close

తాజా వార్తలు

వ్యాపారం పేరుతో ఘరానా మోసం

రూ.5 లక్షలకు పైగా విలువచేసే పట్టుచీరలను తీసుకెళ్లిన వైనం

డబ్బులిస్తామంటూ కారులో తీసుకెళ్లి.. మధ్యలోనే దించివేత..

పోలీసుల అదుపులో అనంతపురం జిల్లా వాసి

రూ.4.79 లక్షల విలువ చేసే సరకు స్వాధీనం

నిందితుడు అశోక్‌. అతని నుంచి స్వాధీనం చేసుకున్న పట్టుచీరలతో

సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ బలరామిరెడ్డి తదితరులు

 

వస్త్రవ్యాపారులను బురిడీ కొట్టించి లక్షల రూపాయల విలువచేసే పట్టుచీరలతో ఉడాయించింది ఓ ముఠా. అయితే దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే ముఠాలోని ఒకరిని పట్టుకోవడమే గాక దాదాపు 90 శాతానికి పైగా సరకును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం బుచ్చిరెడ్డిపాళెంలో చోటుచేసుకుంది. ఈ ఉదంతం వివరాలను సోమవారం బుచ్చి సీఐ సురేష్‌బాబు, ఎస్‌.ఐ. బలరామిరెడ్డిలు విలేఖరులకు వివరించారు.

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: బుచ్చిరెడ్డిపాళెం మండల కేంద్రానికి చెందిన సోమ పుల్లయ్య, ఆయన స్నేహితులు కలసి స్థానికంగా పట్టుచీరలు తయారుచేస్తున్నారు. వాటికి మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు వారు ‘జస్ట్‌ డయల్‌’ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వ్యాపారానికి సంబంధించిన సమాచారం పెట్టారు. ఆ సమాచారాన్ని అప్పటికే మోసాలు చేయడంలో ఆరితేరిన అనంతపురం జిల్లా, ధర్మవరం పట్టణానికి చెందిన ఓ ముఠా తెలుసుకుంది. ఎలాగైనా ‘ఛీటింగ్‌’కు పాల్పడి, వారి వద్దనున్న పట్టుచీరలను తీసుకెళ్లాలని పన్నాగం పన్నింది. ఆన్‌లైన్‌లో వీరితో పరిచయం పెంచుకుంది. జీఎస్టీతో ‘అక్షయ శిల్క్‌ శారీస్‌’ అనే అంగడి ఉన్నట్టు ఫొటోలను వాట్సాప్‌లో పెట్టింది. అందులో భాగంగా ఈనెల 13న ధర్మవరానికి చెందిన కేశాని అశోక్‌, బీదల సంజీవరెడ్డి, రుద్ర రెడ్డప్పలు ‘ఏపీ02 బీఆర్‌ 2822’ అనే నంబరుగల కారులో బుచ్చిరెడ్డిపాలేనికి వచ్చారు. సోమ పుల్లయ్య, ఆయన స్నేహితులు పప్పు నారాయణరావు, నారే ప్రసాద్‌, కలిగిరి శ్రీనివాసులతో మాట్లాడారు. వారి వద్ద 379 పట్టుచీరలను కొనుగోలు చేశారు. ఒక్కొక్క చీర విలువ రూ.350 నుంచి రూ.23 వేల వరకు ఉంది. వీటి మొత్తం విలువ సుమారు రూ.6 లక్షలకు పైగా ఉంటుంది. వారికి ‘గూగుల్‌ పే’ ద్వారా రూ.88 వేలు, అలాగే నగదు రూ.10 వేలు చెల్లించారు. మిగతా సొమ్మును కారులో తమతో వస్తే చెల్లిస్తామని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన పుల్లయ్య బృందం చీరలను వారికి అప్పగించింది. వారితో పాటు సోమ పుల్లయ్య కారులో బయలుదేరారు. మార్గంమధ్యలో ఆత్మకూరు మండలం, కరటంపాడు వద్ద ఇరుకుగా ఉందంటూ వారు కారును ఆపారు. తమ మనిషితో కలసి బస్సులో రావాలంటూ పుల్లయ్యకు చెప్పారు. ఆయన్ను బయటకు నెట్టేసి వారు కారులో ఉడాయించారు. ఆ తర్వాత వారి చరవాణి నంబర్లు మూగబోయాయి. వారి ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ఎలాంటి వివరాలూ తెలియకపోవడంతో తాము మోసపోయినట్టు గుర్తించి ఈనెల 22న బుచ్చి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిని సవాల్‌గా తీసుకున్న బుచ్చి సీఐ సురేష్‌బాబు ప్రత్యేక బృంతంతో నిఘా పెట్టారు. ఈ ఛీటింగ్‌ ముఠా ఇక్కడ కొట్టేసిన చీరలను చీరాలలో అమ్మేందుకు తీసుకెళుతుండగా.. బుచ్చిరెడ్డిపాళెం ఎస్‌ఐ బలరామిరెడ్డి ముఠాలో ఒకరైన కె.అశోక్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.4.79 లక్షల విలువ చేసే 337 పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన ఏఎస్‌ఐ టి.విజయభాస్కర్‌, కానిస్టేబుళ్లు టి.సురేష్‌బాబు, మురళీకష్ణలను సీఐ అభినందించారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.