close

తాజా వార్తలు

నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి

నిర్మాణంలో ఉన్న పంప్‌హౌస్‌ కూలి కార్మికుడి మృతి

 నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు

 

సంఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌..

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడే శనివారం సంఘటన జరిగినట్లు విమర్శలొస్తున్నాయి. తిరుపతి నగరపాలిక మున్సిపల్‌ పార్కు పంప్‌ హౌస్‌ నిర్మాణం నేలకొరిగిన సంఘటనలో ఒడిశాకు చెందిన బచ్చుసింగ్‌ దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అమృత్‌ పథకం ద్వారా తిరుపతి నగరపాలిక పరిధిలో 11 ప్రాంతాల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంకర్లు నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం మున్సిపల్‌ పార్కులో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌కు నీటిని నింపేందుకు దాని సమీపంలోనే ఉన్న స్కాడా కంట్రోల్‌ కమాండ్‌ కేంద్రానికి ఆనుకుని పంప్‌హౌస్‌ నిర్మాణం చేపట్టారు. రూ.25 లక్షలతో నిర్మిస్తున్న పంప్‌హౌస్‌ను 30 అడుగుల ఎత్తు నిర్మిస్తున్నారు. భూమి నుంచి పిల్లర్లు నిర్మించి దానిపైన పైకప్ప్పు(శ్లాబ్‌) పనులు శనివారం ఉదయం ప్రారంభించారు. పైకప్పు నిర్మాణం కోసం 30 అడుగుల ఇనుప సెంట్రింగ్‌ ఏర్పాటు చేశారు. పైకప్పుపైన ఇనుప కమ్మీలను పేర్చి కాంక్రీటు వేశారు. కాంక్రీటు వేస్తున్న సమయంలో ఓ వైపు కాస్త హెచ్చుతగ్గులు కనిపించడంతో గుత్తేదారు కిందకు దిగి పరిస్థితిని పరిశీలించాలని అక్కడ పనిచేస్తున్న కార్మికులకు చెప్పడంతో నలుగురు కిందకి దిగి ఇనుప పైపులను జాకీల సాయంతో సర్దుబాటు చేస్తుండగా సెంట్రింగ్‌ దెబ్బతింది. గమనించిన ముగ్గురు కార్మికులు చాకచక్యంగా బయటపడ్డారు. ప్రసాద్‌, బచ్చుసింగ్‌ బయటకు వచ్చే లోపు పైన ఉన్న కాంక్రీట్‌ మొత్తం జారి వారి మీద పడిపోయింది. అదే సమయంలో సెంట్రింగ్‌కు వినియోగించిన ఇనుప పలకలు బచ్చుసింగ్‌ మీద పడడంతో ఆయన సెంట్రింగ్‌ మధ్య చిక్కుకుని మృతి చెందాడు. తీవ్రగాయాలతో బయటపడిన ప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు. సెంట్రింగ్‌ మధ్య చిక్కుకున్న బచ్చుని నాలుగు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. పూర్తి విచారణలో అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసే అవకాశం ఉంది.

మృతుని కుటుంబానికి పరిహారం

సంఘటన జరిగిన వెంటనే తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అక్కడికి వాహనాలు చేరే అవకాశం లేకపోవడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే నగరపాలిక ఉపకమిషనర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి, మున్సిపల్‌ ఇంజినీర్‌లు చంద్రశేఖర్‌, వెంకటరామ్‌రెడ్డి, ప్రణాళికాధికారి మురళీగౌడ్‌ అక్కడికి చేరుకున్నారు. సంఘటన వివరాలను సెలవులో ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషకు తెలిపారు. కమిషనర్‌ ద్వారా రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్ట్టికి తీసుకెళ్లారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ, నగరపాలిక అధికారులు చర్చించి ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉన్న రూ.2 లక్షల పరిహారంతో పాటు, గత్తేదారు నుంచి రూ.3 లక్షలు అందేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. తిరుపతి ఎమ్మెల్యే కుమారుడు అభినయ్‌ అక్కడికి చేరుకుని ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారంపై చర్చిస్తామని హామీ ఇచ్చారు.

బచ్చు మృతదేహాన్ని బయటకు తీసుకొస్తున్న దృశ్యం


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.