close

తాజా వార్తలు

‘ఉత్తర’మో... ‘దక్షిణ’మో...!

 సీఐల బదిలీల కోసం రాయబేరాలు

 నాయకుల చుట్టూ తిరుగుతున్న అధికారులు

 పశ్చిమాన కొన్ని సర్కిళ్లకు పోటాపోటీ

 

ఈనాడు డిజిటల్‌- ఒంగోలు: పోలీసు శాఖలో బదిలీల జ్వరం మొదలయ్యింది. మొదటి దశలో సీఐలు, తర్వాత దశలో ఎస్సైల బదిలీలు ఉంటాయని అనుకుంటున్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలమైన పోలీసులను తెచ్చుకోవాలనుకోవడం పరిపాటి. ఇటు నుంచి సీఐలు కూడా తమకు నచ్చిన ప్రాంతాల్లో చేరాలని ప్రయత్నాలు చేయడం సహజమే. ఈ క్రమంలోనే రాజకీయ కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. గతంలో ఓ పార్టీకి అనుకూలంగా పనిచేశారని ముద్ర పడిన కొందరు పోలీసులే మళ్లీ తమకు నచ్చిన ప్రాంతాల్లో చేరేందుకు ఉత్సాహం చూపడం, ఇటు నాయకుల నుంచి సిఫార్సులు అందుతుండడం చకచకా జరిగిపోతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో తిష్ట ప్రభుత్వ ఏర్పాటు పూర్తయ్యింది. పాలన అంతా ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది. జిల్లాస్థాయిలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీల తంతు పూర్తయ్యింది. ఇక మండల, డివిజన్‌ స్థాయిలో పనిచేసే అధికారుల బదిలీలకు సమయం ఆసన్నమయ్యింది. క్షేత్రస్థాయిలో మారిన రాజకీయ రంగుల దృష్ట్యా తమకు అనుకూలమైన వారిని తీసుకురావాలని నాయకులు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే శాంతిభద్రతలకు కీలకమైన పోలీసు విభాగంలో సీఐల బదిలీలకు సంబంధించి భారీగా రాయ‘బేరాలు’ నడుస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వేసిన సీఐలు మళ్లీ అదే ప్రాంతంలోనే పోస్టింగులకు ప్రయత్నాలు చేస్తుండడం, కొందరు నాయకులు దీన్ని ఆదాయ వనరుగా వాడుకోవడం పోలీసు శాఖలో చర్చలకు దారి తీస్తోంది.

ఆ సర్కిళ్ల చుట్టూ పోటీ

జిల్లాలోని కొన్ని సర్కిళ్ల పరిధిలో విపరీతమైన పోటీ నెలకొంది. ఆయా ప్రాంతాల్లో అక్రమాదాయం అధికమనే కారణంతో ఎక్కువగా అటే దృష్టి పెడుతున్నారు. గతంలో ఆ ప్రాంతాల్లో చేసిన వారు మళ్లీ ఆ పక్క స్థానాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం మారినా... తమ స్థానాలకు ఢోకా లేకుండా, అవసరమైతే రాయబేరాల ద్వారా సిఫార్సు చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శి, పొదిలి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, చీరాల, అద్దంకి, కనిగిరి, ఒంగోలు తాలూకా సర్కిళ్ల పరిధిలో అత్యధికంగా పోటీ నెలకొంది. ఈ సర్కిళ్లలో ఒక్కో స్థానానికి అయిదుగురు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఉత్తర’ ‘దక్షిణ’లు ఊపందుకున్నాయి. పశ్చిమాన ఓ నియోజకవర్గంలోని రెండు సర్కిళ్లకు భారీగా బేరం కుదుర్చుకున్నట్టు పోలీసు వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు సీఐలపైనా ఓ పార్టీ ముద్ర బలంగా ఉంది. దీంతో అక్కడ వ్యతిరేక వర్గంలోని కొందరు వైకాపా నాయకులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసి, ఈ సీఐల రాకను అడ్డుకోవాలని కోరినట్టు తెలుస్తోంది.

*● దర్శి వచ్చేందుకు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న ఓ సీఐ ప్రయత్నిస్తుండగా, కనిగిరిలో పనిచేసేందుకు ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న ఓ సీఐ ఆరాటపడుతున్నట్లు సమాచారం. చీరాల, ఒంగోలు తాలూకాలో చేరేందుకు చాలా మంది అధికారులు నాయకులను కలిసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు వస్తారు? కీలక స్థానాలు ఎవరికి కేటాయిస్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

*● పశ్చిమ ప్రాంతంలో ఓ సీఐ మూడేళ్లుగా ఒకే సర్కిల్‌లో పనిచేస్తున్నారు. ఆయనపై ఓ పార్టీ ముద్ర బలంగా ఉంది. ఎన్నికలకు ముందు ఓ పార్టీకి ఏకపక్షంగా చేశారని ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఈయన్ను ఎలాగైనా కీలక పోస్టింగ్‌ నుంచి తప్పించాలని అక్కడి నాయకుడు ప్రయత్నిస్తుంటే... ఆ సీఐ మాత్రం పొదిలిలో పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

*● జిల్లాలో బెట్టింగ్‌లకు పేరున్న ఓ సర్కిల్‌ అది. ఏడాది కిందటే అక్కడి సీఐ బదిలీ అయ్యారు. ప్రస్తుతం నిఘా విభాగంలో పని చేస్తున్నారు. ఆయనపైనా ఓ వర్గం, ఓ పార్టీ ముద్ర బలంగా ఉంది. ఎన్నికల్లో పూర్తిగా ఏకపక్షంగా పనిచేశారని ఆరోపణలున్నాయి. ఈయన్ను మార్కాపురం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

*● జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎన్నిక జరిగిన ప్రాంతంలోని ఓ సీఐకి ఈ బదిలీల్లో అప్రాధాన్య పోస్టింగ్‌ ఇచ్ఛి.. తన ప్రతాపం చూపించాలని ఓ నాయకుడు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అధికారి మాత్రం మరో నాయకుడి ద్వారా తనకు అనుకూలమైన స్థానం ఖరారు చేసుకున్నట్టు వినికిడి.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.