close

తాజా వార్తలు

దృష్టి పెడితే.. ఆదాయం ఆనందం

కొండపల్లి(ఇబ్రహీంపట్నం),న్యూస్‌టుడే: పర్యాటకులు కొండపల్లి కోట అందాలు..దానిలోని మ్యూజియంను చూసి ఆనందించడానికి ఆర్టీసీ నూతనంగా తమ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉదయం, మధ్యాహ్నంతో పాటు సాయంత్రం చివరి ట్రిప్‌ను శని, ఆదివారాల్లో విజయవంతంగా నిర్వహించారు. విజయవాడ బస్టాండ్‌ నుంచి ఖిల్లా వరకు ఏర్పాటు చేసిన ఈ బస్సు సర్వీసు గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతో కోటను సందర్శించే ప్రయాణికుల సంఖ్య సంతృప్తిగా ఉందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే భవానీపురంలోని భవానీ ఐలాండ్‌ మాదిరిగా కొండపల్లి కోట విషయంలో కూడా పర్యాటక శాఖ శ్రద్ధ చూపి ప్రత్యేక దృష్టి సారించి చిన్న సమస్యలు పరిష్కరిస్తూ బస్సు సర్వీసులతో పాటు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేయగలిగితే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పర్యాటకులు, ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై న్యూస్‌టుడే ప్రత్యేక కథనం.


ఇబ్రహీంపట్నం జాతీయ రహదారి నుంచి కోట వరకు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంది. బూడిద చెరువు ప్రారంభం నుంచి కోట వద్దకు 19 మలుపులు ఉన్నాయి. 6 చోట్ల పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే ఈ మలుపుల వద్ద ఎదురెదురుగా వాహనాలు వస్తే ఒకదానిని ఒకటి దాటే క్రమంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. 


ఇప్పుడే ఇబ్బంది: ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలు, కార్లపైనే కోట వద్దకు రాకపోకలు సాగించినందున ఏ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు సిటీ బస్సులు రాకపోకలు చేయడంతో ఇతర వాహనాలకు మలుపుల్లో ఇబ్బంది కలుగుతుంది. 


మార్జిన్లు సక్రమంగా ఉండాలి - కె.రాంబాబు ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ 

కోటకు చేరుకోవడానికి రహదారికి ఇరువైపుల ఉన్న మార్జిన్లను అభివృద్ద్ధి చేయాలి. ఆదివారం నాడు కోటకు ప్రయాణం సాగించిన మూడు ట్రిప్పుల్లోనూ పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. రహదారి వెంట ఉన్న మార్జిన్‌ వద్ద బస్సు చక్రాలు దిగిపోతున్నాయి. అక్కడ మట్టిని పోసి  పటిష్టం చేసి పరిశుభ్రం చేయాలి. మలుపుల వద్ద బస్సు ఆపుకొనే సౌకర్యాన్ని కల్పించాలి. ఎదురుగా వచ్చే వాహనం సురక్షితంగా వెళ్లిపోవాలంటే అందుకు తగ్గ రహదారి అవసరం. కొండ ప్రాంతంలో రహదారి మొత్తం విస్తరణ చేయాలంటే అసాధ్యం కాబట్టి మలుపుల వద్ద వాహనాలు నిలుపుకొనే సౌకర్యాన్ని కల్పించేలా మార్జిన్లు విస్తరించాలి. కోట నుంచి బూడిద చెరువు ప్రాంతం వరకూ ఉన్న తారు రోడ్డు పక్కన బండరాళ్లు జారిపడి ఉన్నాయి. వాటిని తొలగించడంతో పాటు రాళ్లు పడే ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు రహదారి పక్కన ఉన్న కంపను తొలగిస్తే బస్సుల రాకపోకలతో పాటు ద్విచక్రవాహనదార్లకు, కార్లకు ఇబ్బంది లేకుండా ప్రయాణాలు సాగుతాయి. సాధారణ ఆర్టీసీ బస్సులు కాకుండా దుర్గ గుడికి కేటాయించిన విధంగా చిన్న బస్సులను కేటాయిస్తే ఇబ్బంది లేకుండా ప్రయాణాలు భద్రంగా, సుఖంగా సాగుతాయి. 

వెలుగులు అవసరం 

కోట మార్గంలో ఎలాంటి విద్యుత్తు దీపాల సౌకర్యం లేదు. దీంతో సాయంత్రం వెళ్లేవారు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

ఎత్తు పెంచాలి

మలుపుల ప్రాంతంలో ఆరు చోట్ల రాళ్లతో గోడలు నిర్మించి ఉన్నాయి. బస్సు రాకపోకల సమయంలో ఎదురుగా వచ్చిన వాహనం అక్కడ పక్కకు వెళితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. 

లేజర్‌ షో పునరుద్ధరిస్తే

ఫిబ్రవరిలో కోట తూర్పు భాగంలో లేజర్‌ షోను ఏర్పాటు చేశారు. అయితే పర్యాటకులు రాత్రి 8 గంటల వరకు ఉండి తిరిగి వెళ్లేందు బస్సు సౌకర్యం లేక కొంతకాలం కొనసాగించి నిలిపివేశారు. ప్రస్తుతం బస్సు సౌకర్యం కల్పించిన నేపథ్యంలో లేజర్‌ షో చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. 

మెట్లమార్గం అభివృద్ధి

కొండపల్లి నుంచి ఉన్న మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పటికే ఈ మార్గంలో విద్యుత్తు లైన్లు ఉండటంతో విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేస్తే ఈ మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు సంఖ్య పెరుగుతుంది. వారు ఎటువంటి భయం లేకుండా వెళ్లి లేజర్‌ షోను కూడా చూస్తారు. దీని వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.
 


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.