమీషన్‌ కూడా ముట్టజెబుతున్నారు. డిపోల్లోని ముడి కర్రను విక్రయించి.. అక్కడే కోసి విక్రయిస్తే పన్ను ఎక్కువ పడుతుంది. అదే కర్రను బయట కొనుగోలు చేసి దుకాణంలో కోయిస్తే పన్ను తగ్గుతుంది. ఈ నిబంధనను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. తమ డిపోలో విక్రయించినా.. వినియోగదారులు బయట నుంచి కర్రను తెచ్చి కోయించుకున్నట్లు లెక్కలు చూపుతూ పన్ను ఎగ్గొడుతున్నారు.

భారీ స్థాయిలో అక్రమాలు
విజిలెన్స్‌ డీజీ గౌతం సవాంగ్‌ ఆదేశాల మేరకు పెనమలూరు నియోజకవర్గంలోని ఓ డిపోలో గత నాలుగైదు రోజుల నుంచి పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. అందులోని సరకు నిల్వలు, డిపో పర్మిట్లు, లైసెన్సులు, తదితర అన్ని రకాల దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇదే కలప డిపోలో తనిఖీ చేసిన సమయంలో విజిలెన్స్‌ అధికారులు పలు అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సుమారు రూ. 6 కోట్ల మేర జరిమానా విధిస్తూ, లెక్కల్లో చూపని సరకును సీజ్‌ చేయమని అటవీ శాఖకు సిఫార్సు చేశారు. అప్పటి అటవీ శాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఆగిపోయాయి. సరకును సీజ్‌ చేయలేదు. దీనికి విజిలెన్స్‌లోని ఓ అధికారిని బాధ్యుడిని చేస్తూ ఇటీవల మాతృ శాఖకు రిలీవ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ దస్త్రం కదిలింది. తాజాగా తనిఖీలు చేపట్టి, అక్రమాలపై నివేదిక ఇవ్వాలని డీజీ సవాంగ్‌ ఆదేశించారు. దీంతో విజిలెన్స్‌ ఎస్పీ లావణ్య లక్ష్మి ఆధ్వర్యంలో పలు బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఇది మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. తనిఖీల్లో తేలిన అంశాల ఆధారంగా ఆ డిపోపై జరిమానా, చర్యలు ఉండే అవకాశం ఉంది.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.