Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధనపిశాచి ఉందని కట్టుకథ

రాగి వస్తువులకు బంగారు పూత

బంగారు పూత వేసిన వస్తువులు

 

శింగనమల, న్యూస్‌టుడే: ఇంట్లో గుప్త నిధి ఉందని, వెలికి తీస్తామని రూ.18లక్షలు టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దొరికిన గుప్త నిధి మూడు నెలల వరకు చూడకూడదని భయపెట్టడంతో ఈ ఉదంతం ఇప్పుడు బహిర్గతమైంది. బాధితులు పోలీసులను గురువారం ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. శింగనమలకు చెందిన దిల్‌షద్‌ అనే మహిళ తనకు ఆరోగ్యం బాగాలేదని, మాంత్రికుడిని పిలిచి యంత్రం వేయించమని భర్త అన్వర్‌బాషాను కోరింది. ఇదే మండలం సోదనపల్లికి చెందిన స్నేహితుడు మారుతికి సమస్య వివరించారు. ఆయన రాప్తాడు మండలం కందుకూరులోని మరో వ్యక్తి ఓబులేసుకు విషయం తెలిపారు. ఓబులేసు పుట్టపర్తిలోని అశోక్‌ అనే మాంత్రికుడిని శింగనమలకు తీసుకొచ్చారు. ఇంట్లో ధనపిశాచి ఉందని ఆ ధనం బయటికి తీస్తానని ఆ మాంత్రికుడు తెలిపారు. రూ.10లక్షలు ఖర్చు చేసుకొంటే సుమారు పది కిలోల బంగారం వస్తుందని నమ్మించారు. భార్యాభర్తలు మొదట రూ.4లక్షలు అప్పు చేసి మాంత్రికుడు అశోక్‌కు ఇచ్చారు. ఆ రోజు రాత్రికే ఇంట్లో వారిని బయటికి పంపి బంగారు పూత ఉన్న రెండు రాగి చెంబులు, నగలు, బిస్కెట్‌ ఆకారంలో ఉన్న వాటిని తీసి చూపించాడు. వాటి నుంచి ఒకటి బయటికి తీసి బంగారం దుకాణానికి వెళ్లి పరీక్షించుకోవాలని తెలిపాడు. మిగిలిన వాటిని ఓ పాత్రలో వేసి మూసి వేయించాడు. మూడు నెలల వరకు వాటిని బయటికి తీయొద్దని, తీస్తే దంపతుల్లో ఎవరో ఒకరు మృతి చెందుతారని భయపెట్టాడు. అన్వర్‌బాషా, మారుతి ఇద్దరు కలిసి బంగారు దుకాణంలో వస్తువులను చూపించారు. అది బంగారని తేలింది. మిగిలిన వస్తువులన్నీ బంగారమే అని నమ్మారు. ఆ తర్వాత రూ.6లక్షలు మాంత్రికుడికి ఇచ్చారు. మారుతి కూడా ఆ మాంత్రికుడిని తన ఇంటికి తీసుకెళ్లి చూపించారు. అక్కడ ధనం ఉందని రూ.4లక్షలు తీసుకొన్నాడు. మరవకొమ్మ వద్ద హోటల్‌ నడుపుతున్న సత్యనారాయణ వద్ద రూ.4లక్షలు తీసుకొని బంగారం వెలికి తీస్తానని నమ్మించాడు. దిల్‌షద్‌ మూడు నెలల తర్వాత పాత్రను తెరిచి చూసింది. వాటిలో రాగి పాత్రలు, వస్తువులు కనిపించాయి. దీంతో మధ్యవర్తిగా వ్యవహరించిన ఓబులేసుకు విషయం తెలిపారు. మాంత్రికుడు ఎవరో తెలియదని, ఎక్కడ ఉన్నాడో జాడ లేదని బాధితులకు సమాధానం ఇచ్చాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ చేపట్టారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన