close

తాజా వార్తలు

ఉసురు తీసిన తాటి ముంజల ఆశ

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొని బాలిక దుర్మరణం
కంచికచర్లలో జాతీయ రహదారిపై ప్రమాదం

కంచికచర్ల, కంచికచర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: తాటి ముంజలు కొనుగోలు చేసేందుకు రోడ్డు దాటుతున్న బాలికను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో దుర్మరణం చెందింది. జాతీయ రహదారిపై కంచికచర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయ సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పరిటాలకు చెందిన తమ్మిశెట్టి నాగరాజు కుటుంబ సభ్యులు కంచికచర్లలో ఒక కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆటోలో స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్కెట్‌ యార్డు దాటిన అనంతరం తాటిముంజలు కనపడటంతో కొనుగోలు చేసేందుకు ఆటో దిగారు. రోడ్డు అవతల ముంజలు ఉండటంతో వాటి కోసం పిల్లలు పరుగులు తీశారు. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు దూసుకొచ్చింది. తమ్మిశెట్టి శివమణి (12) రోడ్డు దాటుతుండగా ఢీకొట్టింది. ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. పోలీసుల సాయంతో స్థానికంగా ఉన్న రెండు ఆసుపత్రులకు వెళ్లినా వైద్యులు అందుబాటులో లేరు. 108 వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మణికుమార్‌ తెలిపారు.

పరిటాలలో విషాద ఛాయలు
మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునేలోగా రహదారి ప్రమాదంలో బాలిక మృతి చెందడంతో పరిటాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన తమ్మిశెట్టి నాగరాజు, వెంకటరమణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా చిన్నమ్మాయి శివమణి చదువుకుంటోంది. గురువారం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు శివమణి భౌతికకాయాన్ని చూసేందుకు నందిగామ అసుపత్రికి తరలివెళ్లారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.