close

తాజా వార్తలు

ఉక్కపోత

 విద్యుత్తు సరఫరాలో నిత్యం అంతరాయం గ్రామాల్లో అధికం 

 రాత్రివేళల్లోనూ ఇదే పరిస్థితి

ఈనాడు-తిరుపతి: వాతావరణం అనుకూలించక ఉక్కబోతతో అల్లాడుతున్న జిల్లా ప్రజలకు విద్యుత్తు శాఖ కరెంటు షాక్‌లిస్తోంది. నిత్యం గ్రామాల్లో అనధికారిక విద్యుత్తు కోతలను అమలు చేస్తూ ప్రజల్లో అసహనం పెంచుతోంది. విద్యుత్తు అంతరాయాల దెబ్బకు సామాన్య ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. జులై నెల సగం పూర్తయినా ఇప్పటికీ వర్షాలు లేకపోవడంతో రాత్రీపగలూ వాతావరణంలో ఉక్కపోత ఉంటోంది. ఇలాంటి సమయంలో విద్యుత్తులో రోజంతా అంతరాయాలు ఏర్పడటం ప్రజల్ని నరకయాతనకు గురి చేస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చంటిపిల్లలు మహిళలు ఇళ్లలో ఉండలేక బయటకు రావాల్సిన పరిస్థితి వస్తోంది. మరోవైపు విద్యుత్తు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో విద్యుత్తు కోతలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. గ్రామాల్లో ఇప్పటికే అనధికారికంగా విద్యుత్తు కోతలు అమలవుతున్నాయి. విద్యుత్తు నిర్వహణ, వర్షాలు, గాలిదుమారం పేరుతో ఇష్టానుసారంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడటంతో గ్రామాల్లో విద్యుత్తు కోతలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు సుమారు 2 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్తు కోతలు అనధికారికంగా అమలవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 24 గంటల విద్యుత్తు సరఫరా బాగానే అమలయింది. గత కొద్ది రోజుల వరకూ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే గత కొంత కాలంగా ఉదయం నుంచి రాత్రి వరకూ ఏదో ఒక సమయంలో అరగంట నుంచి గంటలకు గంటలు విద్యుత్తు నిలిపివేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు.

ఇలా రోజుకు కనీసం మూడు గంటల వరకు విద్యుత్తు ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఒక్కోసారి రాత్రి సమయంలో విద్యుత్తును తీసివేస్తుండటంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా సరఫరాలో సాంకేతిక అంతరాయం ఏర్పడిందని అందువల్లనే విద్యుత్తు సరఫరాలో సమస్య ఏర్పడిందని సమాధానం ఇస్తూ వస్తున్నారు. అయితే ఫోన్‌ చేసిన గంట, రెండు గంటల వరకూ విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరిగే పరిస్థితి కనిపించట్లేదు. సాధారణంగా భారీ వర్షాలు, పెద్ద ఎత్తున గాలిదుమారం వచ్చి విద్యుత్తు వైర్లు తెగిపడినప్పుడు మాత్రమే విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అయితే జిల్లా పరిధిలో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో కేవలం 26 మండలాల్లో మాత్రమే సాధారణ అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరో 24 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 16 మండలాల్లో అతి తక్కువ వర్షం పడింది. ఒకవైపు ఈ పరిస్థితుల్లో తాగు, సాగు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు విద్యుత్తు కోతలు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

డిమాండుకు తగ్గ సరఫరా లేదా..?

సాధారణంగా జిల్లా పరిధిలో ప్రతి రోజు సుమారు 18 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉపయోగిస్తున్నారు. వ్యవసాయానికి నిరంతరం 9 గంటల విద్యుత్తు కూడా దీనిలో నుంచే వినియోగిస్తున్నారు. జిల్లా పరిధిలో చూస్తే తిరుపతి చుట్టు పక్కల ఉన్న గ్రామాలతో పాటు పీలేరు, పాకాల, పలమనేరు, ఇతర పశ్చిమ మండలాల్లో ఇష్టానుసారం కోతలు విధిస్తున్నారు. రాత్రిపగలూ తేడా లేకుండా సరఫరాకు అంతరాయం కలుగుతోంది. అధికారులను అడిగితే వర్షాలకు అంతరాయం ఏర్పడిందని చెబుతున్నా, చుక్క వర్షం పడకున్నా కరెంటు పోతోందని గ్రామీణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిందంటే తెల్లవార్లూ జాగారం చేయాల్సిందే. ఈ అనధికార విద్యుత్తు కోతలకు వెంటనే స్వస్తి పలికి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలన్నది జిల్లా ప్రజల ఆకాంక్ష.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.